కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-15T10:20:43+05:30 IST

ఎస్పీఎం కార్మికులను పూర్తి స్థాయిలోకి విధుల్లోకి తీసుకోవాలని ఎస్పీఎం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌, నెగోషియేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మిల్లు

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ఎస్పీఎం గేటు ఎదుట నిరసన

మద్దతు తెలిపిన అఖిల పక్షం నాయకులు


కాగజ్‌నగర్‌, ఆగస్టు 14: ఎస్పీఎం కార్మికులను పూర్తి స్థాయిలోకి విధుల్లోకి తీసుకోవాలని ఎస్పీఎం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌, నెగోషియేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మిల్లు గేటు ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ మాజీ  శాసన సభ పక్ష నేత గుండా మల్లేష్‌ మాట్లాడారు. కొత్తగా వచ్చిన యాజమాన్యం ఈప్రాంత కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అధిక వేతనాలు చెల్లిస్తూ ఇక్కడి వారికి అన్యాయం చేస్తోందన్నారు. ఎస్పీఎంను 2014లో మూసివేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అప్పుడు ట్రేడ్‌యూనియన్‌ అధ్యక్షుడిగా మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. అధికారంలో ఉండి కూడా మిల్లు మూత పడుతున్నా ఆయన ఏలాంటి  చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అనంతరం కార్మికులు, పలు సంఘాల నాయకుల పోరాటాల ఫలితంగా  మిల్లు పునఃప్రారంభమైనట్టు తెలిపారు.  265 మంది ఉద్యోగులు, పర్మనెంటు కార్మికులు ఇంకా విధుల్లో చేరాల్సి ఉందన్నారు. యాజమాన్యం స్పందించి విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


కాంగ్రెస్‌ పార్టీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడతూ కొత్తగా వచ్చిన జేకే యాజమాన్యం ఒంటెత్తు పోకడలకు పోతోందన్నారు. ఈ ప్రాంత కార్మికులకు అన్యాయం చేస్తూ ఇతర రాష్ట్రాల  నుంచి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవడం దారుణమన్నారు. బీజేపీ సిర్పూరు తాలుకా ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికులను న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. టీడీపీ ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ గుళ్లపల్లి ఆనంద్‌ మాట్లాడుతూ 265 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉండగా ఇంత వరకు యాజమాన్యం స్పందించక పోవడం సరికాదని చెప్పారు. ఎస్పీఎం ఎంప్లాయీ స్‌ వెల్ఫేర్‌, నెగోషియేషన్‌ కమిటీ కన్వీనర్‌ సూర్య ప్రకాష్‌ మాట్లాడుతూ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యాజమాన్యానికి లేఖలు రాసినట్టు తెలిపారు. యాజ మాన్యం మాత్రం ఇప్పటికీ దీనిపై స్పందిచక పోవడం దారుణమని చెప్పారు. సీఐటీయూ నాయకుడు అంబాల ఓదెలు, సీపీఎం పట్టణ ప్రఽఽధాన కార్యదర్శి ముంజం ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  ఎస్పీఎం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌, నెగోషియేషన్‌ కమిటీ కో కన్వీనర్‌ వెంకటేష్‌, ఏఐటీయూసీ నాయకులు బోగె ఉపెందర్‌, ఏకేసింగ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగీర్‌, మాజీ కౌన్సిలర్‌ షబ్బీర్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:20:43+05:30 IST