పల్లెల్లో టెన్షన్‌

ABN , First Publish Date - 2020-05-19T10:13:52+05:30 IST

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులతో పల్లెల్లో టెన్షన్‌ మొదలైంది. లాక్‌డౌన్‌తో జిల్లాకు చెందిన వలస కార్మికులు ఆయా రాష్ట్రాల్లో

పల్లెల్లో టెన్షన్‌

జిల్లాకు చేరుకున్న 759 మంది వలస కార్మికులు

మహారాష్ట్ర నుంచి 560 మంది రాక

ఇళ్లలోకి రానివ్వని చుట్టు పక్కల ప్రజలు 

హోం క్వారంటైన్‌ను పట్టించుకోని కార్మికులు

ఇద్దరు వలస కార్మికులకు పాజిటీవ్‌తో కలకలం

చంద్రంపేట, నాగాయపల్లిలో ఇంటింటి సర్వే, హైపోక్లోరైడ్‌ పిచికారి


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) : ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులతో పల్లెల్లో టెన్షన్‌ మొదలైంది. లాక్‌డౌన్‌తో జిల్లాకు చెందిన వలస కార్మికులు  ఆయా  రాష్ట్రాల్లో చిక్కుకు పోయారు. దాదాపు 55 రోజులు దాటిన లాక్‌డౌన్‌లో ఇచ్చిన సడలింపులతో ఇళ్లకు చేరుకుంటున్నారు.  ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం, అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు ఆదివారం పాజిటివ్‌ రావడం వంటి పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి 1,032 మంది జిల్లాకు చేరుకొని హోం క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నారు. దాదాపు 40 రోజులు గడిచి పోయింది.  తాజాగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు వస్తుండడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి.


ఇతర రాష్ట్రాల్లో అనుమతులు పొంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చినవారిలో 759 మంది ఉన్నారు. వీరిలో ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వచ్చినవారే 560 మంది ఉన్నారు. మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు ఉండడంతో అక్కడి నుంచి తిరిగి వస్తున్న వారిని పల్లెల్లోకి రానివ్వడం లేదు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హోం క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అనేక మంది గుట్టు చప్పుడు కాకుండా ముంబై నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు.  అలా వచ్చిన కార్మికుల కుటుంబాల   సమాచారాన్ని చుట్టుపక్కల వారు అధికారులకు అందజేస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వారు చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లాలో కరోనా కేసులు లేవని భావిస్తున్న తరుణంలో ముంబై నుంచి వచ్చిన వలస కార్మికుల్లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది.


దీంతో   జిల్లాలో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటలో తొలికేసు నమోదైంది. వేములవాడలో నాలుగో కేసు.  ఇప్పటి వరకు 560 మంది ముంబై నుచిఇ రాగా ఆంధ్రా నుంచి 70 మంది, మధ్యప్రదేశ్‌ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి 20. రాజస్థాన్‌ 29, తమిళనాడు 40, ఉత్తరప్రదేశ్‌ 18, ఇతర రాష్ట్రాల నుంచి 17 మంది వచ్చారు. వీరందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. అయితే  క్వారంటైన్‌లో ఉండకుండా తిరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.   


నాగాయపల్లి, చంద్రంపేటలో అప్రమత్తం 

వేములవాడ రూరల్‌ మండలం నాగాయపల్లిలో, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో చంద్రంపేటలో ముంబై నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు చోట్ల కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేశారు. హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరుస్తున్నారు. ఆ ప్రాంతాలకు ఇతరుల రాకపోకలను నిలిపివేశారు. వారికి  మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఇంటింటి సర్వే చేపట్టారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిఘా ఉంచారు.  


Updated Date - 2020-05-19T10:13:52+05:30 IST