భార‌త్‌కు ప్ర‌పంచ బ్యాంక్ ఆర్థిక స‌హాయం ఎంతంటే...

ABN , First Publish Date - 2020-04-04T14:04:06+05:30 IST

కరోనా నియంత్రణ చర్యలకు గాను ప్రపంచ బ్యాంకు గురువారం 25 పేద దేశాలకు రూ.14 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపింది.

భార‌త్‌కు ప్ర‌పంచ బ్యాంక్ ఆర్థిక స‌హాయం ఎంతంటే...

25 పేద దేశాలకు రూ.14 వేల కోట్లు

ఆర్థిక సాయానికి ప్రపంచబ్యాంకు ఆమోదం

అత్యధికంగా ఇండియాకే రూ. 7 వేల కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: కరోనా నియంత్రణ చర్యలకు గాను ప్రపంచ బ్యాంకు గురువారం 25 పేద దేశాలకు రూ.14 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపింది. ఇందులో అత్యధికంగా రూ.7 వేల కోట్లకు పైగా నిధులను భారత్‌కే కేటాయించడం గమనార్హం. మొదటి విడత సహాయం కింద ఈ నిధులను విడుదల చేయడానికి ఆమోదం తెలిపినట్లు బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ తెలిపారు. 15 నెలల్లో అన్ని దేశాలకు కలిపి రూ.12.20 లక్షల కోట్లను అందిస్తామన్నారు. కాగా.. కరోనాపై నకిలీ వార్తల కట్టడికి రూ. 49 కోట్లు సమకూరుస్తామని గూగుల్‌ ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఫ్యాక్ట్‌ చెకర్లకు, నకిలీ వార్తల కట్టడికి కృషి చేస్తున్న ఎన్జీవోలకు అందజేస్తామని తెలిపింది.


ప్రజలు దేని గురించిన సమాచారం కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. ఆ సమాచారాన్ని ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచాలని కోరింది. కరోనా నియంత్రణకు బెంగళూరులోని పీఈఎస్‌ వర్సిటీ వీసీ దొరస్వామి రూ.5కోట్లు విరాళం అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పీఎం కేర్స్‌ ఫండ్‌కు తన వేతనం నుంచి రూ. లక్ష విరాళం ఇచ్చారు. ఫ్రీడం ఆయిల్‌ తయారీదారు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.  50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. దీంతో పాటుగా జీఈఎఫ్‌ ఇండియాలోని 640 మంది ఉద్యోగులు తమ ఒక రోజు జీతం రూ. 9.25 లక్షలను విరాళంగా అందజేశారు. హెల్త్‌కేర్‌ వర్కర్లకు అత్యవసర సమయాల్లో ప్రయాణించడానికి ఉచితంగా కార్లను అందజేస్తామని సెల్ఫ్‌ డ్రైవ్‌ స్టార్టప్‌ అయిన ‘రెవ్‌’ ప్రకటించింది.

Updated Date - 2020-04-04T14:04:06+05:30 IST