అభయమిదే మిత్రమా

ABN , First Publish Date - 2021-04-29T07:19:54+05:30 IST

కరోనా ఉధృతితో అల్లాడుతున్న భారతదేశానికి పలు దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. భారత్‌కు అండగా నిలవడానికి ముందుకొచ్చిన అమెరికా.. సాయాన్ని వేగవంతం చేసినట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు...

అభయమిదే మిత్రమా

  • భారత్‌కు సాయం వేగవంతం: బైడెన్‌
  • ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు,
  • ఉపకరణాలను పంపుతున్న పలు దేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: కరోనా ఉధృతితో అల్లాడుతున్న భారతదేశానికి పలు దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. భారత్‌కు అండగా నిలవడానికి ముందుకొచ్చిన అమెరికా.. సాయాన్ని వేగవంతం చేసినట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. రెమ్‌డెసివిర్‌ సహా ప్రాణాలను కాపాడే ఔషధాలను, ఇతర వైద్య పరికరాలను పంపుతున్నట్టు తెలిపారు. టీకాల ఉత్పత్తికి అవసరమైన యంత్రాల విడిభాగాలను పంపుతున్నట్టు చెప్పారు. ఇక.. ద్వీపదేశమైన సింగపూర్‌ రెండు సి-130 విమానాల్లో ఆక్సిజన్‌ సిలిండర్లను భారత్‌కు పంపింది. బుధవారం ఉదయం ఈ సిలిండర్లలోడును సింగపూర్‌ విదేశాంగ మంత్రి మాలికి ఉస్మాన్‌ ఆ దేశంలోని భారతరాయబారి పి.కుమరన్‌కు అందజేశారు. గత ఏడాది తాము కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్‌ తమకు చేసిన సాయాన్ని మాలికి గుర్తుచేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. టాటా గ్రూపు సింగపూర్‌ నుంచి నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను రప్పించింది. బ్రిటన్‌ కూడా 400 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను, కీలకమైన వైద్యపరికరాలను బుధ, గురువారాల్లో పంపుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే బ్రిటన్‌ నుంచి 200 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను బ్రిటన్‌ భారత్‌కు పంపింది. మరోవైపు.. దక్షిణ కొరియా కూడా భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను, కరోనా డయాగ్నస్టిక్‌ కిట్లను, ఇతర వైద్యపరికరాలను అందజేసేందుకు ముందుకొచ్చింది. అటు టెక్సాస్‌(అమెరికా)లోని ‘యూఎస్‌ ఇండియా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎ్‌సఐసీవోసీ)’ ఫౌండేషన్‌ భారత్‌కు 50 వెంటిలేటర్లను, ఇతర వైద్య పరికరాలను పంపుతోంది. తొలుత 20 వెంటిలేటర్లను మంగళవారం పంపింది. మరికొన్నిరోజుల్లో మిగతా 30 వెంటిలేటర్లను పంపుతామని పేర్కొంది. యూఎ్‌సఐసీవోసీ అధ్యక్షుడు నీల్‌ గొనుగుంట్ల నేతృత్వంలో ఆ ఫౌండేషన్‌ అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల నుంచి ఇందుకు అవసరమైన నిధులు సేకరించింది. అలాగే.. సేవా ఇంటర్నేషనల్‌(యూఎ్‌సఏ) అనే స్వచ్ఛంద సంస్థ అమెరికాలో నిధుల సేకరణ ప్రారంభించిన 100 గంటల్లోనే 47 లక్షల డాలర్లు(దాదాపు 35 కోట్లు) రావడం గమనార్హం. ఆ డబ్బుతో 2,184 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపేందుకు సిద్ధమైంది. ఇక.. కష్టంలో ఉన్న భారత్‌ను ఆదుకునేందుకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం రెడ్‌ క్రాస్‌ ద్వారా 1 మిలియన్‌ న్యూజిలాండ్‌ డాలర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.5.3 కోట్లు. మరోవైపు.. భారత్‌కు కోటి డాలర్ల(మన కరెన్సీలో దాదాపు రూ.60 కోట్లు) సాయం రెడ్‌క్రాస్‌ ద్వారా అందజేయనున్నట్టు కెన డా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ప్రకటించారు. భారత్‌కు సాయం చేయాలనుకుంటే రెడ్‌క్రాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేయవచ్చని కెనడా ప్రజలకు పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్‌ కూడా భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను, వెంటిలేటర్లను, ఉపకరణాలను పంపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.


శభాష్‌ బైడెన్‌..

భారతదేశానికి అండగా నిలవాలన్న జో బైడెన్‌ నిర్ణయాన్ని అమెరికన్‌ చట్టసభల సభ్యులందరూ స్వాగతించారు. ‘కొవిడ్‌ కారణంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్న భారత్‌కు సాయం చేయడాన్ని అమెరికా నైతిక బాధ్యతగా భావిస్తుంది. భారత ప్రజలకు సాయం అందించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటుంది’ అని ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా ఆస్ట్రాజెనెకా టీకా సరఫరా చేయాలని నిర్ణయించుకోవడం తనకు ఆనందం కలిగిస్తోందని భారత సంతతి అమెరికన్‌, ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. కాగా.. జోబైడెన్‌ ఫైజర్‌ సీఈవోతో మాట్లాడి, భారతదేశమే ఆరు నెలలు లేదా ఏడాదిపాటు ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒప్పిస్తారని ఆశిస్తున్నట్టు ప్రతినిధుల సభ సభ్యుడు, ఇండియన్‌-అమెరికన్‌ కాం గ్రె్‌సమ్యాన్‌ ఆర్‌వో ఖన్నా పేర్కొన్నారు. ఫైజర్‌, మోడె ర్నా వంటి టీకాలను మనదేశంలో ఉత్పత్తి చేయడానికి మేధోహక్కులు అడ్డువస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిబంధనను ఎత్తివేయాలని భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థను కోరుతోంది. భారత్‌ వాదనకు ఆర్‌వో ఖన్నా మొదటి నుంచీ మద్దతిస్తున్నారు. ఈ అంశం మే 5న ప్రపంచవాణిజ్య సంస్థ ముందుకు రానుంది. ఈలోగానే ఫైజర్‌ సంస్థ వేరే దేశాల్లో తన టీకా ఉత్పత్తికి అనుమతించాలని ఖన్నా కోరుతున్నారు. 


మేధోహక్కుల ఎత్తివేతపై అమెరికా యోచన?

ప్రస్తుత క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో.. కొవిడ్‌-19 వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి మేధోహక్కులను ఎత్తివేయాలని భారతదేశం చాలారోజులుగా కోరుతోంది. అమెరికా ఈ ప్రతిపాదనను పరిగణిస్తోందని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల ఉత్పత్తిని పెంచాలని అమెరికా కోరుకుంటోందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి మంగళవారం తెలిపారు. అయితే.. మేధోహక్కుల ఎత్తివేత అంశంపై మాత్రం సాకి మాట్లాడలేదు. ఉత్పత్తిని పెంచడానికి అదీ ఓ మార్గమని అభిప్రాయపడ్డ ఆమె.. దీనిపై బైడెన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి దేశీయంగానే ఉత్పత్తిని పెంచే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు.


Updated Date - 2021-04-29T07:19:54+05:30 IST