ఫిక్సింగ్‌కు ఆధారాల్లేవు

ABN , First Publish Date - 2020-07-04T08:37:58+05:30 IST

ప్రపంచ కప్‌-2011 ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువైంది. ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఈ

ఫిక్సింగ్‌కు ఆధారాల్లేవు

‘2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌’పై దర్యాప్తు నిలిపేసిన శ్రీలంక 

ఐసీసీ నుంచి కూడా క్లీన్‌చిట్‌


కొలంబో: ప్రపంచ కప్‌-2011 ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువైంది. ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఈ ఆరోపణలపై దర్యాప్తును శ్రీలంక ప్రభుత్వం నియమించిన ప్రత్యేక  బృందం నిలిపేసింది. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌కు శ్రీలంక అమ్ముడుపోయిందంటూ లంక మాజీ క్రీడాశాఖ మంత్రి అలుత్‌గమగె మహిందానంద ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఆ దేశంలో తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనె, అరవింద డిసిల్వాతో పాటు మరికొందరు ఆటగాళ్లను గంటలకొద్దీ విచారించిన ప్రత్యే క దర్యాప్తు బృందం.. ఆ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చింది. ‘ఫైనల్‌ మ్యాచ్‌లో జట్టులో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నదానిపై సంగక్కర, జయవర్ధనె, డిసిల్వా పూర్తి వివరణ ఇచ్చారు. విచారణ చేసిన తర్వాత.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందనడానికి మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అందుకే దర్యాప్తును నిలిపేస్తున్నాం. నివేదికను మేం క్రీడాశాఖ కార్యదర్శికి పంపుతున్నాం’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ ఫోన్సెకా శుక్రవారం వెల్లడించారు.

అంతా అవాస్తవం: ఐసీసీ ఏసీయూ: ఫైనల్‌ ఫిక్స్‌ అయిందన్న వార్తల్లో వాస్తవం లేదని ఐసీసీ కూడా తేల్చేసింది. ఈ ఘటనపై దర్యాప్తును నిలిపేస్తున్నట్టు లంక విచారణ బృందం ప్రకటించిన కొద్దిగంటల్లోనే ఐసీసీ కూడా ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు క్లీన్‌చిట్‌ ఇస్తున్నట్టు తెలిపింది. ‘ఆ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌పై వచ్చిన ఆరోపణలను ఐసీసీ సమగ్రతా విభాగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారించిన మాకు మ్యాచ్‌ ఫిక్స్‌ అయినట్టుగా ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఆ మ్యాచ్‌కు క్లీన్‌చిట్‌ ఇస్తు న్నాం’ అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జీఎం  అలెక్స్‌ మార్షల్‌ తెలిపాడు.  

Updated Date - 2020-07-04T08:37:58+05:30 IST