Colgate నుంచి Netflix వరకు.. ఈ 8 కంపెనీల మొట్టమొదటి బిజినెస్ ఏంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-12-29T18:50:57+05:30 IST

ప్రముఖ బ్రాండ్ `నోకియా` పేరు వినగానే మీకు ఏమి గుర్తుకు వస్తుంది? అందరికీ మొబైల్ ఫోన్ గుర్తుకు వస్తుంది.

Colgate నుంచి Netflix వరకు.. ఈ 8 కంపెనీల మొట్టమొదటి బిజినెస్ ఏంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ప్రముఖ బ్రాండ్ `నోకియా` పేరు వినగానే మీకు ఏమి గుర్తుకు వస్తుంది? అందరికీ మొబైల్ ఫోన్ గుర్తుకు వస్తుంది. `ఎల్జీ` పేరు వినగానే మదిలో ఏమి మెదులుతుంది? ఎలక్ట్రానిక్ పరికరాలు.. `కోల్గేట్` అనగానే టూత్ పేస్ట్ జ్ఞప్తికి వస్తుంది. అయితే ఆ కంపెనీలు మొదట ప్రారంభించిన ఉత్పత్తులు అవి కావు. `నోకియా` సంస్థ మొట్ట మొదట పేపర్ మిల్‌ను నడిపింది. ఎల్జీ సంస్థ తొలుత బ్యూటీ ప్రోడక్ట్స్‌ను ఉత్పత్తి చేసింది. `కోల్గేట్` పేరుతో మొదట సబ్బులు, కొవ్వొత్తులు బయటకు వచ్చాయి. ఇవే కాదు.. పలు ప్రముఖ కంపెనీలు మొదట్లో చేసిన బిజినెస్ ఏంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం.


నోకియా


నోకియా సంస్థ 1865లో ప్రారంభమైంది. తొలుత పేపర్ మిల్లును నడిపింది. ఆ తర్వాత పలు బిజినెస్‌లు చేసి 1960లో మొబైల్ ఫోన్ల తయారీలోకి దిగింది. ఆ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌గా ఎదిగింది. 


కోల్గేట్


1806లో కోల్గేట్ సంస్థను ప్రారంభించిన విలియం కోల్గేట్ మొదట్లో సబ్బులను, కొవ్వొత్తులను తయారు చేసేవారు. 1873లో సంస్థ తొలి టూత్‌పేస్ట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్‌గా వెలుగొందుతోంది. 


నెట్‌ఫ్లిక్స్


ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది చందాదారులను కలిగి ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మొదట్లో డీవీడీలను అద్దెకు ఇచ్చే కంపెనీగా ప్రారంభమైంది. 1998లో ప్రారంభమైన ఈ సంస్థ దాదాపు దశాబ్దం పాటు అదే బిజినెస్ చేసింది. ఆ తర్వాత రూటు మార్చి ప్రస్తుతం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలలో ప్రముఖమైన బ్రాండ్‌గా ఎదిగింది.


యూట్యూబ్


యూట్యూబ్‌ను మొదట్లో డేటింగ్ ప్లాట్‌ఫామ్‌గా రూపొందించారు. భాగస్వాముల కోసం వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా 2005లో దీనిని డిజైన్ చేశారు. ఆ తర్వాత అది ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది.


ఐటీసీ


ఇంపీరియల్ టొబాకో కంపెనీ (ఐటీసీ)ని 1910లో పొగాకు ఉత్పత్తులను అమ్మేందుకు ప్రారంభించారు. ఆ తర్వాత పొగాకు ఉత్పత్తులకు గిరాకీ తగ్గడం, నిషేధం ఎదురుకావడం వంటి కారణాలతో సంస్థ రూటు మార్చింది. ప్రస్తుతం ఆ సంస్థ ఎఫ్‌ఎమ్‌సీజీ, హోటల్, పేపర్ బోర్డ్, విద్య, లైఫ్‌స్టైల్ రంగాల్లో ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది.


అమేజాన్


ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బొజెస్ స్థాపించిన అమేజాన్ కంపెనీ మొదట్లో పుస్తకాలను మాత్రమే అమ్మేది. 1994, జులై 5న బొజెస్ ఈ సంస్థను స్థాపించి నాలుగేళ్లు పుస్తకాలను విక్రయించారు. 1998 నుంచి తమ విక్రయ జాబితాలో ఒక్కో వస్తువును జత చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా అమేజాన్ ఎదిగింది. 


ఎల్జీ


1947లో ప్రారంభమైన ఎల్జీ సంస్థ తొలి రోజుల్లో కాస్మొటిక్స్ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేది. 1958 నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వైపు మళ్లిన ఈ కొరియన్ కంపెనీ ఆ రంగంలో ప్రముఖ బ్రాండ్‌గా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంది. 


జెరాక్స్


ఫొటో కాపీ అనే పదానికి జెరాక్స్ అనేది పర్యాయపదంగా మారిపోయింది. నిజానికి జెరాక్స్ అనేది ఓ సంస్థ పేరు. జెరాక్స్ సంస్థ 1906లో ప్రారంభమైంది. మొదట్లో ఈ సంస్థ ఫొటోగ్రఫీకి సంబంధించిన వస్తువులను తయారు చేసేది. 1959లో సంస్థ తొలి జెరాక్స్ మిషన్‌ను తయారు చేసింది. ఆ తర్వాత ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను విక్రయించింది. 

 

Updated Date - 2021-12-29T18:50:57+05:30 IST