గుండె గల్లంతుకాకుండా!

ABN , First Publish Date - 2020-09-29T18:27:26+05:30 IST

కొవిడ్‌ సోకే అవకాశాలు గుండె ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌ రిస్క్‌ ఎక్కువ. కాబట్టి ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ గుండెను పదిలంగా

గుండె గల్లంతుకాకుండా!

ఆంధ్రజ్యోతి(29-09-2020)

కొవిడ్‌ సోకే అవకాశాలు గుండె ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌ రిస్క్‌ ఎక్కువ. కాబట్టి ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ గుండెను పదిలంగా ఉంచుకోవాలి. 


నేడు వరల్డ్‌ హార్ట్‌ డే

కొత్త జీవన విధానం!

చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం... ప్రస్తుతం పాటిస్తున్న ఇవే అలవాట్లను కొనసాగించాలి. 


టెలిమెడిసిన్‌!

అత్యవసరమైతే తప్ప ఆస్పత్రికి వెళ్లకూడదు. గుండె ఆరోగ్యం గురించి వైద్యులను ఫోన్‌ కాల్‌, వీడియో కాల్‌ ద్వారా సంప్రతిస్తూ, వారు సూచించే మందులు వాడుతూ ఉండాలి.


ఆరోగ్యకరమైన జీవనశైలి!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

వ్యాయామం చేయడం

తగినంత విశ్రాంతి తీసుకోవడం

క్రమం తప్పక రక్తపోటును పరీక్షించుకోవడం


కొవిడ్‌ సోకితే కనిపించే లక్షణాలు!

హృద్రోగుల్లో కొవిడ్‌ భిన్న లక్షణాలతో బయటపడుతుంది. అవేమిటంటే...


గుండె నొప్పి లేదా ఛాతి నొక్కుకుపోతున్న భావన మరీ ముఖ్యంగా వ్యాయామం చేసే సమయంలో ఇబ్బంది పెడుతూ ఉండడం.

ముఖంలో ఓ వైపు కండరాలు దిగువకు జారడం.

ఒక చేయి లేదా శరీరం ఓ వైపు స్పర్శ కోల్పోవడం.

మాటల్లో తేడా, మాటల్లో స్పష్టత లోపించడం.

కంటిచూపు తగ్గడం

విపరీతమైన తలనొప్పి

రాత్రుళ్లు ఊపిరి ఆడకపోవడంతో పాటు కాళ్ల వాపు, తలతిరుగుడు, స్పృహ కోల్పోవడం.


పదిలమైన గుండెకు పంచ సూత్రాలు!

గుండె ఆరోగ్యం నిక్షేపంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఇందుకోసం కొన్నిటిని అలవాటు చేసుకోవాలి, మరికొన్నిటిని మానేయాలి.


కరొనరీ హార్డ్‌ డిసీజ్‌కు ప్రధాన కారణం ధూమపానం. ఏడాది పాటు ధూమపానానికి దూరంగా ఉంటే, గుండె పోటు వచ్చే అవకాశాలు సగం తగ్గిపోతాయి. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి.

వారానికి కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. ఇందుకోసం రోజుకు 30 నిమిషాల చొప్పున కేటాయిస్తే సరిపోతుంది.

అధిక బరువు గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి కొవ్వులు, చక్కెర తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. 

ఆహారంలో అధిక పీచుపదార్థం ఉండేలా చూసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి రోజుకు కనీసం 30 గ్రాముల పీచు పదార్థం తీసుకోవాలి.

ఆహారంలో ఉప్పు తగ్గించాలి. తక్కువ ఉప్పుతో వండిన పదార్థాల రుచి ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంటకాల్లో ఉప్పు వాడకం క్రమేపీ తగ్గిపోతుంది. 


భారతదేశంలో గుండె జబ్బులు పెరగడానికి కాలుష్యం, ధూమపానం, అస్తవ్యస్థ జీవనశైలి లాంటివి ప్రధాన కారణాలు. మన దేశంలో గుండె జబ్బులు, సంబంధిత మరణాల సంఖ్య ఇలా ఉంది!


ఇండియన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం భారతదేశంలో ఏడాదికి 17 లక్షల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. 2030కి ఈ సంఖ్య 2.3 కోట్లకు చేరే అవకాశం ఉంది.

భారతదేశంలో నమోదయ్యే మ్తొతం గుండెపోట్లలో 50 ఏళ్ల లోపు వారు 50శాతం ఉంటే, 40 ఏళ్ల కన్న తక్కువ ఉన్నవారు 40శాతం మంది.

దేశంలోని సంభవించే మరణాలలో 25శాతం గుండె, మధుమేహ సంబంధితమైనవే.

గ్రామాలలో నివసించే వారితో పోలిస్తే పట్టణాల్లో నివసించే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువ.


Updated Date - 2020-09-29T18:27:26+05:30 IST