రాత మార్చిన కరోనా.. నివాసయోగ్య నగరాల జాబితాలో ఇప్పుడు ఇవే టాప్..!

ABN , First Publish Date - 2021-06-12T02:32:46+05:30 IST

హఠాత్తుగా దాడి చేసిన కరోనా వైరస్ ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేసింది.

రాత మార్చిన కరోనా.. నివాసయోగ్య నగరాల జాబితాలో ఇప్పుడు ఇవే టాప్..!

హఠాత్తుగా దాడి చేసిన కరోనా వైరస్ ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేసింది. కరోనాకు ముందు.. ఆ తర్వాత అనేలా స్పష్టమైన విభజన రేఖను గీసింది. ప్రపంచం మొత్తం కరోనాతో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నాయి. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌లు, కంటైన్మెంట్ జోన్‌లు, సరిహద్దులు మూసివేయడాలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం చాలా త్వరగానే వైరస్‌ను తుదముట్టించాయి. 


అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాతో అతలాకుతలమైనా న్యూజిలాండ్ వంటి చిన్న దేశం చాలా త్వరగా కరోనాను తరిమికొట్టింది. ఆస్ట్రేలియా సైతం కరోనా నుంచి త్వరగానే బయటపడింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచవ్యాప్త నివాసయోగ్య నగరాల జాబితాను తాజగా ప్రకటించింది. 140 నగరాలు ఉన్న ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన అక్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 


అక్లాండ్


న్యూజిలాండ్‌లోని ఉత్తర ద్వీపంలో భారీ మెట్రోపాలిటన్ నగరం అక్లాండ్. ఈ నగర జనాభా 14 లక్షలు. న్యూజిలాండ్‌లోని అత్యంత జనాభా కలిగిన నగరం ఇదే. 2015లో ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన జీవనం అనుభవిస్తున్న ప్రజలు గల నగరాల జాబితాలో అక్లాండ్ నగరం మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఈఐయూ ప్రకటించిన ప్రపంచవ్యాప్త నివాసయోగ్య నగరాల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది.


 ఒసాకా


ఈ జాబితాలో జపాన్‌కు చెందిన ఒసాకా నగరం రెండో స్థానంలో నిలిచింది. ఈ నగర జనాబా 26 లక్షలు. ఈ నగరం జపాన్ ఆర్థిక, సాంస్కృతిక రాజధాని. పానసోనిక్, షార్ప్ వంటి ఎలక్ట్రానిక్ సంస్థలు ఈ నగరం కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 


అడిలైడ్ 


దక్షిణ ఆస్ట్రేలియాకు రాజధాని అయిన అడిలైడ్ ఆస్ట్రేలియాలో అత్యంత జనాభా కలిగిన ఐదో పెద్ద నగరం. ప్రపంచవ్యాప్త నివాసయోగ్య నగరాల జాబితా-2019లో పదో స్థానంలో నిలిచిన ఈ నగరం తాజాగా మూడో స్థానానికి ఎగబాకింది. 


వెల్లింగ్టన్


న్యూజిలాండ్ రాజధాని అయిన వెల్లింగ్టన్ ప్రపంచవ్యాప్త నివాసయోగ్య నగరాల జాబితా-2021లో నాలుగో స్థానంలో నిలిచింది. అక్లాండ్ తర్వాత ఈ జాబితాలో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్ రెండో నగరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ.


 టోక్యో


ఒసాకా తర్వాత జపాన్ రాజధాని టోక్యో నగరం కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. వెల్లింగ్టన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నగర జనాభా 1.3 కోట్లు. ప్రపంచంలోని 500 ఫార్చూన్ గ్లోబల్ కంపెనీల్లో 36 ఈ నగరంలోనే ఉన్నాయి.


 పెర్త్


 పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని అయిన పెర్త్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ నగర జనాభా 21 లక్షలు. జనాభా పరంగా పెర్త్ ఆస్ట్రేలియాలో ఐదో పెద్ద నగరం. 


ఇంకా ఈ జాబితా టాప్-10లో జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా), బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) నిలిచాయి. ఇక, ఈ జాబితాలో ఐసిస్ బాధిత సిరియా నగర రాజధాని డమాస్కస్ చివరి స్థానంలో నిలిచింది. ఇక, 139వ స్థానంలో నైజీరియా నగరం లైగోస్ ఉంది.



Updated Date - 2021-06-12T02:32:46+05:30 IST