Abn logo
Apr 9 2021 @ 00:15AM

ప్రపంచ రికవరీ భేష్‌

ద్రవ్య, విత్త చర్యలు ఊతంగా జోరు


వాషింగ్టన్‌ : రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన మరో ఘోరమైన తిరోగమనం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ బాట పట్టిందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా జార్జీవా అన్నారు. అందులోనూ కోట్లాది మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం, ప్రభుత్వాలు ఇస్తున్న విధానపరమైన మద్దతు కారణంగా రాబోయే కాలం కూడా ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఆ విత్త, ద్రవ్యపరమైన చర్యలే లేకపోయి ఉంటే గత ఏడాది ఏర్పడిన తిరోగమనం మరింత దారుణంగా ఉండేదని, అది మరో మహా తిరోగమనంగా రికార్డు సృష్టించేదని ఆమె వ్యాఖ్యానించారు. ఐంఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు ఉమ్మడి సమావేశాలకు ముందు ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2022 సంవత్సరానికి వృద్ధి అంచనాను 4.4 శాతం నుంచి 6 శాతానికి ఇప్పటికే పెంచిన విషయం ఆమె గుర్తు చేశారు. ఈ వృద్ధి సంపన్న, వర్థమాన ఆర్థిక వ్యవస్థలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తున్న అంశమని పేర్కొంటూ పేద దేశాలు ఇప్పటికీ వేగవంతమైన వృద్ధి సాధనలో వెనుకబడే ఉన్నాయని ఆమె చెప్పారు. అయితే కొత్త కేసులు పెరుగుతూ ఉండడం ఉద్యోగ నష్టం, బోధన నష్టం, దివాలా, దారుణ పేదరికం, ఆకలి మంటలకు దారి తీయవచ్చని ఆమె ఆవేదన ప్రకటించారు. కాగా సభ్యదేశాలకు మద్దతు ఇచ్చేందుకు ఐఎంఎఫ్‌ 65 వేల కోట్ల డాలర్ల విలువ గల స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) ప్రతిపాదిస్తున్నదని ఆమె తెలిపారు. 


పేదదేశాల్లో వడ్డీ రేట్లు ఎక్కువే: ప్రస్తుత మహమ్మారి అనంతర కాలంలో ప్రపంచంలో అసమానతలు పెరిగిపోయాయని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్పాస్‌ అన్నారు. పేదదేశాల్లో వడ్డీ రేట్లు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా తగ్గినంత స్థాయిలో ఈ దేశాల్లో తగ్గలేదని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, ఇండియా ఊతంగా ప్రపంచం వేగవంతమైన వృద్ధిపథంలో అడుగు పెట్టడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. వర్చువల్‌ విధానంలో జరుగుతున్న ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ ఉమ్మడి సమావేశంలో వ్యాక్సిన్లు, వాతావరణ మార్పులు, రుణాలు, రికవరీ అంశాలపై చర్చించనున్నారు.


భారత రుణభారం జీడీపీలో 90 శాతం 

కొవిడ్‌-19 మహమ్మారి కాలంలో భారత దేశ రుణ భారం జీడీపీలో 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని ఐఎంఎఫ్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే దేశం వేగవంతమైన వృద్ధి బాట పట్టినందు వల్ల రాబోయే కాలంలో ఇది 80 శాతానికి తగ్గవచ్చని ఐఎంఎఫ్‌ ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పాలో మారో అన్నారు. తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న ప్రజలు, సంస్థలకు మద్దతు కొనసాగించడం తక్షణ ప్రాధాన్యం కావాలని ఆయన సూచించారు. అలాగే ప్రభుత్వ ఆర్థిక స్థితి అదుపులోనే ఉన్నదన్న భరోసా ప్రజానీకానికి, ఇన్వెస్టర్లకు ఇవ్వడం తప్పనిసరి అన్నారు. కాగా ప్రపంచ రుణ భారం ఇప్పుడు జీడీపీలో 97 శాతానికి చేరిందని, 2021లో 99 శాతానికి క్రమంగా పెరగవచ్చని ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ విటార్‌ గాస్పర్‌ చెప్పారు. మార్కెట్లలో సంక్షోభం ఏర్పడిన సమయంలో విశ్వాస పునరుద్ధరణ ప్రధానమని పేర్కొంటూ ఇందుకు తన వంతు సహాయం అందించేందుకు ఐఎంఎఫ్‌ సిద్ధంగా ఉన్నదని, ప్రస్తుతం ఐఎంఎఫ్‌ వద్ద లక్ష కోట్ల డాలర్ల నిధులున్నాయని గాస్పర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement