ప్రపంచీ కరోనా

ABN , First Publish Date - 2020-03-18T05:48:30+05:30 IST

ఒకప్పుడు విదేశీయాత్రలు జ్ఞానాన్ని మోసుకొచ్చేవి ఇప్పుడు రోగాలను వెంట తెస్తున్నాయి. విశ్వీకరణం అంటే ఇదే కాబోలు!...

ప్రపంచీ కరోనా

ఒకప్పుడు విదేశీయాత్రలు

జ్ఞానాన్ని మోసుకొచ్చేవి

ఇప్పుడు

రోగాలను వెంట తెస్తున్నాయి.

విశ్వీకరణం అంటే ఇదే కాబోలు!


కరోనా అంటే కిరీటం

ఇప్పుడిది

భయ మహా సామ్రాజ్యానికి

భస్మాసుర మకుటం

లోకాన్ని చిన్నగా కుదించిన

గ్లోబల్‌ విలేజ్‌ అంటే ఇదేనా!


ఒకప్పుడు

విదేశాల నుంచి తిరిగొస్తే

పూలదండలు ఎదురొచ్చేవి.

ఇప్పుడు వైద్యులు

బురఖాలు వేసి లాక్కపోతున్నారు.

ఇదో కొత్తరకం గత్తర

మనిషి ఆరోగ్యానికి కత్తెర.


ఈ ధనరాసులూ

ఈ అంబరచుంబి సౌధాలూ

వీటికి చేతులు మొలిచి

పరలోకానికి వీడ్కోలు చెప్తున్న భావన.


ఏమో!

ఇంటిబయట కరోనానేమో

అరెభాయ్‌!

దర్వాజా బంద్‌ కరోనా!

ఒక్క క్షణమైనా సరే

సమస్త మానవాళిని

ఏకం చేసింది కరోనా

దీనికో నమస్కారం

ఇదే మన తిరస్కారం

డా. ఎన్‌. గోపి

Updated Date - 2020-03-18T05:48:30+05:30 IST