తొలిరోజు వర్షార్పణం

ABN , First Publish Date - 2021-06-19T09:27:42+05:30 IST

క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ తొలి రోజు ఆటకు వరుణుడు బ్రేక్‌ వేశాడు.

తొలిరోజు వర్షార్పణం

టాస్‌ పడకుండానే ఆట రద్దు

డబ్ల్యూటీసీ ఫైనల్‌


సౌతాంప్టన్‌: క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ తొలి రోజు ఆటకు వరుణుడు బ్రేక్‌ వేశాడు. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందే వర్షంతో స్టేడియం ముద్దయింది. దీంతో టాస్‌ వేసేందుకు కూడా వీలు కాలేదు. భోజన విరామం తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం 5.30కి వర్షం కాస్త తగ్గడంతో రెండు గంటల తర్వాత మైదానం తనిఖీ చేసేందుకు నిర్ణయించారు. కానీ అప్పటికే గ్రౌండ్‌ అంతా చిత్తడిగా మారిపోయింది. ఆడే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రాత్రి 7.30కి తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన నాలుగు రోజులు కూడా వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండక పోవచ్చని అంచనా. అయితే ఈ పోరుకు రిజర్వ్‌ డే ఉంది. మరోవైపు వర్షాలు పడతాయని తెలిసీ ఈ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


తుది జట్టులో మార్పులు!:

ప్రస్తుతం సౌతాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కోహ్లీ సేన తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీమిండియా తమ 11 మంది ఆటగాళ్లను గురువారమే ఎంపిక చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంకా టాస్‌ పడలేదు కాబట్టి టీమ్‌ను మార్చుకోవచ్చు. ఆకాశం మబ్బులు పట్టి ఉండడంతో న్యూజిలాండ్‌ బౌలర్లకు ఇది మేలు చేయనుంది. అందుకే భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు బదులు మరో బ్యాట్స్‌మన్‌ను చేర్చవచ్చు. 


రిజర్వ్‌ డే తప్పదా?

డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకుపోవడంతో  రిజర్వ్‌డేన ఆడించే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు 23న రిజర్వ్‌ డే ఉందని ఐసీసీ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకన్నా ముందు నిర్ణీత సమయంలో 90 ఓవర్ల ఆట వీలుకాకుంటే సహజంగానే మరో అర్ధగంట సమయాన్ని పొడిగిస్తుంటారు. అలా కూడా సాధ్యం కానప్పుడు మర్నాడు అర్ధగంట ముందే మ్యాచ్‌ను ఆరంభించడం పరిపాటి. ఒకవేళ ఈ రెండు పద్దతుల్లోనూ కోల్పోయిన ఓవర్ల ఆట వీలు కానప్పుడు.. లేదా ఫలితం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రిజర్వ్‌ డేకు వెళ్లనున్నారు. కానీ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే మాత్రం ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. 

Updated Date - 2021-06-19T09:27:42+05:30 IST