నిత్యావసరాలకు పురుగు

ABN , First Publish Date - 2021-10-18T05:26:28+05:30 IST

మండల స్థాయి స్టాక్‌పాయింట్‌ గోడౌన్‌లో కంది బేడలు, వేరుశనగ విత్తనాలు పురుగులకు ఆహారమయ్యాయి.

నిత్యావసరాలకు పురుగు
ఈ చెత్త కుప్పలో ఉన్నది 232 వేరుశనగ విత్తన బస్తాలు

 రూ.అరకోటికి పైగా నష్టం


ఆదోని, అక్టోబరు 17: మండల స్థాయి స్టాక్‌పాయింట్‌ గోడౌన్‌లో కంది బేడలు, వేరుశనగ విత్తనాలు పురుగులకు ఆహారమయ్యాయి. దాదారు రూ.అరకోటి విలువ చేసే పప్పు దినుసులు పురుగు పట్టి పిండిగా మారాయి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్‌ బియ్యాన్ని పట్టుకుని గోదాములో నిల్వ ఉంచారు. వాటికి కూడా పురుగులు పట్టాయి. ఎంఎల్‌ఎస్‌ గోదాములో 144 క్వింటాళ్లు కందిబేడలు, 116 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను నిల్వ చేశారు. వీటితో పాటు చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు కూడా ఉన్నాయి. మార్కెట ధరల ప్రకారం పాడైపోయిన సరుకు విలువ రూ.50 లక్షలకు పైగానే ఉంటుంది. గోడౌన్‌లో ఉన్న స్టాక్‌ దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో గతంలోనే కథనం ప్రచురితమైంది. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, గోదాములో ఉన్న స్టాక్‌ను తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలు గడిచినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇతర సరుకులకు కూడా పురుగులు పట్టే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేసి, తక్కువ ధరలకు పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని భావించారు. దీనికోసం సరుకులను సిద్ధం చేసి గోదాములో నిల్వ ఉంచారు. ప్రభుత్వం మారడంతో విలేజ్‌ మాల్స్‌ గురించి అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దీంతో పురుగుపట్టి ఎందుకూ పనికిరాకుండాపోయింది. ఇదే గోదాములో ఉన్న కంది పప్పు, శనగ పప్పు, రేషన్‌ బియ్యానికి సైతం పురుగులు ఎక్కుతున్నాయని గోదాము నిర్వాహకులు వాపోతున్నారు. సరుకులు నిల్వ ఉంచి మూడేళ్లు అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని, దీంతో ఆహార పదార్థాలు వ్యర్థమయ్యాయని అంటున్నారు. 


ఇంకా తీసుకెళ్లలేదు


జాయింట్‌ కలెక్టర్‌ వీటిని తరలించాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఇంకా తీసుకెళ్లలేదు. వీటితో మాకేమి సంబంధం ఉండదు. రెవెన్యూ అధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. త్వరలో వీటిని తరలిస్తాం. 

- మునివేల్‌ పిళ్లై, గోదాము ఇన్‌చార్జి, ఆదోని 

Updated Date - 2021-10-18T05:26:28+05:30 IST