Abn logo
Jul 7 2020 @ 05:02AM

నరక యాతన..అధ్వానంగా గ్రామీణ రోడ్లు

చిన్నపాటి వర్షానికే చిత్తడవుతున్న రహదారులు

అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి

అత్యవసర సేవలకూ ఇబ్బందులు


ఆసిఫాబాద్‌, జూలై6: జిల్లాలో చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాలు నేటికీ రహదారులకు నోచుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షం వస్తే చాలు భయం గుప్పిట్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి నాటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. గ్రామాల్లో డయేరియా, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలినట్లయితే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 104, 108 వాహనాలు సైతం వెళ్లలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పాలకులు ఇచ్చిన హామీలు బుట్టదాఖలవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడం  వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


గ్రామీణ రోడ్లు అధ్వానం 

జిల్లాలో గ్రామీణ రహదారుల వ్యవస్థ అధ్వానంగా తయారైంది. దీంతో వందలాది గ్రామాల్లో వాగులు, వంకలు, అడవుల గుండా ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారుల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు సరిగ్గా లేకపోవడంతో నేటికీ పల్లెలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన అధ్యయనంలో మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలోని 449 గిరిజన గూడాలకు అసలే రోడ్డు సౌకర్యం లేనట్లుగా గుర్తించారు. ఇందులో ఆసిఫాబాద్‌ నియోజక వర్గానికి సంబంధించి అత్యధికంగా 305 గ్రామాలు ఉండగా సిర్పూర్‌ నియోజకవర్గంలో 144 గ్రామాలకు రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉన్నట్లు గుర్తించారు. 


జిల్లాలో రోడ్ల దుస్థితి

జిల్లాలోని అన్ని మండలాల్లో రహదారుల వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని హీరాపూర్‌,  గుడిగుడి, నందుపా, అప్పపల్లి, గొల్లగూడ, సాలెగూడ, మోవాడ, అడదస్నాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల రోడ్లు వర్షానికి చిత్తడిగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాంకిడి మండలంలోని సామెల, తేజిగూడ, కిర్డి, పిప్పర్‌గొంది, లక్ష్మిపూర్‌, వెలిగి, ఖేడేగాం, రోహిణిగూడ, కెరమెరి మండలంలోని నాగల్‌గొంది, కైరి, నీమ్‌గూడ, సావర్‌ఖేడ, ఉమ్రి, నిశానీ, సావర్‌ఖేడ, రెబ్బెన మండలంలోని పైకాజీగూడ, లక్ష్మిపూర్‌, జైనూర్‌ మండలంలో రావూజీగూడ, జామ్ని, లొద్దిగూడ, సోంజీగూడ, మర్కగూడ గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. 


సిర్పూర్‌(యూ) మండలంలో కొద్దిగూడ, చోర్‌పల్లి, బాండియేర్‌, చాప్రి, లింగాపూర్‌ మండల కేంద్రం తోపాటు మండలలోని పవర్‌గూడ, మామిడిపల్లి, మాన్కుగూడ, తిర్యాణి మండలంలోని అర్జున్‌లొద్ది, అల్లిగూడ, భీంరాల, మార్కగూడ, అమీన్‌గూడ, పంగిడి, పాతదంతన్‌పల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని రేకులగూడ, ఊట్‌పల్లి, కోలాంగూడ, గోంది, మెట్టుపల్లి, దుబ్బగూడ, మారెపల్లి, లైన్‌గూడ, ఎల్లాపూర్‌, నాయకపుగూడ, నవేగాం, జోగాపూర్‌, మానిక్‌పటార్‌, రాస్పెల్లి, బెజ్జూరు మండలంలో నాగులువాయి,  కుశ్నపల్లి, ఎల్కపల్లి,  నాగెపల్లి, మొగవెల్లి, కుకుడ, పోతెపల్లి, గెర్రెగూడ, తలాయి, తిక్కెపల్లి, అంబగట్టు, సిర్పూర్‌(టి) మండలంలోని ఇటిక్యాల పహాడ్‌, వెంకట్రావుపేట, దహెగాం మండలంలోని చౌక, పోలంపల్లి, మునళిగూడ, పెంచికలపేట మండలంలో దరోగపల్లి, పోతెపల్లి, గుంట్లపేట, పెంచిలకపేట, ఎల్లూరు, ఎర్రగుంట, చెడ్వాయి, కొండపల్లి, మొర్లిగూడ, గుండెపల్లి, కమ్మర్‌గాం తదితర గ్రామాల్లో రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రతినిత్యం రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బురదలోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్తున్నారు.


పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నా పాలకులు, అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీలను గుప్పించినా ఎన్నికల అనంతరం వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామీణ రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో ప్రతియేటా వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 


వర్షం కురిస్తే నడవలేని పరిస్థితి -సురేష్‌, సాలెగూడ

చిన్న వర్షం కురిస్తే చాలు రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో ప్రతి యేటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. మోకాళ్ల లోతు బురద ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు  రాలేని పరిస్థితి నెలకొంది. 

Advertisement
Advertisement