చెత్తగా.. చిత్తుగా

ABN , First Publish Date - 2021-10-25T07:10:38+05:30 IST

ఆకాశాన్నంటే అంచనాలు ఓ వైపు.. తీవ్ర భావోద్వేగాలు మరోవైపు. అంతేనా.. సూపర్‌స్టార్లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌.. అదరగొట్టే బౌలర్లు.. .....

చెత్తగా.. చిత్తుగా

భారత్‌ ఘోర వైఫల్యం పాకిస్థాన్‌ఘన విజయం

ఆకాశాన్నంటే అంచనాలు ఓ వైపు.. తీవ్ర భావోద్వేగాలు మరోవైపు. అంతేనా.. సూపర్‌స్టార్లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌.. అదరగొట్టే బౌలర్లు.. వావ్‌.. ఇంకేం కావాలి.. దాయాది పాక్‌కు ఈసారి కూడా చెడుగుడే అని అంతా భావించారు. కానీ దుబాయ్‌ మైదానంలో సీన్‌ పూర్తిగా రివర్స్‌ అయ్యింది. టీమిండియా ఓ పసికూనలా మారిపోగా అటు పాక్‌ ఎన్నడూలేని రీతిలో అన్ని విభాగాల్లోనూ చెలరేగింది. ఐసీసీ వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమపై వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన భారత్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. పాక్‌ యువ పేసర్‌ షహీన్‌ షా ఆరంభంలోనే ఇచ్చిన ఝలక్‌ నుంచి భారత బ్యాటర్స్‌ చివరి వరకు తేరుకోలేకపోయారు. ఆ తర్వాత మనోళ్ల బౌలింగ్‌ను గల్లీ స్థాయికి దించేస్తూ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ ఆడిన తీరును వామ్మో.. భారత్‌ ఫ్యాన్స్‌ గుర్తుంచుకోవడానికి కూడా ఇష్టపడరేమో.. వెరసి టీమిండియాకు ఘోర పరాజయం.


 సత్తాచాటిన ఓపెనర్లు బాబర్, రిజ్వన్

టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యధిక అర్ధసెంచరీలు (10) సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ. గేల్‌ (9), జయవర్ధనే (7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే పాక్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీలు చేయగా ఈ మ్యాచ్‌లోనే తొలిసారిగా అవుటయ్యాడు. 

టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థిపై పది వికెట్ల తేడాతో గెలిచిన నాలుగో జట్టుగా పాకిస్థాన్‌. 

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 200వ మ్యాచ్‌


దుబాయ్‌: టీ20 ప్రపంచక్‌పను టీమిండియా నిరాశాజనకంగా ఆరంభించింది. తొలి పోరు పాకిస్థాన్‌తో కావడంతో ఈ మ్యాచ్‌కు ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఆ అంచనాలను కోహ్లీ సేన ఏమాత్రం అందుకోలేకపోయింది. అటు ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఎదురైన ఐదు ఓటములకు పాక్‌ పది వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కోహ్లీ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57), పంత్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మాత్రమే మెరుగ్గా రాణించారు. షహీన్‌కు మూడు, హసన్‌ అలీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షహీన్‌ షా అఫ్రీది నిలిచాడు.


6 రన్స్‌కే 2 వికెట్లు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్స్‌ను పాక్‌ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అలాగే ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకోగలిగారు. మరోవైపు ఆరంభంలోనే యువ పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది తన ఇన్‌స్వింగర్లు, యార్కర్లతో వణికించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే రోహిత్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పాక్‌ ఆటగాళ్ల సంబరాలు మిన్నంటగా.. భారత్‌ ఫ్యాన్స్‌ షాక్‌లో మునిగిపోయారు. ఇదే జోరుతో తన మరుసటి ఓవర్‌లో రాహుల్‌ (3)ను ఓ అద్భుత డెలివరీతో బౌల్డ్‌ చేయడంతో మైదానంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బ్యాట్‌, ప్యాడ్‌ మధ్యలోంచి వెళ్లిన ఆ బంతిని రాహుల్‌ ఆడలేకపోయాడు. అప్పటికి స్కోరు కేవలం 6 పరుగులు మాత్రమే. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ (11) వరుస ఓవర్లలో ఓ సిక్సర్‌, ఓ ఫోర్‌తో ఆశాజనకంగా కనిపించాడు. కానీ అతడి దూకుడు కూడా ఆరో ఓవర్‌లోనే ముగిసింది. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 36/3తో ఉసూరుమనిపించింది. 


పంత్‌ రాకతో..: ఓవైపు వికెట్లు పడుతుండడంతో మరో ఎండ్‌లో కెప్టెన్‌ కోహ్లీ రక్షణాత్మకంగా ఆడాడు. అయితే రిషభ్‌ పంత్‌ రాకతో సీన్‌ మారింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా అతడు పాక్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో పరుగులు కూడా అదే వేగంతో వచ్చాయి. 12వ ఓవర్‌లో అతడు ఒంటి చేత్తో బాదిన రెండు వరుస సిక్సర్లు అద్భుతమనిపించాయి. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. కానీ అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో 13వ ఓవర్‌లో స్పిన్నర్‌ షాదాబ్‌ గూగ్లీకి పంత్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కోహ్లీ, జడేజా (13) కూడా భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌పై దృష్టి సారించారు. 16వ ఓవర్‌లో కోహ్లీ రెండు ఫోర్లతో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. అలాగే 18వ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో అతడు అర్ధసెంచరీని పూర్తి చేశాడు. కానీ ఇదే ఓవర్‌లో జడేజా వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక 19వ ఓవర్‌లో షహీన్‌.. కోహ్లీని అవుట్‌ చేసినా.. పాండ్యా రెండు ఫోర్లతో పాటు ఓవర్‌త్రోతో ఐదు పరుగులు రావడంతో 17 రన్స్‌ జత చేరాయి. కానీ చివరి ఓవర్‌లో హార్దిక్‌ వికెట్‌తో పాటు ఏడు పరుగులే రావడంతో భారీ స్కోరు దక్కలేదు.


మనోళ్లకు ఏమైంది?

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఎట్టకేలకు పాకిస్థాన్‌ జట్టు సాధించింది. పొట్టి ప్రపంచ కప్‌లో ఐదు పరాజయాల తర్వాత దాయాదిపై గెలుపు రుచి చూసింది. టీమిండియా ఓడినా..ఇంత భారీగా తేడాతో మ్యాచ్‌ కోల్పోవడం అభిమానులు జీర్ణించుకోలేనిదే. మరోవైపు దేశంతోపాటు విదేశాల్లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలం కావడం ఆశ్చర్యకరం. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చెప్పినట్టు ఒత్తిడంతా కోహ్లీసేనపైనే నిలిచింది. అలాగే యువ పేసర్‌ షహీన్‌ షా అఫ్రీది కూడా టీమిండియా టాపార్డర్‌ను పడగొట్టడమే లక్ష్యమని ప్రకటించి..అన్నంత పనీ చేశాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మను, సూపర్‌ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను అద్భుత ఇన్‌స్వింగింగ్‌ యార్కర్లతో అవుట్‌ చేసి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఆనక భారత ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన కెప్టెన్‌ కోహ్లీని కూడా ఓ చక్కటి బంతితో పెవిలియన్‌ చేర్చిన అఫ్రీది పాకిస్థాన్‌కు సగం విజయం అందించాడు. నిజానికి ప్రత్యర్థి జట్టుతో పోలిస్తే..మనోళ్లే మెగా టోర్నీకి బాగా సన్నద్ధమయ్యారు. నెలరోజులు సాగిన ఐపీఎల్‌లో ఆడడం, టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానంకోసం రేస్‌లో నిలిచిన ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం, రెండు వామప్‌ మ్యాచ్‌లలో అంతా సత్తా చాటడంతో పాక్‌పై పోరుకు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగారు. కానీ పాకిస్థాన్‌ బౌలర్లు ముఖ్యంగా పేసర్లు ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌ చేసి మన ‘టాప్‌’ బ్యాటర్లకు కళ్లెం వేశారు. టాపార్డర్‌ విఫలమైతే మిడిలార్డర్‌ ఆదుకుంటుందా..అన్న ప్రశ్న మ్యాచ్‌కు ముందే అందరినీ తొలిచింది. అదే వాస్తవమైంది. మిడిలార్డర్‌ బలహీనతే కొంప ముంచింది. కాకపోతే టాపార్డర్‌ ఇంత ఘోరంగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. అనుకోనివి జరగడమేకదా టీ20 ఫార్మాట్‌ ప్రత్యేకత. ఇకపోతే..పాక్‌ పేసర్లు యార్కర్లు, స్లో డెలివరీతో మనల్ని తిప్పలు పెట్టిన వికెట్‌పై బుమ్రా, షమి, భువనేశ్వర్‌ లాంటి అత్యంత సీనియర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. మంచు పాత్ర ఉందనుకున్నా కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేనంతగా అయితే లేదు. పాకిస్థాన్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజమ్‌, రిజ్వాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు కరెక్టే. కానీ ఈ జోడీలో ఒక్కరినైనా అవుట్‌ చేయకపోవడం పేసర్లతోపాటు స్పిన్నర్లు కూడా సఫలం కాలేకపోవడం విచిత్రం. ఏమైనా.. లేదు లేదనుకున్న ఒత్తిడే టీమిండియా కొంపముంచింది.


పూర్తిగా విఫలమయ్యాం

అనుకున్న విధంగా వ్యూహాలను అమలు చేయలేక పోయాం. అన్ని రంగాల్లో పాక్‌దే ఆధిపత్యం. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం మంచిది కాదు. ఆరంభంలోనే వికెట్లు కావాలి.. కానీ, వారు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇంకా 15-20 పరుగులు అదనంగా చేయాల్సి ఉంది. పాక్‌ బౌలర్లు ఏ దశలోనూ పుంజుకొనే అవకాశం ఇవ్వలేదు. అయితే, ఈ ఓటమితో దిగాలు పడాల్సిన అవసరం లేదు. టోర్నీలో మాకు ఇదే చివరి మ్యాచ్‌ కాదు..!  

- విరాట్‌ కోహ్లీ 


ఆడుతూ.. పాడుతూ: ఓ మాదిరి ఛేదనలో పాక్‌ ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. ఓపెనర్లు రిజ్వాన్‌, ఆజమ్‌ తమ ఫామ్‌ను కొనసాగిస్తూ స్కోరును కదం తొక్కించారు. ఏ ఒక్క బౌలర్‌ కూడా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో ఒత్తిడి పెంచారు. అయితే పవర్‌ప్లే తర్వాత మూడు ఓవర్లపాటు ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వకుండా బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగారు. కానీ ఆ తర్వాత బాబర్‌ బ్యాట్‌కు పనిచెబుతూ డీప్‌ మిడ్‌వికెట్‌లో భారీ సిక్సర్‌తో పరుగులకు తెర లేపాడు. ఇదే జోరుతో బాబర్‌ 13 ఓవర్‌లో మరో రెండు సిక్సర్లతో 40 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేశాడు.  అటు రిజ్వాన్‌ సైతం 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లోనైనా ప్రభావం చూపిస్తారనుకున్న బౌలర్లనుంచి నిరాశే ఎదురైంది. 18వ ఓవర్‌లో రిజ్వాన్‌ 6,4,4తో 17 రన్స్‌ సాధించి మరో 13 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


స్కోర్ బోర్డ్

భారత్‌: రాహుల్‌ (బి) షహీన్‌ 3; రోహిత్‌ (ఎల్బీ) షహీన్‌ 0; కోహ్లీ (సి) రిజ్వాన్‌ (బి) షహీన్‌ 57; సూర్యకుమార్‌ (సి) రిజ్వాన్‌ (బి) హసన్‌ 11; పంత్‌ (సి అండ్‌ బి) షాదాబ్‌ 39; జడేజా (సి సబ్‌) నవాజ్‌ (బి) హసన్‌ 13; హార్దిక్‌ (సి) బాబర్‌ (బి) రౌఫ్‌ 11; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 5; షమి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 151/7. వికెట్ల పతనం: 1-1, 2-6, 3-31, 4-84, 5-125, 6-133, 7-146. బౌలింగ్‌: షహీన్‌ షా అఫ్రీది 4-0-31-3; ఇమాద్‌ వసీం 2-0-10-0; హసన్‌ అలీ 4-0-44-2; షాదాబ్‌ ఖాన్‌ 4-0-22-1; మహ్మద్‌ హఫీజ్‌ 2-0-12-0; రౌఫ్‌ 4-0-25-1.


పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (నాటౌట్‌) 79; బాబర్‌ ఆజమ్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17.5 ఓవర్లలో 152/0. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-25-0, షమి 3.5-0-43-0, బుమ్రా 3-0-22-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-33-0, రవీంద్ర జడేజా 4-0-28-0.

Updated Date - 2021-10-25T07:10:38+05:30 IST