పాపశమని...శత్రు వినాశిని

ABN , First Publish Date - 2021-10-14T05:54:09+05:30 IST

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అనే శ్లోకం చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు.

పాపశమని...శత్రు వినాశిని

విజయదశమి సందర్భంగా జమ్మిచెట్టును పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. దీన్నే ‘శమీ వృక్షం’ అని కూడా అంటారు. దసరా నాడు శమీ వృక్షానికి పూజలు చేస్తారు.


శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ!

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! అనే శ్లోకం చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. తరువాత బంధు మిత్రుల చేతుల్లో జమ్మి ఆకులు పెడతారు. పెద్దలకు నమస్కరిస్తారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. పరస్పరం పలకరింపులు లేనివారు సైతం... దసరా రోజున ఈ పచ్చని ఆకులను ఒకరికొకరు అందించుకొని, విభేదాలు మరచిపోవడం కనిపిస్తుంది. 


శమీ వృక్షానికి మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉంది. లంకపై యుద్ధానికి వెళ్ళడానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షాన్ని పూజించాడనీ, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందు... తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారనీ, తమకు విజయం కలగాలని ఆ చెట్టును పూజించారనీ కథలు ఉన్నాయి. జమ్మి చెట్టుకు పూజలు చేసే సంప్రదాయం దేశమంతటా ఉంది. మైసూరు దసరా ఉత్సవాల్లో శమీ వృక్షాన్ని పూజిస్తారు. ఈ చెట్టును దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. వినాయక చవితి రోజున గణపతికి చేసే ‘ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ’లో... ‘ఓం ఇభవకా్త్రయ నమః... శమీపత్రం పూజయామి’ అంటూ జమ్మి ఆకులను సమర్పిస్తారు. శమీ వృక్షాన్ని పూజిస్తే శని పీడ వదులుతుందనే నమ్మకం ఉంది. ఈ చెట్టును అగ్ని స్వరూపంగా భావిస్తారు. యజ్ఞాల కోసం నిప్పు రాజేసేందుకు శమీ దారువునే ఉపయోగించేవారు. అందుకే దీన్ని ‘అగ్నిగర్భ’ అంటారు. ఓషధీ లక్షణాలు సమృద్ధిగా ఉన్న ఈ చెట్టు... తెలంగాణ రాష్ట్ర వృక్షం. సకల కార్య సిద్ధి కోసం, సర్వత్రా విజయ, క్షేమాల కోసం జమ్మి చెట్టును పూజించాలని పెద్దలు చెబుతారు. 

- డాక్టర్‌ వనిత


శుభాలనిచ్చే పిట్ట

దసరా పండుగలో పాలపిట్టకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయనీ, సర్వత్రా విజయాలు లభిస్తాయనీ విశ్వాసం. పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తూండగా... పాలపిట్ట కనిపించిందనీ, 

ఆ నాటి నుంచి వారు ఏది చేసినా విజయం సిద్ధించిందనీ కథలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో పాలపిట్టను శుభసూచకమైన పక్షిగా పరిగణిస్తారు. ప్రత్యేకించి 

తెలంగాణ రాష్ట్రంలో భక్తి ప్రపత్తులతో చూస్తారు. తెలంగాణతో పాటు కర్ణాటక, బీహార్‌, ఒరిస్సాల రాష్ట్ర పక్షి పాలపిట్టే కావడం... ఈ పక్షికి గల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.

Updated Date - 2021-10-14T05:54:09+05:30 IST