హరితహారం..లక్ష్యానికి దూరం

ABN , First Publish Date - 2020-09-22T06:56:39+05:30 IST

ప్రతి పల్లెతో పాటు పట్టణాలన్నీ పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం

హరితహారం..లక్ష్యానికి దూరం

సంగారెడ్డి జిల్లాలో అధ్వానంగా కార్యక్రమం

96 లక్షలకు గాను నాటిన మొక్కలు 73 లక్షలే

మున్సిపాలిటీల పరిధుల్లో అమలు మరీ ఘోరం

ఇంటింటికీ ఐదు మొక్కలపై పర్యవేక్షణ కరువు


సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 21 : ప్రతి పల్లెతో పాటు పట్టణాలన్నీ పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈసారి కరోనా నేపథ్యంలోనూ ప్రభుత్వం ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు అంతగా ప్రాధాన్యమివ్వక పోవడంతో లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 2015 నుంచి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మొదటి రెండు సంవత్సరాల పాటు పండుగలా ఆర్భాటంగా చేపట్టి, తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోవడంతో ముందుగా నిర్ణయించుకున్న మేరకు మొక్కలను నాటడంలో విఫలమవుతున్నారు.


ఆరో విడతలో అరకొరగానే

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని జూలై 22 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలతో పాటు ఇళ్ల ఆవరణలోనూ మొక్కలను పెంచాలని నిర్ణయించిన అధికార యంత్రాంగం జిల్లాలో 96.68 లక్షల మొక్కల  లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే జిల్లాలో 73.87 లక్షల మొక్కలను మాత్రమే నాటినట్టు అధికారికంగా లెక్కలు చూపుతున్నాయి. అయితే వాస్తవానికి ఆ సంఖ్య మరీ తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. లక్ష్యంలో కనీసం సగం మేరకైనా మొక్కలను నాటలేదని విమర్శలు వస్తున్నాయి.  


ఒక్క మొక్క అయినా నాటని వైద్య, ఆరోగ్య శాఖ

హరితహారంలో అన్ని శాఖలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లాలో కొన్ని శాఖలు పట్టించుకోలేదని తెలుస్తున్నది. జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 10 వేల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించగా ఒక్క మొక్క కూడా నాటలేకపోయారు. కరోనా మహమ్మారి విజృంభణతో ఆ శాఖ అధికారులు హరితహారంపై దృష్టి పెట్టలేదని తెలిసింది. కాగా దేవాదాయ శాఖకు 5 వేల మొక్కలు నాటాని లక్ష్యం నిర్ధేశించగా కేవలం 816 మొక్కలను నాటారు. గిరిజన సంక్షేమ శాఖ 5వేల మొక్కల లక్ష్యానికి బదులు 870 మొక్కలు మాత్రమే నాటింది. 


మున్సిపాలిటీల్లో లక్ష్యం బహుదూరం

జిల్లాలోని 8 మున్సిపాలిటీలు హరితహారం లక్ష్యానికి బహుదూరంగా నిలిచాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీలో 8.37 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించగా కేవలం 1.63 లక్షలు మాత్రమే నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందోలు-జోగిపేట బల్దియా పరిధిలో 1.55 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం 33,839 మొక్కలను నాటి మమ అనిపించారు. అమీన్‌పూర్‌లో 4.21 లక్షల మొక్కలకు బదులు లక్షా 72 వేలు మాత్రమే నాటి చేతులెత్తేశారు. బొల్లారంలో 3.27 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా 1.14 లక్షల మొక్కలను నాటారు. నారాయణఖేడ్‌లో 1.18 లక్షల మొక్కల లక్ష్యానికి బదులుగా 32,400 మొక్కలను నాటారు. సదాశివపేట బల్దియా పరిధిలో 2.84 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా 87,761 మొక్కలు నాటినట్టు లెక్కలు చూపుతున్నాయి. తెల్లాపూర్‌లో 2.28 లక్షలకు 1.65 లక్షలు, జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 5.85 లక్షల మొక్కలకు బదులు 84 వేల మొక్కలు మాత్రమే నాటినట్టు తెలుస్తున్నది.


పంపిణీ చేసిన మొక్కలపై కరువైన పర్యవేక్షణ 

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ 5 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. అయితే పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనేక ఇళ్లలో మొక్కలను వృథాగా పడేసినట్టు సమాచారం. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో అనేక చోట్ల మొక్కలను పశువులు తినేశాయి.  

Updated Date - 2020-09-22T06:56:39+05:30 IST