ఇండియాలో టెస్ట్ సిరీస్‌ గెలవాలని ఉంది: స్టీవ్ స్మిత్

ABN , First Publish Date - 2020-04-09T17:34:24+05:30 IST

1956-57లలో భారత్‌లో తొలిసారి పర్యటించిన ఆస్ట్రేలియా ఆతిథ్య దేశంపై 2-0 తేడాతో విజయం సాధించేందుకు అప్పటి కెప్టెన్ రే లిండ్వాల్ బాటలు వేశారు. ఆ

ఇండియాలో టెస్ట్ సిరీస్‌ గెలవాలని ఉంది: స్టీవ్ స్మిత్

సిడ్నీ: 1956-57లలో భారత్‌లో తొలిసారి పర్యటించిన ఆస్ట్రేలియా ఆతిథ్య దేశంపై 2-0 తేడాతో విజయం సాధించేందుకు అప్పటి కెప్టెన్ రే లిండ్వాల్ బాటలు వేశారు. ఆ తర్వాత 1969-70లలో మరోసారి భారత గడ్డపై 3-1 తేడాతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత భారత్‌లో టెస్ట్ సిరీస్ దక్కించుకొనేందుక ఆసీస్ దాదాపు 35 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 2004లో భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత మళ్లీ భారత్‌లో టెస్టుల్లో నెగ్గలేదు. 


అయితే భారత్‌లో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించాలనేది తన కోరిక అని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెం.1గా ఉన్న భారత్‌ను వాళ్ల సొంతగడ్డపై ఓడించాలని అతను పేర్కొన్నాడు. 2017లో చివరిసారిగా భారత్‌లో టెస్ట్ సిరీస్ ఆడిన ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఆ సిరీస్‌లో మూడు సెంచరీలతో 499 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జట్టుకు విజయాన్ని అందించేందుకు తీవ్రంగా కృషి చేశాడు.


‘‘భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలవాలనేది నా కోరిక. ఒక ఆస్ట్రేలియా క్రికెటర్‌గా యాషెస్ మాకు ఎంతో గొప్ప టోర్నమెంట్‌ అని చెబుతా. అలాగే ప్రపంచకప్ కూడా. కానీ, ఇప్పుడు ఇండియా టెస్టుల్లో నెం.1 జట్టు. టెస్టు క్రికెట్‌లో ఆ స్థానం దక్కడం ఎంతో కష్టం. కాబట్టి, నాకు వాళ్లపై ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలని ఉంది. అది కాకుండా ప్రస్తుతం నాకు వేరే లక్ష్యాలు లేవు. రోజురోజుకీ, సిరీస్-సిరీస్‌కి నా లక్ష్యం మారుతుంది. ఎప్పటికప్పుడు నన్ను నేను మలుచుకుంటాను’’ అని స్మిత్ పేర్కొన్నాడు. 


Updated Date - 2020-04-09T17:34:24+05:30 IST