కర్ణాటక వాడుకుంటే మమ్మల్ని అంటారా?

ABN , First Publish Date - 2022-01-29T05:04:44+05:30 IST

తెలంగాణకు అందాల్సిన నీటిని కర్ణాటక అక్రమంగా వాడుకుంటే మమ్మల్ని అంటారా?

కర్ణాటక వాడుకుంటే మమ్మల్ని అంటారా?
ఆర్డీఎస్‌ వద్ద కేఆర్‌ఎంబీ అధికారులతో పాటు తెలంగాణ, కర్ణాటక ఇంజనీర్ల పరిశీలన

కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీకి స్పష్టం చేసిన కర్నూలు సీఈ

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 28: తెలంగాణకు అందాల్సిన నీటిని కర్ణాటక అక్రమంగా వాడుకుంటే మమ్మల్ని అంటారా? అని ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేశారు. కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు సబ్‌ కమిటీ టీం లీడర్‌ పిళ్లై ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ, కర్ణాటక, ఏపీ ఇరిగేషన్‌ అధికారులు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుతో పాటు తెలంగాణలోని తుమ్మెళ్ల లిఫ్టు స్కీం, కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయాలను పరిశీలించారు. టెలిమెట్రీలు ఏర్పాటుపై కేఆర్‌ఎంబీ బృందం మూడు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించింది. ఆర్డీఎస్‌ ద్వారా తెలంగాణకు కేటాయించిన 15.90 టీఎంసీలలో 5 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, మిగిలిన నీటిని కర్ణాటక, ఏపీలు అక్రమంగా వినియోగించుకుంటున్నాయని తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీకి వివరించారు. దీంతో సుంకేసుల నుంచి తుమ్మెళ్ల లిప్టు స్కీం ద్వారా నీరు తీసుకుంటున్నామన్నారు. వీరి వాదనను కర్నూలు జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ రెడ్డి పూర్తిగా తిప్పికొట్టారు. కర్ణాటకతో పాటు తెలంగాణ పరిధి నుంచి సుంకేసుల జలాశయం పూర్తిగా దిగువన ఉందని, ఈ మధ్యన తుంగభద్రపై ఆర్డీఎస్‌ను నిర్మించారని, ఆర్డీఎస్‌ నుంచే తెలంగాణ వాటా నీటిని కర్ణాటక దారి మళ్లిస్తోందని వివరించారు. తాము చెప్పేది వాస్తవమో కాదో.. ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఈ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అధికారుల వాదని సరికాదన్నారు. తెలంగాణ, ఏపీ అధికారుల సూచనలు, సలహాలను కేఆర్‌ఎంబీ బృందం నమోదు చేసుకున్నారు.

Updated Date - 2022-01-29T05:04:44+05:30 IST