Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితబస్తీ కోసం కుస్తీ

దళిత బస్తీ పథకం కింద లబ్దిదారులకు కేటాయించిన భూముల వివరాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

పెరిగిన ధరలతో కొనుగోళ్లకు కష్టాలు

నత్తనడకన దళితబస్తీ పథకం

నిధులున్నా జిల్లాలో దొరకని భూములు 

పేద దళితులకు తప్పని ఎదురుచూపులు 

జిల్లాలో ఇప్పటి వరకు 603 ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం 

పథకం కోసం రూ. 57 కోట్ల వ్యయం 

పెరిగిన ధరల్లో భూముల కొనుగోలు కోసం అధికారుల ప్రతిపాదనలు 

నిర్మల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పేద దళితులందరికీ మూడుఎకరాల వ్యవసాయభూమిని పంపిణీ చేసి వారందరినీ ఆర్థికం గా ఆదుకోవాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న దళితబస్తీ పథకానికి ఆచరణలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయంటున్నారు. 2014 - 2015 సంవత్సరంలో ఎస్సీ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో దళితబస్తీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దళితులకు మూడు ఎకరాల భూమితో పాటు ఆ భూమి ని చదును చేసి దానిని సాగుకు యోగ్యంగా తయారు చేయడమే కా కుండా సాగునీటి సౌకర్యం కోసం ఉచితంగానే బోరు బావులను కూడా తవ్వించారు. అయితే జిల్లాలో ప్రభుత్వ భూములు ఆశించిన మేరకు అందుబాటులో లేని కారణంగా ఎస్సీ కార్పోరేషన్‌ ఇప్పటి వరకు ప్రైవేటు భూములనే కొనుగోలు చేస్తూ వచ్చింది. ప్రభుత్వం ఎకరానికి రూ. 7లక్షలకు మించకుండా ప్రైవేటు భూములకు ధరను చెల్లిస్తున్న కారణంగా క్షేత్రస్థాయిలో భూములు కొనుగోళ్లకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ భూం విఫరీతంగా పెరిగిన కారణంగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ ఏ మూలన చూసినా, ఏ మారుమూల పల్లెల్లో చూసిన రూ.50 లక్షల నుంచి రూ.కోటికి తగ్గకుండా ధర ఉందంటే అతిశయోక్తి కాదు. రోజు రోజుకు ధరలు విఫరీతంగా పెరిగిపోతున్న కారణంగా భూములకు భారీగా డిమాండ్‌ పెరిగింది. అలాగే భూములు సైతం అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దళితబస్తీ పథకం కోసం వందలాది దళిత కుటుంబాలు దరఖాస్తులు చేసుకొని భూపంపిణీ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రభుత్వం చెల్లించే ధర కనీస స్థాయిలో లేని కారణంగా జిల్లా యంత్రాంగానికి భూముల కొనుగోలు వ్యవహారం ప్రధానసమస్యగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో 1342 ఎకరాల భూమిని పేద దళితులకు పంపిణీ చేశారు. దీని కోసం గానూ 603 కుటుంబాలు లబ్దిపొందుతున్నాయి. ఈ భూమి కొనుగోలు కోసం రూ.57 కోట్లను వ్యయం చేశారు. కాగా 1142 ఎకరాల భూమి ఇప్పటి వరకు మొదటిపంట కోసం సాగులోకి వచ్చింది. భూమి అభివృద్దితో పాటు విద్యుత్‌, బోరుబావుల సౌకర్యం కోసం 1.70 కోట్లను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు చేశారు. అయితే భూముల ధరలు పెంచితే తప్ప కొనుగోలు ప్రక్రియ మొదలుకాదంటున్నారు. అప్పటి వరకు అర్హులైన పేద దళితులంతా భూమి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పదంటున్నారు. 

భూముల పెరుగుదలతో భూసేకరణకు ఆటంకం

జిల్లాలో భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. నిన్నటి వరకు ఎకరానికి రూ. 5లక్షల వరకు ధర పలికిన భూమి ప్రస్తుతం రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చేరుకుందంటున్నారు. జిల్లా కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు పొరుగు జిల్లాల్లోని రియల్‌ వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలు పెద్దమొత్తంలో భూములను కొనుగోలు చేస్తున్న కారణంగా ఈ భూముల ధరలకు అడ్డు అదుపు లేకుం డా పోయిందంటున్నారు. దీని కారణంగా దళితబస్తీ కోసం భూములను కొనుగోలు చేయడం  యంత్రాంగానికి శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎకరానికి రూ.7లక్షలు మించకుండా మంజూరు చేస్తున్న కారణంగా ఆ ధరలో ఎక్కడా కూడా భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. అయితే భూముల ధరలు ప్రభుత్వం పెంచాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలవుతున్నాయని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ధరల ప్రతిపాదనను యధాతథంగా ఆ మోదించాలని కోరుతున్నారు. లేనట్లయితే దళితబస్తీ పథకం ముందుకు సాగడం కష్టమేనన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. 

ఇప్పటి వరకు 603 కుటుంబాలకు ప్రయోజనం 

కాగా జిల్లాలో దళిత బస్తీ పథకం కింద ఇప్పటి వరకు 603 దళిత పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2014 - 2015 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం మొదటి నుంచి అనేక అటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. అప్పట్లో ప్రైవేటు వ్యక్తుల జరిగిన భూమి కొనుగోలు వ్యవహారంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1342 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి పంపిణీ చేశారు. దీంతో 603 పేద దళిత కుటుంబాలు లబ్ది పొందేందుకు మార్గం ఏర్పడింది. అలాగే మొత్తం 57 కోట్లను దీని కోసం వ్యయం చేశారు. మొదటి పంట కింద 1142 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు రూ. 1.70 కోట్లను ఖర్చు చేశారు. ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమిని అందించిన అధికారులు , ఆ భూములను పూర్తిస్థాయిలో సాగులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. దీని కోసం రూ. 1.70 కోట్లను కూడా ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా ఖర్చు చేశారు. అయితే మరిన్ని కుటుంబాలు దళిత బందు పథకం కోసం కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాయంటున్నారు. 


Advertisement
Advertisement