India in England: క్వారంటైన్ పూర్తి.. జట్టుతో కలిసిన ఆ ముగ్గురు

ABN , First Publish Date - 2021-07-24T23:41:03+05:30 IST

పది రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా, అభిమన్యు

India in England: క్వారంటైన్ పూర్తి.. జట్టుతో కలిసిన ఆ ముగ్గురు

లండన్: పది రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ డుర్హమ్‌లో ఉన్న భారత జట్టులో చేరారు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఈ నెల 15న త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా టెస్టు రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఈ ముగ్గురిని ముందుజాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌కు పంపారు. దీంతో సాహా, ఈశ్వరన్‌లు కౌంటీ సెలక్ట్ ఎలెవన్ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడలేకపోయారు. 


 స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కూడా ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లకు 21 రోజుల బ్రేక్ లభించింది. ఆ తర్వాత పంత్‌ కరోనా బారినపడి క్వారంటైన్‌కు వెళ్లాడు. ఇటీవలే కోలుకున్న పంత్ డుర్హమ్‌లో జట్టుతో కలిశాడు.  


ప్రాక్టీస్ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు, గాయాల బారినపడిన అవేష్ ఖాన్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ స్వదేశానికి చేరుకోనున్నారు. ఆగస్టు 4న నాటింగ్‌‌హామ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు భారత జట్టు అంతర్గత మ్యాచ్ ఆడనుంది. 

Updated Date - 2021-07-24T23:41:03+05:30 IST