మైదానం వెనుక

ABN , First Publish Date - 2020-11-22T06:09:28+05:30 IST

చలం.. తెలుగు సాహిత్యంలో ఒక ఉన్నత శిఖరం. మహిళల మనోగతాన్ని.. వారి భావాలను.. అవసరాలను.. చలం అర్థం చేసుకున్నంతగా మరే ఇతర రచయిత అర్ధం చేసుకోలేదనేది కొందరి అభిప్రాయం. 1927లో రాసిన ఈ నవల ఇప్పటికీ అనేక చర్చలకు కారణమవుతూనే ఉంటుంది. తాజాగా యువ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా... కవి సిదార్థ దర్శకుడిగా ఈ నవలను వెండితెరకు ఎక్కిస్తున్నారు...

మైదానం వెనుక

చలం.. తెలుగు సాహిత్యంలో ఒక ఉన్నత శిఖరం. మహిళల మనోగతాన్ని.. వారి భావాలను.. అవసరాలను.. చలం అర్థం చేసుకున్నంతగా మరే ఇతర రచయిత అర్ధం చేసుకోలేదనేది కొందరి అభిప్రాయం. 1927లో రాసిన ఈ నవల ఇప్పటికీ అనేక చర్చలకు కారణమవుతూనే ఉంటుంది. తాజాగా యువ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా... కవి సిదార్థ దర్శకుడిగా ఈ నవలను వెండితెరకు ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ ‘దృశ్యం’ పలకరించింది. 




  • ఈ తరానికి చెప్పాలనే! 


ప్రశ్న: ‘మైదానం’ను ఎందుకు సినిమా తీయాలనుకున్నారు?

జవాబు: తెలుగు పాఠకులు ఎక్కువగా అపార్థం చేసుకున్న రచయితల్లో చలం ఒకరు. ఒక రచయితగా చలం నన్ను విపరీతంగా ఆకర్షించారు. ఆయన ఒక సామాజిక విప్లవకారుడనేది నా కచ్చితమైన అభిప్రాయం. ఆయన రచనల్లో ‘మైదానం’ ఒక క్లాసిక్‌. మన తెలుగు సినిమా చరిత్రను చూస్తే అనేక  పుస్తకాలు వెండితెరకెక్కాయి. ‘మాలపిల్ల’, ‘ఏకవీర’, ‘కన్యాశుల్కం’, ‘నిజం’- ఇలా అనేక క్లాసిక్స్‌ను సినిమాలుగా మలిచారు. కానీ చలం ‘మైదానా’న్ని ఎందుకో సినిమాగా తీయలేదు. ఒకరిద్దరు ప్రయత్నించి విరమించుకున్నారు. ‘మైదానం’ ఎంతో మంచి పుస్తకం కదా! ఇందులో అద్భుతమైన కంటెంట్‌ ఉంది. విషయాలు ఉన్నాయి కదా! దీన్ని ఎవరూ ఎందుకు సినిమాగా తీయడం లేదు? అనే ప్రశ్న నన్ను చాలా కాలంగా వేధిస్తోంది.  దీనిని సినిమాగా తీసి- ఈ తరానికి చలం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నా. 


ప్ర: గత ఎనిమిది దశాబ్దాల్లో మన సమాజంలో పరిస్థితులు మారాయి కదా.. ఇప్పటి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారా?

జ: ‘మైదానం’ ఇప్పుడే కాదు ఎప్పటికీ రిలవెంటే. మన మానవ సంబంధాలలో ముఖ్యంగా స్త్రీ,పురుష సంబంధాలలో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు, అసమానతలు అంతరించినప్పుడు మాత్రమే ‘మైదానం’ రిలవెన్స్‌ ఆగిపోతుందని నా అభిప్రాయం. ఈ తరం సినిమాల విషయానికి వస్తే ఇప్పుడంతా కంటెంట్‌ విప్లవం నడుస్తోంది. ‘మైదానం’లో ఉన్నదంతా కూడా కంటెంటే.


ప్ర: ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పిరియడ్‌ సినిమా తీయటం రిస్క్‌ అనిపించటం లేదా..

జ: పిరియడ్‌ ఫిలిమ్స్‌లో మన సమాజం కన్ను తెరిచే గాఢమైన సామాజిక అంశం ఉంటుంది. అంటే ఎక్కువ తీవ్రత, ప్రభావం కలిగిన ప్రధానాంశం ఉంటుంది. చాలా సందర్భాలలో పిరియడ్‌ మూవీస్‌ చరిత్రను కొత్త కోణం నుంచి చూపిస్తాయి. అందుకే ప్రేక్షకులకు ఈ తరహా సినిమాలు కొత్త అనుభూతిని మిగులుస్తాయి. అంతే కాదు... డిజిటలైజేషన్‌ పెరిగిన తరువాత ప్రేక్షకులలో కూడా సినిమా పరిజ్ఞానం పెరిగిపోయింది. దర్శకులకు ఎంత సినీ పరిజ్ఞానం ఉందో ఇప్పుడు ప్రేక్షకులకు అంతే ఉంది. ఇప్పుడు అరచేతిలో ఫోన్‌ పట్టుకొని ప్రపంచ సినిమాలన్నీ చూస్తున్నారు. ఓటీటీ వచ్చాక పలు దేశాల, పలు భాషల సినిమాలు చూస్తూ, మంచి సినిమాలకు రుచి మరిగారు. ఏది పడితే అది తీస్తే ఇప్పుడు విసిరికొడతారు. ‘మైదానం’ లాంటి ఉన్నతమైన విలువలున్న నవలను సినిమాగా తీస్తే ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. 


ప్ర: తొలిసారి ‘మైదానా’న్ని చదివినప్పుడు మీకు ఏమనిపించింది?

జ:  నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ‘మైదానం’ నవలను మొదటిసారి చదివా. చదువుతున్న కొద్దీ చదవాలని అనిపించింది. ఆ ఫ్లోలో విద్యుత్తుకు ఉండేటువంటి గొప్ప శక్తి ఉందనిపించింది. ఆ నవలలో ఉపయోగించిన భాష, పదాలలో ఉన్న అపూర్వమైన ఆకర్షణ నన్ను మళ్లీ మళ్లీ చదివేలా చేశాయి. చదివినప్పుడల్లా ఒక కొత్త విషయం నాకు తారసపడేది. పుస్తకం చదివేటప్పుడు నచ్చిన విషయాలను అంటర్‌లైన్‌ చేయడం నాకు బాగా అలవాటు. ఆ పుస్తకంలో అండర్‌లైన్‌ చేయడం మొదలుపెడితే.. ప్రతిపేజీలో ప్రతి వాక్యం అండర్‌లైన్‌ చేసే ఉంటుంది. ఆ తరువాత సాహిత్య పుస్తకాలు చదువుతూ ఉండడం, సమాజం మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడటం వల్ల ‘మైదానం’లోని తాత్విక పునాది నాకు అర్థమయింది.  




ఇదీ కథ...


తెలుగులో సంచలనం సృష్టించిన రచనల్లో గుడిపాటి వెంకట చలం నవల ‘మైదానం’ ఒకటి. రాజేశ్వరి ఒక బ్రాహ్మణ వకీలు భార్య. తన భర్త దగ్గరకు క్లయింట్‌గా వచ్చిన అమీర్‌ ముస్లిం యువకుడితో ఆమెకు పరిచయం అవుతుంది. భర్త ఇంటిని విడిచిపెట్టిన రాజేశ్వరి, అమీర్‌ సర్కారు జిల్లాల్లోని తమ ఊరు నుంచి నైజాం ప్రాంతానికి వెళ్ళి, ఒక మైదానంలో ఏకాంతంగా ఇంటారు. రాజేశ్వరి గర్భం ధరిస్తుంది. అది అమీర్‌కు ఇష్టం ఉండదు. ఆ బిడ్డ పుట్టగానే చంపెయ్యమని రాజేశ్వరిని ఒత్తిడి చేస్తాడు. దానికి ఆమె అంగీకరించదు. దాంతో మీరా అనే మరో ముస్లిం కుర్రాడికి రాజేశ్వరి సంరక్షణను అప్పజెప్పి... అమీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతాడు. రాజేశ్వరి గర్భస్రావానికి సిద్ధపడుతుంది. ఆమెకు మీరా సహాయం చేస్తాడు.. రాజేశ్వరికీ, అతనికీ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కొన్నాళ్ళ తరువాత తిరిగి వచ్చిన అమీర్‌  ఆ సాన్నిహిత్యాన్ని ఇష్టపడడు. అయితే దాని గురించి వారిని నిలదీయడు. ఒక రోజు రాత్రి రాజేశ్వరి, అమీర్‌ నిద్రపోతూ ఉండగా మీరా వచ్చి ఆమెను లేపుతాడు. మీరా వెనుక ఆమె వెళ్తుంది. ఇది గమనించిన అమీర్‌ కత్తితో వారున్న చోటుకు వస్తాడు. అతను మీరాను చంపేస్తాడని రాజేశ్వరి భయపడుతుంది. అయితే అమీర్‌ తనను తాను పొడుచుకొని మరణిస్తాడు. అతన్ని నేనే చంపానని మీరా, కాదు తానంటూ రాజేశ్వరీ పోలీసులకు చెప్పడంతో ‘మైదానం’ ముగుస్తుంది. 


  • చలం ఒక అన్వేషణ.. 


ప్రశ్న: చలాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?

జవాబు: అసలు చలాన్ని ఎలా వర్ణించి.. ఒక మూసలో పెట్టగలమో చెప్పండి? చలాన్ని ఒక ఫ్రేమ్‌లో గానీ, ఒక సిద్ధాంతానికి కట్టుబడి గానీ చూడలేం. ఆయన తన జీవితంలోని అనేక అనేక దశలలో, పార్శ్వాలలో ఆయన చిట్టచివరి నిద్ర వరకూ ఒక అన్వేషణే. ఒక సన్యాసి. చలంగారు ఒక చిన్నపిట్ట, ఒక పిల్లవాడు.. ఇంకా చాలా చాలా. ఆయనను ఒక చట్రంలో బంధించి ఫలానా అని చెప్పడం కష్టం. మొత్తంగా చూస్తే చలం తన అస్తిత్వం కేంద్రంలో స్త్రీగా కనిపిస్తారు. మనకు జన్మనిచ్చిన తల్లి ప్రాణకేంద్రం లాంటిదన్నమాట. లెఫ్ట్‌, రైట్‌ వంటి సిద్ధాంతాలేవీ ఆయనకు వర్తించవు. ఆయన శక్తివంతమైన, ఇప్పటికీ  జీవిస్తున్న వ్యక్తి. ఈ తరానికి చలంగారు ‘అవసరమైన ప్రాణవాయువు’ అని నేను అనుకుంటున్నా. 


ప్ర: చలం ‘మైదానం’ నవలను మొదటిసారిగా చదివినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? 

జ: చలం ‘మైదానా’న్ని మొదటి సారి చదివినప్పుడు ఒక పెద్ద నిప్పు ముద్దను రెండు చేతుల్లో పట్టుకొని మోసినట్టు అయితే అనిపించింది. మొత్తం స్తబ్ధత. దాని వెంట తరుముకొచ్చిన తుఫాన్‌ హోరు గుండెలో. ఇది నా స్వీయానుభవమే అనుకోండి. చదివిన పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదివినప్పుడు మనసులో బరువు పెరుగుతూనే పోతుంది. విషాదం, ఆనందం రెండూ కలిసి తాగిన బరువన్నమాట. రెండూ కలిపే ఉంటాయి. దిగులు, కోపం, విషాదం.. ఇలా రకరకాలుగా.. ఇది మొదటి అనుభవమే. క్రమంగా చలంగారి సాహిత్య సముద్రంలోకి ఈ రెండు చేతులను కట్టి దూకిన తరువాత చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అగాథాలు, విషాదాలు, ఆరోపణలు .. నాలోపలివి, సమాజానివి అన్నీ కూడా కమ్ముకుంటాయి. కానీ ఎప్పుడు చదివినా చలంగారి పుస్తకం మొట్టమొదటిసారి చదివిన అనుభూతి అయితే ఉంటుంది. అదే తాజాదనం, అదే కొత్త కొత్త ఆలోచనలు కమ్ముకుంటూ ఉంటాయి. చలంగారి సాహిత్యంలోని ప్రత్యేకమైన లక్షణం. 


ప్ర: ‘మైదానం’ కాన్వాస్‌ చాలా పెద్దది కదా.. ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు? 

సిద్ధార్థ్‌: చలం గారి ‘మైదానా’న్ని అడ్డం పెట్టుకొని కాన్వాసుని పెద్దది చేస్తూ పోవాలి. కానీ ‘మైదానం’ పుస్తకం చూడడానికి చిన్నగానే ఉంటుంది. మళ్లీ మళ్లీ చదివిన తరువాత ఒక పూర్తిస్థాయి స్పష్టత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ‘మైదానం’లోని ప్రతి పాత్ర తాలూకూ మూలాలను వెతకడం మొదలు పెడితే కాన్వాస్‌ పెరుగుతూనే పోతుంది. చలం కథను చెబుతూనే కొన్ని ముఖ్య విషయాలు దాచిపెడుతుంటారు. ఆయన విజువల్‌ రచయిత. ‘మైదానం’లోని వస్తువుగా తీసుకొని ముందుకు వెళితే ఈ సినిమాకు న్యాయం చేయవచ్చు. 


Updated Date - 2020-11-22T06:09:28+05:30 IST