కథతోనే నిత్యం, నిరంతరం

ABN , First Publish Date - 2021-06-07T05:56:02+05:30 IST

తెలుగు కథా సముద్ర సౌందర్యాన్ని నిలబెట్టి చూపించే యారాడకొండ వంటి కాళీపట్నం రామారావు మాస్టారు శ్రీకాకుళాన్ని తన ఉనికితో, క్రియతో దర్శనీయ స్థలంగా చేశారు. జూన్‌ 4వ తేదీ ఆయన మర ణించినా కథానిలయం ఆయన....

కథతోనే నిత్యం, నిరంతరం

కారా మాస్టారు కథని, దాని చుట్టూ అల్లుకుని ఉండే కథాంగాల్లో దేనినీ వాచ్యం చేయరు. ఎత్తుగడ మొదలు ముగింపు వరకూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు కనుకనే ఆయన చెప్పకనే చెప్పిన అంశాలను వెలికి తీయడానికి ఈ డెబ్భై అయిదేళ్ల కాలమూ సరిపోలేదు. 


తెలుగు కథా సముద్ర సౌందర్యాన్ని నిలబెట్టి చూపించే యారాడకొండ వంటి కాళీపట్నం రామారావు మాస్టారు శ్రీకాకుళాన్ని తన ఉనికితో, క్రియతో దర్శనీయ స్థలంగా చేశారు. జూన్‌ 4వ తేదీ ఆయన మర ణించినా కథానిలయం ఆయన శాశ్వత చిరునామాగా మిగిలిపోతుంది. కాళీపట్నం రామారావు వృత్తిరీత్యా బడిలో పాఠాలు చెప్పే మేష్టారు. విద్యార్థుల హృదయాలలో ఎంతటి ప్రభావశీల ముద్రను వేసారో కథల మాష్టారుగా రచయితల, విమర్శకుల హృదయాలను బుద్ధిని స్నేహ సంభాషణలతో అంతగానూ ప్రభావితం చేశారు. తన కథలతో భిన్న సామాజిక సమూహాల మధ్యకు, సందర్భాల మధ్యకు తీసుకుపోయి మనజ్ఞాన చైతన్య వికాసాలకు కారణమయ్యారు. 


పంతొమ్మిదేళ్ళ వయసులో 1943లో ‘ప్లాటుఫారమో?’ అన్న కార్డుకథతో సాహిత్యంలోకి ప్రవేశిం చారు. ఇన్నేళ్ళలో రాసిన కథలు యాభై మాత్రమే. యువ కథకులతో చేసిన స్నేహాలు, కథలు రాయటంలో యువ తరానికి మెళుకువలు నేర్పటానికి మాష్టారి ఆరాటం ఆయనను కథ చుట్టూ జీవితాన్ని అల్లుకునేలా చేశాయి. 1997 కథానిలయం స్థాపించటం ద్వారా కథారచయితలతో పాటు, పరిశోధకులు, విమర్శకులు, నిర్వాహకుల విశాల ప్రపంచం ఆయనను ఆవరించింది. కథ ఆయన ఊపిరి అయింది. కథతో ఆయన సంబంధం నిత్యం, నిరంతరం. 


కాళీపట్నం మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. సహజంగానే తొలినాళ్ళలో అదే ఆయనకు కథా వస్తువు అయింది. ఆయన రెండవ దశ కథలు చర్చకి వచ్చినంతగా తొలి దశ కథలు రాలేదు. ‘అదృశ్యము’, ‘బలహీనులు’ వంటి కథలు రాసేనాటికి ఆయన వయసు 21సంవత్సరాలు. 1945లో రూపవాణి, వినోదిని పత్రికలలో ఈ రెండు కథలూ అచ్చయ్యాయి. తన తొలి కథల పట్ల మాస్టారికి అంతగా ఏకీభావం ఉన్నట్లు కనపడదు. అది సహజమే అయినప్పటికీ తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తూ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు. నిజానికి వర్తమానానికి కూడా ప్రాసంగికమైన కథలు అవి. స్త్రీ పురుష సంబంధాలను నైతిక పరిధికి లోపలా వెలుపలా పెట్టి చూడగలిగారు. ఈ రెండుకథలు మధ్యతరగతి కుటుంబ స్త్రీలగతానుగతిక సంస్కారాలను, అభ్యుదయ చైతన్యాలను చూపిస్థాయి. ఆ దశలో ఎంచుకున్న కథావస్తువులను చూస్తే చలం, కొ.కు.ల ప్రభావం యువ కారా మీద ఉందనిపి స్తుంది. ‘పెంపకపు మమకారం’, ‘రాగమయి’, ‘అభిమానాలు’ వంటి కథలు మధ్యతరగతి కుటుంబ ఇతివృత్తాలు. అధి కారం, అహంకారం, అజ్ఞానాలవల్ల కుటుంబం కల్లోలమవు తున్నపుడు వాటిని గుర్తించి సామరస్యపూర్వకంగా పరిష్క రించుకొనే శక్తులు, ఆ కుటుంబాలలోనే రూపొంది పనిచే యటాన్ని చూపించాయి ఈ కథలు. ‘అభిశప్తులు’, ‘పలాయి తుడు’ కొంచం భిన్నమయిన కథలు. కుటుంబమే వాటికీ కేంద్రం అయినా అక్కడ మనుషుల మధ్య వైరుధ్యాలకు కారణాలు కుటుంబంలోకాక బయటి సమాజంలో ఉన్నాయి. ‘అభిశప్తులు’ కథలో అవి కులమూ, జండర్‌ అయితే ఆర్థికం వాటికి తోడయింది. 


‘పలాయితుడు’ కథలో కారణం పూర్తిగా ఆర్థికమే. ‘నిరవాకాలు’, ‘కీర్తికాముడు’ వంటి కథలు మార్పులకు పెడముఖం పెట్టి భూస్వామ్య డాంబికంతో కుటుంబాలను దైన్యస్థితికి దిగజార్చిన వ్యక్తుల జీవితాల చుట్టూ అల్లబడినవి. ఒకరి అభివృద్ధికి, మరొకరి పతనానికి ఉన్న సంబంధాన్ని చూపుతాయి. ప్రపంచంలో ఏదయినా ఒకరు కోల్పోతే గానీ మరొకరికి దొరకదు అన్న సూత్రం గురించిన అవగాహన కారాలో అప్పటికే బలపడుతున్నది. 


 బ్రాహ్మణ కుటుంబం నుండి చుట్టూ సమాజంలోకి చూపు తిప్పటం ‘సేనాపతి వీరన్న’ (1953) కథతో మొదల యింది. కథకుడు, వ్యాఖ్యాత బ్రాహ్మణ యువకుడే అయినా జీవితం నేత పనిచేసే సాలీలది. కులవృత్తిని పట్టించు కొనకుండా సాముగరిడీల మోజులో, అందువల్ల వచ్చిన కీర్తి మోహంలో ఒక వ్యక్తి జీవితం ధ్వంసం అయిన రీతిని ప్రపంచ ఆర్థిక పరిణామాల సంబంధంలో మారు తున్న గ్రామీణ సామాజిక ఆర్థిక భిత్తికపై చిత్రించిన కథ ఇది. ‘యజ్ఞం’ కథ (1964)తో మాల మాదిగ జనజీవన ఆరాటాలను- కథకుడిగా వ్యాఖ్యాతగా తనను తాను పూర్తిగా ఉపసంహరించుకొని- ప్రత్యక్షంగా చూపించగల స్థాయికి ఎదిగారు కాళీపట్నం. ‘హింస’, ‘నోరూమ్‌’, ‘ఆర్తి’, ‘చావు’ వంటి కథలు ఈ కోవకు చెందినవే. ‘యజ్ఞం’ కథతో ప్రారంభించి కాళీపట్నం రాసిన ‘శాంతి’, ‘కుట్ర’ వంటి కథలు రాజకీయ కథలు. అభివృద్ధి విధానాలు ఎవరి ప్రయోజనాలకు అమలవుతున్నాయో స్పష్టం చేసిన కథలివి. శాంతిగా జీవించే పరిస్థితులు లేకుండా చేసి శాంతిగా మెసలాలని శ్రమజీవులకు చేస్తున్న బోధల బండారం బయటపెట్టాయి.


‘హింస’ కథ శ్రామిక వర్గ  స్త్రీ సమస్యను చిత్రించింది. పేదరికం, పితృస్వామ్యం, లైంగిక దోపిడీల ముప్పేటల దాడిలో స్త్రీ తన శరీరానికి, కుటుం బానికి, గౌరవకరమైన జీవితానికి పరాయీకరింపబడే క్రమం ఆమెకే కాదు మొత్తం కుటుంబానికే ఎంత హింసాత్మకంగా ఉంటుందో ఈ కథలో చూపించారు. ఎంతోకాలం తరువాత వచ్చిన అక్కతో మాట్లాడటానికే వ్యవధి ఇవ్వని- కూలిపనికి వెళ్ళటాన్ని అనివార్యం చేసిన- పేదరికం, అక్కను ఇంట నిలవనియ్యకుండా తరిమిన లైంగిక నీతికి సంబంధించిన సామాజిక క్రౌర్యం, చిన్న పిల్ల సంగిని ఎంత ఆందోళనకు గురిచేసాయంటే గడ్డి కోసం ఊరికి దూరంగా ఉన్న శలకకు వెళ్ళినప్పుడు నక్కలు పొట్టన పెట్టుకున్న మేకపిల్లని, హడలిపోయిన తల్లిమేకను, బెంబేలెత్తిన రెండవ మేకపిల్లను చూసి, చేతికి అందిన ఎండిన తాటిమట్టతో ఆవేశంగా కనిపించని నక్కలను వేటాడటానికి సంసిద్ధం అయ్యేంతగా. అప్పటి ఆ అమ్మాయి ప్రవృత్తిని ‘‘తనకు పట్టని బాధ - ఎవరికో జరిగిన అన్యాయం’’ అనుకోకపోవటమేనని వ్యాఖ్యానిస్తారు రచయిత. 


 సమాజం సాహిత్య వస్తువునే కాదు, దానిని వ్యక్తీక రించగల భాషనూ ఇస్తుంది. సాహిత్య గత పాత్రల వర్గ జాతి కుల మత స్థాయీ భేదాలను బట్టి భాష, యాస మారుతుంటాయి. వస్తువుకోసం సమాజంలో వెతుకుతున్నట్లు గానే భాషలోని వైవిధ్యాన్ని ఒడిసిపట్టటానికి ప్రజల వ్యవ హరాన్ని పరిశీలించాలి. ఆ సులువు బోధపరుచుకొన్న రచయిత కాళీపట్నం. మధ్యతరగతి మర్యాదా భాషపై ఎంత పట్టు ఉన్నదో అట్టడుగు వర్గాల ప్రజల పలుకుబడిపై కూడా అంత పట్టు ఉన్నది. మాట్లాడే తీరులోని స్వరభేదా లను గుర్తించిన నిశిత పరిశీలకుడు కారా. సమస్థాయి మనుషులతో సంభాషణ, అధికార స్థాయి మనుషులతో సంభాషణ అధీన స్థాయి మనుషుల మాట తీరు ఇవన్నీ సూక్ష్మభేదాలతో ఉంటాయని తెలిసి చేసే రచన, చదివింప చేసే శిల్ప సౌందర్యాన్ని సంతరించుకొంటుంది. జీవితాన్ని పట్టించుకుని రాస్తున్న రచయితలు తప్పనిసరిగా ‘మనిషికీ మనిషికీ భిన్నంగా ఉండటానికి వీలున్న, ఉంటున్న- భాషనూ యాసనూ రచనలలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. 


కారా మాస్టారి సాహిత్యాన్ని మొత్తంగా పరిశీలించిన పుడు స్త్రీ పురుష సంబంధాల చిత్రణ, శృంగారపరమైన అంశాలు, హింసాత్మక ఘటనల విషయంలో గోప్యతని పాటించారు. ఈ గోప్యత ప్రాచీన సాహిత్యంలో ఔచిత్య గుణంగా ఉండేది. నాటకంలో ప్రదర్శనకు వీలు కాని అంశాలను అర్ధోపక్షేపకాల్లో చెపుతారు. యుద్ధం, రక్త పాతం, ఆహార, నిద్రా, మైధునాదులు ప్రదర్శన యోగ్యం కాదు. అందుకే సూత్రధారుడు వచ్చి వాటిని ప్రస్తావించి వెళ్ళిపోతాడు. కారా మాస్టారు కూడా తన కథలకి సూత్ర ధారుని వంటి పాత్ర మాత్రమే పోషించారు. పాఠకులలో తామస గుణాలను రేకెత్తించే అంశాల పట్ల గోప్యతనే అలంకారంగా మార్చుకున్నారు. కారా కథలు, దృశ్యకథలుగా కూడా భాసించడానికి ఇటువంటి జాగ్రత్తలు కూడా సాయపడ్డాయి. ఆయన కథలన్నిటి లోనూ సమానంగా కనిపించే సుగుణం ఒకటుంది. కారా మాస్టారు కథని, దాని చుట్టూ అల్లుకుని ఉండే కథాంగాల్లో దేనినీ వాచ్యం చేయరు. ఎత్తుగడ మొదలు ముగింపు వరకూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు కనుకనే ఆయన చెప్పకనే చెప్పిన అంశాలను వెలికి తీయడానికి ఈ డెబ్భై అయిదేళ్ల కాలమూ సరిపోలేదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలూ, అన్వయాలూ స్ఫురించడానికి ఈ గుణమే కారణం. 


కథని వాచ్యం చేయకుండా వ్యక్తం చేయడమనే అంశానికి నైతిక తీక్ష్ణత కూడా ఉంటుంది కనుకనే కారా కథలు భయపెడతాయి కూడా. తన తొలి రచనల కాలానికే కథని వాచ్యం కాకుండా వ్యక్తం చేయడాన్ని సాధన చేసిన కారా వ్యక్తిగా కూడా అంతే నిగూఢ స్వభావం కలవారు. ఆ స్వభావసిద్ధత కూడా ఈ సుగుణానికి చేర్పు అయి ఉంటుంది. తన తోటి సాహిత్యకారులతో ఆయన మెసిలే విధానంలో కూడా ఈ లక్షణం కనపడుతుంది. భావోద్వేగాల మీద తీవ్రమైన అదుపు ఉన్న వ్యక్తిగా ఎదుటివారి మీద కోపమూ ప్రేమా భరోసా వంటి భావాలు కూడా స్థితప్రజ్ఞతతో వ్యక్తం చేస్తారు. 


దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు కథని ప్రేమించి కథని శ్వాసించిన తూర్పుదిక్కు, పడమటికి మరలింది. ఆయన మిగిల్చిన కథలూ కథానిలయం ఎప్పటికీ వెలుగు తూనే ఉంటాయి. ప్రజా కథకునికి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నివాళులు ప్రకటిస్తోంది.


కాత్యాయనీ విద్మహే కె.ఎన్‌. మల్లీశ్వరి

Updated Date - 2021-06-07T05:56:02+05:30 IST