Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోలుకు తప్పని పడిగాపులు

తడిసి మొలకెత్తుతున్న ధాన్యం


కొండమల్లేపల్లి, డిండి, నకిరేకల్‌, నవంబరు 22: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి, పెండ్లిపాకల పంచాయతీల్లో ఈ నెల 7న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే తేమశాతం అధికంగా ఉందని ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిండి మండలంలో 20వేల ఎకరాల్లో వరి సాగుకాగా, కేవలం రెండు ధాన్యంకొనుగోలు కేంద్రాలే ఏర్పాటుచేశారు. ఖానాపూర్‌ పంచాయతీలో గత వానాకాలంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ప్రస్తుత సీజన్‌లో మాత్రం మరిచారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారని జోత్యతండాకు చెందిన రైతులు వరి నూర్పిడి చేసి టి.గౌరారం స్టేజీ వద్ద బండపై ఆరబోశారు. అయితే ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తింది.


తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌లో వర్షాలకు తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే అఖిలపక్ష కమిటి ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు కందాళ ప్రమీళ, మర్రి వెంకటయ్య, ఆదిమళ్ల శ్రీను, వంటెపాక వెంకటేశ్వర్లు, రాచకొండ వెంకట్‌, చిగుళ్ల శ్రీనివాస్‌, ఎండి.యూసుఫ్‌, ఎండి.రియాజ్‌ఖాన్‌, ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement