తప్పుడు ధోరణులు

ABN , First Publish Date - 2021-02-06T06:46:11+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యల్లో ఉత్తరాఖండ్‌ పోలీసులకు జాతివ్యతిరేకం అనిపించేవి ఏమైనా ఉంటే, ఆ రాష్ట్ర యువతకు ఇక పాస్‌పార్టులు...

తప్పుడు ధోరణులు

సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యల్లో ఉత్తరాఖండ్‌ పోలీసులకు జాతివ్యతిరేకం అనిపించేవి ఏమైనా ఉంటే, ఆ రాష్ట్ర యువతకు ఇక పాస్‌పార్టులు, లైసెన్సులు దక్కవు. రోడ్లమీద ధర్నాలూ ర్యాలీలూ చేస్తున్నప్పుడు బిహార్‌ పోలీసులకు ఏమాత్రం ఆగ్రహం కలిగించేట్టు ప్రవర్తించినా ఇక ఈ రాష్ట్ర యువకులు ప్రభుత్వ ఉద్యోగం సహా బతుకుతెరువుమీదే ఆశలు వదిలేసుకోవాలి. నిరసనని నియంత్రించే విషయంలో ఈ రెండు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీపడి మరీ తయారు చేసిన నిబంధనలు చూసి న్యాయనిపుణులు, మేధావులు ఆశ్చర్యపోతున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వీటిని ఎక్కడ ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తాయోనని హక్కుల నేతలు భయపడుతున్నారు. 


ఇకపై సామాజిక మాధ్యమాలమీద గట్టి నిఘావేయాలని ఉత్తరాఖండ్‌ పోలీసులు నిర్ణయించడంతో ఆ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ తమకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నదొకటి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన విషయాన్ని మరిచిపోవడం ఉత్తమం. పోలీసులు ఏ వ్యాఖ్యను జాతివ్యతిరేకం అంటారో, దేనిని చదివి దేశద్రోహిగా ముద్రవేస్తారో తెలియదు కనుక పౌరులు ఇక ఒళ్ళు దగ్గరపెట్టుకోక తప్పదు. దేశసమగ్రతకు, సార్వభౌమత్వానికీ, మరీముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న ప్రతీమాటనూ, వ్యాఖ్యనూ దుర్భిణీవేసి గాలించేందుకు వీలుగా సోషల్‌మీడియాపై తమ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఉత్తరాఖండ్‌ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కేవలం క్రిమినల్‌ రికార్డులు కాదు, వాటితో పాటు సోషల్‌ మీడియా నడవడిక సైతం ఇకనుంచి పరిశీలించాలన్నది నిర్ణయం. 


ఈ విషయంలో బిహార్‌లో నితీశ్‌ ప్రభుత్వం ఏకంగా రెండడుగులు ముందుంది. నిరసనలు, ర్యాలీలమీద ప్రత్యక్ష ఆంక్షలకు బదులు పరోక్ష నియంత్రణకు ఆ రాష్ట్రం సంకల్పించింది. ప్రభుత్వోద్యోగాలు, కాంట్రాక్టులు, పెట్రోలు బంకులు గ్యాస్‌ ఏజెన్సీల మంజూరు, బ్యాంకులోన్లు, కాంట్రాక్టు ఉద్యోగాలు తదితర ప్రయోజనాలకు వర్తించే పోలీసు వెరిఫికేషన్‌ జాబితాను మరింత విస్తరించింది. తమ ధ్రువీకరణ అవసరమని పోలీసులు మరిన్నింటిని సైతం నిర్థారించవచ్చు. నిరసనల్లో, ర్యాలీలలో పాల్గొనకూడదని నేరుగా అనకుండానే, ఆ సందర్భాల్లో కట్టుతప్పితే, రోడ్లు, బహిరంగ స్థలాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తే, ట్రాఫిక్‌జామ్‌లకు కారణమైతే వెరిఫికేషన్‌లో వారిని వదిలేది లేదని అంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణను ప్రభావితం చేసే నిరసనలు అంటూ వ్యాఖ్యానించడం వెనుక దురుద్దేశం కనిపిస్తున్నది. 


ఉభయరాష్ట్రాల వైఖరి దేశవ్యాప్తంగా అలజడి రేపడంతో ఇవేమీ తాము కొత్తగా ఇచ్చిన ఆదేశాలు కావనీ, చట్టాల్లో ఉన్నవేనని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. ఉన్నవే అయినా, వాటిని తవ్వితీయడం వెనుక పరమార్థం ప్రస్తుతం వివిధ అంశాలపై, మరీ ముఖ్యంగా రైతులకు మద్దతుగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిరసనలు సాగడమే. జాతివ్యతిరేకి అన్నమాటకు చట్టపరమైన నిర్వచనం ఏమీ లేనందున పాలకులను విమర్శించినవారిని, అసమ్మతివాదులను ఈ పేరుతో ఏరివేయవచ్చు. క్రిమినల్‌ కేసులున్నంత మాత్రాన పాస్‌పోర్టును నిరాకరించనక్కరలేదని గతంలో న్యాయస్థానాలు వ్యాఖ్యానించిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రినీ, ఎంపీలు ఎమ్మెల్యేలను సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే దానిన సైబర్‌నేరంగా పరిగణించాలని ఇటీవలే ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసన హక్కునీ, అభిప్రాయాన్ని వెలిబుచ్చే అధికారాన్ని క్రమంగా నిర్వీర్యపరచే కుట్రలు సాగుతున్నాయి. తమను నిలదీస్తున్నవారిని నిలువరించేందుకు పాలకులు లేని అధికారాలను ప్రయోగిస్తున్నారు. తాము అడ్డుతోవలో తెచ్చిన నల్లచట్టాలను వేలెత్తిచూపుతున్నవారిని నేరగాళ్ళుగా, దేశద్రోహులుగా ముద్రవేసి, పలు మాయోపాయాలతో విస్తృతప్రజానీకం మధ్యన వారిని విలన్లుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట అసమ్మతిని అణగదొక్కుతూ నిరసనను నేరంగా మార్చేస్తున్నారు. నిరసనకారులను నేరగాళ్ళుగా ముద్రవేసి వారి కనీస హక్కులను కాలరాస్తున్నారు. పౌరుల ప్రయోజనాలు, ఆకాంక్షలు పట్టకపోవడం అటుంచి, ఆరుబయట నిరసనలను, ఆన్‌లైన్‌ ఆందోళనలను సైతం అధికారంలో ఉన్నవారు భరించలేకపోవడం విచిత్రం, విషాదం.

Updated Date - 2021-02-06T06:46:11+05:30 IST