తప్పుడు లెక్కలు

ABN , First Publish Date - 2021-11-27T08:01:39+05:30 IST

‘ఒక్క చాన్స్‌’ అంటూ అధికారంలోకి అడుగుపెట్టిన రోజు నుంచే జగన్‌ సర్కారు ‘ఆర్థిక విధ్వంసం’ మొదలైందని తేలిపోయింది....

తప్పుడు లెక్కలు

రుజువు చేసిన కాగ్‌

జగన్‌ సర్కారు తొలి ఏడాదిపై నివేదిక

ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తమని వెల్లడి

ప్రజాధనం వినియోగం ఇలాగేనా?

బడ్జెట్‌పై అసెంబ్లీకి అదుపు తప్పింది

పీడీ ఖాతాల పేరిట ‘లోటు’ గోల్‌మాల్‌

అప్పులు దాచడానికి నానా తంటాలు

కేంద్ర పథకాల నిధులూ మళ్లింపు

గుడ్డిగా బడ్జెట్‌ కేటాయింపులు

యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన

ఉల్లంఘనలపై జవాబిచ్చే అధికారే లేడు

సర్కారు తీరుపై కాగ్‌ తీవ్ర ఆక్షేపణ

నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు


‘ఒక్క చాన్స్‌’ అంటూ అధికారంలోకి అడుగుపెట్టిన రోజు నుంచే జగన్‌ సర్కారు ‘ఆర్థిక విధ్వంసం’ మొదలైందని తేలిపోయింది. ఆర్థిక విషయాల్లో బడ్జెట్‌ అంటే లెక్కలేదు, అసెంబ్లీకి విలువలేదు, రాజ్యాంగానికి గౌరవం అసలే లేదని ‘కాగ్‌’ స్పష్టంగా తేల్చి చెప్పింది. ప్రజా ధనాన్ని రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఖర్చు చేస్తున్న వైనం.. ఖర్చులపై శాసన సభ తన నియంత్రణ కోల్పోయిన తీరుపై విస్మయం, అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్‌ సర్కార్‌ అధికారంలోకొచ్చిన మొదటి ఏడాది... 2019-20లో ఆర్థిక నిర్వహణపై కాగ్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిలో ఒక్క ప్రశంస కూడా లేదు. పైగా... జగన్‌ సర్కార్‌ ఆర్థిక అరాచకాలను పూర్తిగా కాకపోయినా, కొన్ని పార్శ్వాలను కాగ్‌ బయటపెట్టింది. దొంగ అప్పుల కోసం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేశారో, బడ్జెట్‌లో కేటాయింపులు ఎంత గుడ్డిగా ఉన్నాయో విడమరిచి చెప్పింది. ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేయడంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలు, పీడీ ఖాతాల గోల్‌మాల్‌ వ్యవహారాల గురించి కళ్లకు కట్టింది. కాగ్‌ తేల్చిన తప్పుడు లెక్కలు ఇవి...


పీడీ ఖాతాల పేరిట జరిగిన మాయను ‘కాగ్‌’ బయటపెట్టింది. ఒకవైపు పీడీ ఖాతాల్లో మూడొంతుల నిధులు నిల్వ ఉన్నట్లు చూపుతూనే... మరోవైపు రెవెన్యూలోటు అంత భారీగా ఎందుకు ఉందని ప్రశ్నించింది. అంతకుముందు 40వేల వరకు ఉన్న పీడీ ఖాతాలను జగన్‌ సర్కారు ఏకంగా దాదాపు 2 లక్షలకు పెంచింది. ఇవి బ్యాంకుల్లో ఉండే తరహా ఖాతాలు కావు. ఊరికే కంప్యూటర్‌లో ఉంటాయి. ఉదాహరణకు... వైద్య ఆరోగ్యశాఖ పేరుతో ఒక పీడీ ఖాతా ఓపెన్‌ చేసి, అందులోకి రూ.1000 కోట్లు ఖజానా నుంచి బదిలీ చేశారనుకుందాం. అవి కేవలం కంప్యూటర్‌లో మాత్రమే బదిలీ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ, అవి వైద్య ఆరోగ్య శాఖకు చేరవు. ఖజానాలోనే ఉంటాయి. అయితే... ఆ శాఖకు అవసరమైనప్పుడు సత్వరం ఆ నిధులు అందుబాటులోకి వస్తాయి. కానీ... జగన్‌ ప్రభుత్వం ఈ నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించింది. పీడీ ఖాతాలో మాత్రం డబ్బులు అలాగే కనిపిస్తాయి. ఈ అతితెలివి విధానాన్ని కాగ్‌ ఎత్తిచూపింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన రూ.1100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు బదిలీచేసి... అక్కడి నుంచి సొంత అవసరాలకు వాడుకుందని, నిబంధనలకు ఇది విరుద్ధమని తెలిపింది.


 అసెంబ్లీకి విలువేదీ?

అసెంబ్లీకి చెప్పకుండా, సభ ఆమోదం లేకుండా వేల కోట్ల రూపాయలను సెక్రటరీల స్థాయిలోనే నిర్ణయించి ఖర్చుచేయడాన్ని కాగ్‌ తప్పు పట్టింది. ఇది... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 205 (1) (ఏ)కి విరుద్ధమని, 205(1)(బీ)ని ఉల్లంఘించడమేనని తెలిపింది. అసెంబ్లీ ఆమోదం లేకుండా పైసా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదని ఈ అధికరణ చెబుతోంది. 

ప్రజాధనం ప్రతి పైసా శాసనసభ ఆమోదంతోనే ఖర్చు చేయాలి. అందులో భాగంగానే బడ్జెట్‌ ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా శాఖకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తే... ఆ అదనపు కేటాయింపులకు కూడా అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. ఇందుకు వర్షాకాల, శీతాకాల సమావేశాలు ఉపయోగపడతాయి. కానీ, జగన్‌ సర్కార్‌ ఈ పనేమీ చేయకుండా అదనంగా నిధులు కేటాయించేసి, ఆ నిధుల ఖర్చు కూడా పూర్తయ్యాక తీరిగ్గా మరుసటి సంవత్సరం అసెంబ్లీ ఆమోదం తీసుకుంటోంది. ఇది తప్పుడు విధానమని కాగ్‌ వ్యాఖ్యానించింది.

 

2019-20లో తిరిగి చెల్లించాల్సిన అప్పుల అసలు, వడ్డీలు రూ.32,373 కోట్లు పెరిగాయి. బడ్జెట్లో చూపని అప్పులు రూ.26,096 కోట్లు ఉన్నాయి. వెరసి... రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, డబ్బుల ఖర్చు అసెంబ్లీ నియంత్రణ దాటిపోయేలా ఉందని కాగ్‌ ఘాటుగా వ్యాఖ్యానించింది.


 ఎఫ్‌ఆర్‌బీఎంతో గేమ్స్‌

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని జగన్‌ సర్కారు ఇష్టానుసారం సవరించింది. 2020 డిసెంబరులో ఈ చట్టం సవరించారు. కానీ, 2020 ఆగస్టు నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టుగా తేల్చేసింది. పైగా 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల్లోని లక్ష్యాలకు కూడా ఈ సవరణను వర్తింపజేశారని, 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు, ఈ సవరణలకు పొంతనే లేదని కాగ్‌ తేల్చింది. మరోవైపు... రెవెన్యూ ఖర్చులను పెట్టుబడి ఖర్చుగా చూపడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం అప్పులో 80 శాతాన్ని రెవెన్యూ ఖర్చుకు వినియోగించడంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పన లేకుండా పోయింది. రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. టీడీపీ ప్రభుత్వం చివరి ఏడాది 2018-19 కంటే 2019-20లో రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్రానికి ఆస్తులు సమకూర్చడంపై పెట్టే ఖర్చు 38.72 శాతం తగ్గింది. రాష్ట్ర భవిష్యత్‌పై ఇది తీవ్రప్రభావం చూపుతుందని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పైగా.. ప్రభుత్వం కొన్ని అప్పులను మాత్రమే తన ఖాతాలో చూపిస్తోందని, మరికొన్ని అప్పులను చూపకుండా దాచేస్తోందని కాగ్‌ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అన్ని అప్పులను బడ్జెట్‌లో చూపించడం లేదంది. 


2019-20కి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్‌ను ముం దుగా ఖర్చు చేసి, ఆ తర్వాత జూన్‌ 2020లో వాటికి శాసనసభ ఆమోదం తీసుకున్నారు. రాజ్యాంగ నిబంధనలకు ఇది విరుద్ధం. బడ్జెట్‌పై చట్టసభల నియంత్రణను బలహీనపరచడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించడమేనని కాగ్‌ ఆగ్రహించింది.


 ఏదీ సంబంధం?

2019-20లో బడ్జెట్‌ కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా సంబంధం లేదు. విపరీతంగా కేటాయించిన విభాగాలకు అసలు ఖర్చు చేయలేదు. అస్సలు నిధులు కేటాయించని విభాగాలపై విపరీతంగా ఖర్చు చేశారు. అసెంబ్లీ అభీష్టానికి విరుద్ధంగా జరిగిన ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించాలని కాగ్‌ అభిప్రాయపడింది. కొన్ని విభాగాలపై కేటాయింపుల కంటే ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతోందో సమీక్షించుకోవాలని, ప్రభుత్వం తన వనరులను వాస్తవంగా అంచనా వేసుకొని వివేకంగా ఖర్చులు నిర్వహించుకోవాలని హితవు పలికింది. 


 కేంద్రం డబ్బులూ స్వాహా

కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేయడం కోసం కేంద్రం ఇస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలకోసం కాకుండా సొంత అవసరాలకు వాడుతోంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్లు రాకుండా పోయే ప్రమాదం ఉందని కాగ్‌ తెలిపింది.

 

ఇక... రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, అథారిటీలు, అభివృద్ధి సంస్థలు, స్వయంపాలక సంస్థలు ఆర్థిక నిర్వహణ అకౌంట్లు చూపించడం లేదని... ప్రభుత్వ శాఖల్లో అంతర్గతంగా ఉండాల్సిన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపింది.



‘ఆంధ్రజ్యోతి’ కథనాలు అక్షర సత్యాలు

జగన్‌ సర్కార్‌ అవలంబిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలపై ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కాగ్‌ నివేదిక నేపథ్యంలో అవన్నీ అక్షర సత్యాలని రుజువైంది. అప్పుల కుప్ప -తప్పుల లెక్క, రాజ్యాంగం పట్టదా, పీడీ ఖాతాల గోల్‌మాల్‌, అప్పుల తప్పులు... ఇలా అనేక కథనాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. బడ్జెట్‌ తయారీలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కనపెట్టి సెక్రటరీలు ఇద్దరూ కన్సల్టెంట్ల సాయంతో బడ్జెట్‌ తయారుచేయడంపై, అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లకుండా సెక్రటరీల స్థాయిలోనే అదనపు బడ్జెట్‌ ఇవ్వడంపైనా కథనాలు వచ్చాయి.



Updated Date - 2021-11-27T08:01:39+05:30 IST