పూర్తిస్థాయిలో నింపితేనే ఉపయోగం

ABN , First Publish Date - 2020-05-25T09:31:59+05:30 IST

మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ను సాగర్‌జలాలతో పూర్తిస్థాయిలో నింపాలని ఈప్రాంతానికి చెందిన రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు..

పూర్తిస్థాయిలో నింపితేనే ఉపయోగం

వైరా, మే 24: మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ను సాగర్‌జలాలతో పూర్తిస్థాయిలో నింపాలని ఈప్రాంతానికి చెందిన రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు వేడుకుంటున్నారు. వైరాకు సాగర్‌జలాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. ఈ వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఎన్నెస్పీ జలాలతో రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు శ్రీకారం చుట్టింది. చిన్నతరహా నీటివనరులను సాగర్‌జలాలతో తేలిగ్గానే నింపవచ్చు. అయితే దాదాపు 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 11మండలాల్లోని వందలాది గ్రామాలకు తాగునీరందించే వైరా రిజర్వాయర్‌ను సాగర్‌జలాలతో పూర్తిస్థాయిలో నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


సాగర్‌ జలాల విడుదల

రెండురోజులుగా సాగర్‌జలాలను వైరా రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఈనెల 31వతేదీ వరకు సాగర్‌జలాలు రానున్నాయి. ఇప్పుడు వస్తున్న సాగర్‌ నీటి పరిమాణం ప్రకారమైతే రిజర్వాయర్‌ నీటిమట్టం ఆశించినంతగా పెరిగే అవకాశం లేదు. కనీసం మిషన్‌ భగీరథ నుంచి నీటి అవసరాల కోసం నిల్వఉంచే నీటి సామర్థ్యానికి కూడా ఈ నీటిమట్టం పెరిగే అవకాశం లేదు. 


రోజుకు ఒక్క అంగుళమే..

ప్రస్తుతం రిజర్వాయర్‌ నీటిమట్టం 11.7అడుగులుగా ఉంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 18.3అడుగులు. 6.6అడుగుల నీరు వస్తేనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఎస్కేప్‌ లాకుల నుంచి రిజర్వాయర్‌కు 200క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈనీళ్లు దాదాపు 20కిలోమీటర్లు ప్రయాణించి రిజర్వాయర్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ నీటి ప్రవాహం మధ్యలో ఏట్లో సగం నీరు వృథా అవుతుంది. చివరికి రిజర్వాయర్‌లోకి వచ్చే నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు రోజుకు ఒక అంగుళం చొప్పున మాత్రమే నీటిమట్టం పెరుగుతోంది. ఈవిధంగా మిగిలిన వారంరోజులు సాగర్‌నీళ్లు విడుదల చేసినా రిజర్వాయర్‌ నీటిమట్టం కనీసం 13అడుగులకు కూడా చేరుకునే అవకాశం లేదు. ఇంకా 5అడుగులకుపైగా నీటిమట్టం తక్కువగానే ఉంటుంది. మిషన్‌ భగీరథ అవసరాల కోసమే ఈ రిజర్వాయర్‌లో 14అడుగుల మేర నీటినిల్వ ఉంచాల్సి ఉంది. 


తాగునీటి అవసరాలు తీరేనా..?

కనీసం తాగునీటి అవసరాల మేరకు కూడా నీటిమట్టం ఉండే పరిస్థితి లేదు. ఈ సాగర్‌జలాలను ఇతర ప్రాంతాల్లోని చెరువులు నింపేందుకు విడుదల చేస్తున్నప్పటికీ చాలాచోట్ల అవి వృథాగా పోతున్నాయి. ఆనీళ్లను పొదుపు చేసి ఆనీళ్లను ఎక్కువ సామర్థ్యంతో విడుదల చేయాల్సిన అవసరముంది. ఈ ఎస్కేప్‌ లాకుల నుంచి పూర్తిస్థాయిలో సాగర్‌జలాలను వైరాకు విడుదల చేస్తే కనీసం 15అడుగుల నీటిమట్టానికైనా చేరుకుంటుంది. 


ఖరీఫ్‌కు నీరుండేనా..?

గత ఏడాది వానాకాల సమయంలో సకాలంలో వర్షాలు లేక రైతులు నార్లు పోసుకోలేదు. ఆసమయంలో నార్ల కోసం నీళ్లిచ్చే అవకాశం కూడా లేకుండాపోయింది. జూలై చివరి నుంచి వర్షాలు కురిసినా రైతులు నాట్లు వేసుకొనేందుకు అవసరమైన వరినార్లు లేకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌ మొత్తాన్ని కోల్పోయారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాల పేరుతో నీటిని వృథాగా విడుదల చేయకుండా వైరాకు ఎక్కువ సామర్థ్యంతో సాగర్‌జలాలను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-05-25T09:31:59+05:30 IST