ఆరిపోయిన యువ కార్టూన్‌ దీపం.. నక్కా ఇళయరాజా

ABN , First Publish Date - 2022-01-21T09:30:22+05:30 IST

జనవరి 16న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన యువ కార్టూన్‌ దీపం పేరు నక్కా ఇళయరాజా....

ఆరిపోయిన యువ కార్టూన్‌ దీపం.. నక్కా ఇళయరాజా

జనవరి 16న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన యువ కార్టూన్‌ దీపం పేరు నక్కా ఇళయరాజా. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన డాక్టర్‌ దంపతులు డా. నక్కా విజయరామరాజు, డా. నందిని– తమ ఇద్దరు పిల్లలకు సినిమా రంగంపై అభిమానంతో ఇళయరాజా, భారతీరాజా అని పేర్లు పెట్టుకున్నారు. ఈ దంపతులు ఆర్మూర్‌లో వైద్యవృత్తిలో ఉన్నారు. పెద్దవాడైన ఇళయరాజాకు చిన్నప్పటి నుంచి బొమ్మలంటే ఆసక్తి. చిన్నప్పుడు ఇంటిగోడల మీద, నోట్సు పుస్తకాలను బొమ్మలతో నింపేసేవాడు. రాజా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆ వైపు ప్రోత్సహించారు. 12 సంవత్సరాల వయసు వరకూ అందరిలాగే ఆడుతూ పాడుతూ తిరిగిన రాజా, కండరాల సంబంధ వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. డిగ్రీ రెండో సంవత్సరం చదువును మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. అశక్తతను తన అభిరుచికి అడ్డని తలచకుండా తనకు ఇష్టమైన కార్టూన్‌ రంగంలో తొలి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. సాధారణంగా చిత్రకళా రంగంలో ప్రవేశించే వారిపై ముందటి తరం చిత్రకారుల ప్రభావం ఎంతో కొంత తప్పక ఉంటుంది. కానీ రాజా తన ముందటితరం దిగ్దంతులైన కార్టూనిస్టులు బాపు, చంద్ర, జయదేవ్‌, మోహన్‌, అన్వర్‌ లాంటి కార్టూనిస్టుల గాలి సోకకుండా జాగ్రత్తపడ్డాడు వాళ్ల అభిమాని అయివుండి కూడా! తనదైన సొంత గీత, సొంత శైలి సాధనలో భాగంగా 350 పైచిలుకు కార్టూన్లు, బొమ్మల కథలకు రూపకల్పన చేశాడు. రాజా తన నాన్నగారి మిత్రులకు, తన మిత్రులకు, తన పెయింటింగ్స్ గ్రీటింగ్ కార్డులు చేసి పంపే వాడు. ప్రతి సందర్భానికీ కుటుంబం నాలుగు పేర్లతో వచ్చేవి. వచ్చే ఏడాది గ్రీటింగ్స్ పంపడానికి రాజా లేడు. రాజా మొదటి కార్టూన్‌ 2014, సెప్టెంబర్‌ 3న ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో ‘మా టామీకీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉంది’ కాప్షన్‌తో అచ్చయింది. గో.తెలుగు.కామ్‌లో అనేక కార్టూన్లు అచ్చయ్యాయి. 2020 నవంబర్‌ 20న హైదరాబాద్‌లో కళాసాగర్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించబడిన ‘కొంటె బొమ్మల బ్రహ్మలు’ 166 కార్టూనిస్టుల సెల్ఫీల గ్రంథ ఆవిష్కరణ సభలో తొలి ప్రతి స్వీకర్తగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న యువబ్రహ్మ ఇళయరాజా. జీవించి ఉంటే ప్రముఖ కార్టూనిస్టుల సరసన రాజా పేరు కూడా నిలిచేది. ఇళయరాజా గొప్ప సాహిత్య సాంస్కృతిక వారసత్వం నుంచి వచ్చినవాడు. పెదనాన్న నక్కా అమ్మయ్య రెక్కలచెట్టు, తిరుపతమ్మ శతకం, హృదయసీమ వంటి కావ్య సంపుటాలు వెలువరించిన కవి. తండ్రి రామరాజు మంచి కథా రచయిత. భట్టిప్రోలు కథలు, మనవూరి కథలు, దేవతావస్త్రాలు వంటి కథాసంపుటాలు, నాగమ్మ వంటి నవల వెలువరించారు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాజా కార్టూన్లు, ప్రముఖ కార్టూనిస్టులు జయదేవ్‌, అన్వర్‌ల ముందుమాటలతో ‘కిడ్డూస్‌ టూన్స్‌’ పేరుతో ముద్రణ ప్రయత్నంలో ఉండగా రాజా నిష్క్రమించడం ఆ కుటుంబానికే కాదు తెలుగు కళారంగానికీ తీరని లోటు. తీర్చలేని లోటు. ఆ కార్టూన్ల పుస్తకం రాజా పుట్టినరోజు అయిన జూలై 30 నాటికి అయినా తీసుకురాగలిగితే అదే రాజాకు ఘన నివాళి! రాజాకు కన్నీటి కళాంజలులు!

డా. శిఖామణి, కవిసంధ్య సంపాదకులు

Updated Date - 2022-01-21T09:30:22+05:30 IST