యాభై కాపీలు అమ్మితే పేరుమోసిన కవే!

ABN , First Publish Date - 2021-11-08T06:14:49+05:30 IST

కవులూ, రచయితలూ తాము రాసిన కవితలూ, కథలూ, కావ్యాలూ, వ్యాసాలూ, నవలలూ, నాటకాలూ, శతకాలూ వంటివాటిని స్వంతంగా ఎందుకు ప్రచురిస్తున్నారు? ఎందుకేమిటి, పాఠకుల కోసం, వాళ్ళు చదువుతారనే జవాబు వస్తుంది....

యాభై కాపీలు అమ్మితే పేరుమోసిన కవే!

కవులూ, రచయితలూ తాము రాసిన కవితలూ, కథలూ, కావ్యాలూ, వ్యాసాలూ, నవలలూ, నాటకాలూ, శతకాలూ వంటివాటిని స్వంతంగా ఎందుకు ప్రచురిస్తున్నారు? ఎందుకేమిటి, పాఠకుల కోసం, వాళ్ళు చదువుతారనే జవాబు వస్తుంది. ఇది నిజమా? కాదు, పాక్షిక సత్యం మాత్రమే.


నిరుడూ, ఇయ్యేడూ కరోనా కారణంగా పుస్తకాల ప్రచురణ కొంత తగ్గింది. ఇంతకు ముందైతే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి దాదాపు 350 నుంచి 400 వరకూ కవితా సంకలనాలు ప్రచురణ జరిగినట్లు ఒక అంచనా. మామూలు కవితలూ, మినీ కవితలూ, నానో కవితలూ, నానీ కవితలూ, హైకూలూ, మొగ్గలూ, దీర్ఘ కవితలూ అన్నీ కలిపి ఆ అంచనా. కథా సంకలనాలైతే సుమారుగా వంద దాకా ప్రచురణ పొందేవి. పెద్ద పెద్ద ప్రచురణ సంస్థలు కాకుండా ఇవన్నీ రచయుతలూ కవులూ సొంతంగా ప్రచురించుకునేవి.అయితే వాటిలో ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని పాఠకుల చెంతకు చేరాయి? 


ఒక అనుభవం చెపుతాను. నాకు బాగా పరిచయమున్న రచయిత (గత ఏడాది మరణించారు). కథలు చదివే పాఠకుల్లో మంచి పేరు ఉంది. కథని చివరివరకూ ఉత్కంఠభరితంగా నడిపి, చివర్లో ఊహించని విధంగా కొసమెరుపుతో ముగించడం ఆయన ప్రత్యేకత. ఓహెన్రీ, గైడీమపాసా కథల మాదిరి ఈయన కథలు ఉంటాయని విమర్శకుల, సమీక్షకుల ప్రశంస! ఆయన వేరు వేరు కాలాల్లో నాలుగు కథానికా సంపుటాలు ప్రచురించారు. మొదటి కథా సంపుటినీ, తరువాత కొంత కాలానికి రెండో పుస్తకాన్నీ వివిధ పుస్తక విక్రయ దుకాణాలవాళ్లకి అమ్మకానికి ఇచ్చారు. మంచి పేరూ, గుర్తింపు కలిగిన ప్రముఖ విక్రయశాలలకి కూడా ఇచ్చాడు. రెండుమూడేళ్ళ తరువాత ఆయన పంపించిన పుస్తకాలు ఒక్క కాపీ కూడా అమ్ముడు పోకపోవటంతో వాళ్ళు కట్టలు తిప్పి పంపించారు. తరువాత మళ్ళీ ఆయన వేర్వేరు కాలాల్లో మరో రెండు సంకలనాలు కూడా ప్రచురించారు. సమీక్షల కోసం వివిధ పత్రికలకి పంపించారు. మంచి సమీక్షలు కూడా వచ్చాయి. మరి ఎన్ని అమ్ముడుపోయాయి. సున్న! ఏమీ అమ్ముడుపోలేదు. ‘‘మరి ఎందుకండీ ఇలా పుస్తకాలు ప్రింట్‌ చేసుకోవడం?’’ అని అడిగాను. ‘‘మన కథలు అన్నీ రికార్డ్‌ అయి ఉండాలి కదండీ?’’ అన్నారు. ఆయన బి.పి.కరుణాకర్‌! బండారు ప్రసాద్‌ కరుణాకర్‌. ఆయన కథా సంకలనాలు: అంబాలిస్‌, నిర్నిమిత్తం, రాజితం, డియర్‌. అన్ని ప్రముఖ పత్రికలూ ఆయన కథల్ని ప్రచురించాయి. గుర్తింపు కలిగిన రచయితే! మరి ఆయన పుస్తకాలు ఎందుకు అమ్ముడుపోలేదో అగమ్యగోచరం! 


నేను విషయం తెలుసుకుందామని పదిమంది రచయితల్ని అడిగాను. వీళ్లు స్వంతంగా పుస్తకాలు ప్రచురించినవాళ్లు. అమ్మకాలు ఉత్సాహంగానూ, ప్రోత్సా హంగానూ వున్నట్లు ఒక్కరు కూడా చెప్పలేదు. అందరూ నిరాశగానే మాట్లాడారు. బాగా రాస్తారని మంచి పేరు వున్న రచయితల పుస్తకాలు అయితే, వందవరకూ అమ్ముడుపోవచ్చని ఇద్దరు రయితలు అన్నారు. 


కవుల పరిస్థితి మరీ ఘోరం! 50కవిత్వ సంపుటులు అమ్మగలిగే కవి వున్నారంటే, ప్రస్తుత పరిస్థితిలో ఆయన్ని నిస్సందేహంగా మహా గొప్పకవిగానే పరిగణించవచ్చు. ప్రచురించిన పుస్తకాలు కొన్ని వదిలించుకుందామనీ, లేదా తమ ఘనతనీ, గొప్పదనాన్ని ప్రదర్శించుకుందామని తెల్సినవాళ్ళకీ, పరిచయస్థులకీ పంపిణీ చేస్తే, వాళ్ళు దార్లో జారవిడవడమో, ఇంటి దగ్గర చెత్తబుట్టలో వేయడమో జరుగుతోంది కూడా! లేదా కట్టలుకట్టి ఇళ్ళలో షెల్ఫ్‌ల్లో భద్రపరుచుకోవాలి. నెలకో, రెండు నెల్లకో దుమ్ములు దులుపుకుంటూ, షెల్ఫ్‌లు సర్దుకుంటూ ఇల్లాళ్లు ఆ కట్టల్ని సర్దలేక విసుక్కోవడం! ఎప్పుడో ఒకప్పుడు పాత కాగితాలు కొనేవాళ్ళకి కిలోల లెక్క విక్రయించుకోవాల్సిందే! 


కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు రచయితల, కవుల పుస్తకాలు కొన్నైనా కొని, కొంతమేరకైనా ఆదరిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దయనీయం! ఇక్కడి ప్రభుత్వాలు ఈ బుద్ధిజీవుల్ని కనీసంగా పట్టిం చుకునే పరిస్థితి లేదు. తమ భజనపరులైన కవులకీ, రచయితలకీ మాత్రం జీవితకాల సాఫల్య పురస్కారాల పేరుతో లక్షల్లక్షలు పందేరాలు చేస్తున్నాయి. 


ప్రియమైన రచయితలూ, కవులూ! మీ పుస్తకాల్ని అచ్చువేసుకోవాలంటే ఒక్కసారి ఆలోచించి రంగంలోకి దిగండి. అత్యాశకి పోవద్దు. లాభం ఆశించకుండా వీలైనంత తక్కువ ధర పెట్టండి. ఆ తక్కువ ధరతోనే కనీసం వందా, రెండొందల పుస్తకాలు అమ్ముకోగల పరిస్థితి వుంటే తప్పనిసరిగా ప్రచురించడండి. అంత మాత్రం కూడా అమ్మకాలు లేకపోతే, పేపరూ, శ్రమా వ్యర్థం కావడం, చేతి చమురు వదిలించుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. 

మొలకలపల్లి కోటేశ్వరరావు

99892 24280


Updated Date - 2021-11-08T06:14:49+05:30 IST