యాదాద్రిలో పసిడి వర్ణపు క్యూలైన్లు

ABN , First Publish Date - 2020-12-03T06:14:24+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆలయ ఉద్ఘాటనకు తుది మెరుగుల్లో భాగంగా స్వామివారి దర్శన క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు.

యాదాద్రిలో పసిడి వర్ణపు క్యూలైన్లు
యాదాద్రి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లుచేస్తున్న పసిడి వర్ణపు బ్రాస్‌ క్యూలైన్లు

యాదాద్రి ప్రధానాలయంలో రూ.2 కోట్ల అంచనా వ్యయం

పనులు ప్రారంభించిన చెన్నై సంస్థ

యాదాద్రి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆలయ ఉద్ఘాటనకు తుది మెరుగుల్లో భాగంగా స్వామివారి దర్శన క్యూలైన్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల క్యూలైన్లను పసిడివర్ణపు ఆకర్షణీయమైన బ్రాస్‌ బారికేడ్లను అమర్చుతున్నారు. ఆలయ ప్రాకార మండపాలను దాటిన తర్వాత తూర్పు దిశగా ఉన్న త్రితల రాజగోపుర ద్వారం నుంచి ఆళ్వార్‌ ముఖమండపం మీదుగా గర్భాలయం లోపలివరకు రెండు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రవేశానికి ఒక వరుసకాగా, మరో వరుస నుంచి దర్శనాల అనంతరం ఆలయం బయటకు రావడానికి రెండు వరుసలుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. రూ.2కోట్ల అంచనా వ్యయంతో చెన్నెయ్‌కి చెందిన బ్రాస్‌ విగ్రహాల తయారీ సంస్థ చేపట్టిన బ్రాస్‌ క్యూలైన్‌, బ్రాస్‌ బారికేడ్‌ నమూనాలను ఇటీవల సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో పరిశీలించి ఆమోదించారు. దీంతో ప్రధానాలయంలో బ్రాస్‌ క్యూలైన్ల అమరిక పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.

Updated Date - 2020-12-03T06:14:24+05:30 IST