యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం విరాళం

ABN , First Publish Date - 2021-11-27T03:01:55+05:30 IST

యాదాద్రి లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడంకోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి రెండు కిలోల ముడి బంగారాన్ని

యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం విరాళం

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడంకోసం నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి రెండు కిలోల ముడి బంగారాన్ని విరాళంగా అందజేశారు. కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన బాలాలయంలో కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. విరాళంగా ఇవ్వనున్న 20 ముడి బంగారం బిస్కెట్లను(ఒక్కొక్కటి 100 గ్రాములు) పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన పళ్లెంలో తీసుకొచ్చారు. బాలాలయ సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తుల పాదాల చెంత బంగారాన్ని ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బంగారు బిస్కెట్లను ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. ప్రధానాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోనుందన్నారు. 22 ఏళ్ల కిత్రం తాను యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించానని, అప్పుడే స్వామికి తనవంతుగా మొక్కులు చెల్లించుకుంటానని విన్నవించుకున్నానని తెలిపారు. టెంపుల్‌ సిటీలో కాటేజీ నిర్మాణానికి తమ సంస్థ జేసీ బ్రదర్స్‌ తరఫున రూ.2కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు పి.మధుబాబు విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.1.72లక్షల విరాళం చెక్కును ఈవో గీతారెడ్డికి దేవస్థాన ప్రధాన కార్యాలయంలో అందజేశారు. 


Updated Date - 2021-11-27T03:01:55+05:30 IST