అలైన్‌మెంట్‌ మార్చకుంటే ఆత్మహత్యకైనా సిద్ధం

ABN , First Publish Date - 2021-01-21T05:44:10+05:30 IST

యాదాద్రి రింగురోడ్డు విస్తరణ అలైన్‌మెంట్‌లో మార్పు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భూనిర్వాసితులు హెచ్చరించారు.

అలైన్‌మెంట్‌ మార్చకుంటే ఆత్మహత్యకైనా సిద్ధం
ఆర్‌ అండ్‌బీ, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్న నాయకులు, నిర్వాసితులు

యాదాద్రిలో రింగురోడ్డు విస్తరణ పనుల అడ్డగింత

యాదాద్రిటౌన్‌, జనవరి 20: యాదాద్రి రింగురోడ్డు విస్తరణ అలైన్‌మెంట్‌లో మార్పు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భూనిర్వాసితులు హెచ్చరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండచుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్డు రహదారి విస్తరణ పనులను గోశాల వద్ద నిర్వాసితులు బుధవారం అడ్డుకున్నారు. దీంతో అధికారులు, బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. రింగురోడ్డు రహదారి అలైన్‌మెంట్‌లో మార్పు చేసి తమకు నష్టం కలగకుండా చూడాలని బాధితులు డిమాండ్‌ చేశారు. తమకు అన్యాయం జరగకుండా విస్తరణ పనులు చేయాలని కోరారు. నిర్వాసితురాలైన మద్దూరి భాగ్యమ్మ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ డబ్బాతో ఆత్మహత్యకైనా సిద్ధమేనని పనులను అడ్డగించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి పెట్రోల్‌ డబ్బాను లాక్కున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌, భజరంగ్‌దళ్‌, బీజేపీ నాయకులు గోశాల వద్దకు చేరుకున్నారు. అండగా ఉంటామని బాధితులకు నచ్చజెప్పారు. ఆత్మహత్యతో సాధించేది ఏదీ లేదని, రింగురోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుచేసి రహదారి నిర్మించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతామని సర్దిచెప్పారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను ఇటీవల కలిసి రింగురోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుచేసి, నిర్మించాలని కోరామన్నారు. అలైన్‌మెంట్‌ మార్పు చేసిన ప్లాన్‌ను అర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులకు అందజేశారు. బాధితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, కల్లెం శ్రీనివాస్‌, బెలిదె అశోక్‌, నిర్వాసితులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-21T05:44:10+05:30 IST