ఉద్ఘాటనకు ‘యాదాద్రి’ సిద్ధం

ABN , First Publish Date - 2022-01-22T07:43:33+05:30 IST

ఆధ్యాత్మిక నగరిగా రూపొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

ఉద్ఘాటనకు ‘యాదాద్రి’ సిద్ధం

  • ప్రధానాలయం ఆర్‌సీసీ పనులు పూర్తి.. మార్చి 21న మహా సుదర్శన యాగం
  • 8 75 ఎకరాల్లో 1008 హోమ కుండలాలతో 
  • నిర్వహణ : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి 
  •  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన 


యాదాద్రి/టౌన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక నగరిగా రూపొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ఉద్ఘాటనకు సర్వం సిద్ధం చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి శుక్రవారం ఆయన యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కొండపైన ఘాట్‌రోడ్‌లోని హరిత కాటేజీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని అన్నారు. రూ.1200 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు కృష్ణరాతి శిలలతో కొనసాగుతున్నాయని తెలిపారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం 250 కాటేజీలను కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. ‘‘యాదాద్రి ప్రధానాలయంతో పాటు ఆర్‌సీసీ పనులు పూర్తయ్యాయు. మిగిలిన పనులను ఫిబ్రవరిలోగా పూర్తిచేస్తాం. మార్చి 21న మహాసుదర్శన యాగం ఆరంభమవుతుంది. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, గర్భాలయంలో స్వయంభువుల దర్శనాలు ప్రారంభం అవుతాయి.


మార్చి 21 నుంచి 28 వరకు ఆలయ సమీపంలోని 75 ఎకరాల్లో 1008 హోమ కుండలాలతో మహాసుదర్శన యాగాన్ని నిర్వహించనున్నాం. యగశాలలను సందర్శించే భక్తుల కోసం ఎనిమిది రోజుల పాటు లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కూడా కల్పిస్తాం. ఆలయ అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయు. మిగిలిన పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. మొదటి ఘాట్‌ రోడ్‌ వద్ద చేపట్టే ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం లండన్‌ నగరం నుంచి ప్రత్యేకంగా కేబుల్‌ను తెప్పిస్తున్నాం’’ అని మంత్రి పేర్కొన్నారు.


అలాగే సమ్మక్క, సారక్క జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే భక్తులు దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. మంత్రి వెంట వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆర్కిటెక్‌ ఆనందసాయి, ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, దేవస్థాన, వైటీడీఏ అధికారులు ఉన్నారు.



మంత్రిని అడ్డుకున్న వర్తక సంఘం సభ్యులు

యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కొండపైన వర్తక సంఘం సభ్యులు అడ్డుకున్నారు. కొండపైన బాలాలయంలో పూజలు నిర్వహించిన మంత్రి.. ఆలయ విస్తరణ పనుల పరిశీలనకు కాన్వాయ్‌లో వెళుతుండగా, కొండపైన లిఫ్టు సమీపంలో కాన్వాయ్‌ని అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడే ఉన్న దేవస్థాన ఈవో గీతారెడ్డి వర్తకుల వద్దకు వెళ్లి సీఎంతో చర్చించి సమస్యకు పరిష్కారం లభించేలా కృషి చేస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. దీంతో వారు ఆందోళనను విరమించారు.


Updated Date - 2022-01-22T07:43:33+05:30 IST