యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-06-23T07:02:05+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు.

యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
బాలాలయంలో సుదర్శన నారసింహ హోమపూజలు నిర్వహిస్తున్న అర్చకులు

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి 

సీఎం సూచనల మేరకు అభివృద్ధి పనులపై సమీక్ష 

యాదాద్రి టౌన్‌, జూన్‌ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులను పరిశీలించి అభివృద్ధి పనుల పురోగతి, నిర్వహణ తీరుపై సీఎం కేసీఆర్‌ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పూర్తికి పలు సూచనలు, సలహాలతో అధికారులకు దిశానిర్ధేశం చేశారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులను అ నుకున్న గడువులోగా పూర్తి చేయాలని.. సమన్వయంతో పనుల పూర్తికి కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కొండపైన అభివృద్ధి పనులు, భక్తుల మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఆలయ విస్తరణకోసం అవసరమైన ప్రాంతాల్లో భూసేకరణ, సర్వే తదితర పనులు త్వ రితగతిన పూర్తికి  కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి మంగళవా రం హైదరాబాద్‌ బేగంపేటలోని హెచ్‌ఎమ్మార్‌ భ  వనంలో వైటీడీఏ అధికారులు, నిర్మా ణ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమీక్షలో వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్‌ ఆనందసాయి, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


ముమ్మరంగా ఫ్లైఓవర్‌ పనులు 

కొండకింద తులసీకాటేజ్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులను సీఎం సూచనలతో ఆర్‌ అండ్‌బీ అధికారులు వేగవంతం చేశారు. మంగళవారం ఫ్లైఓవర్‌ ఫిల్లర్ల నిర్మాణంకోసం తులసీకాటేజ్‌ ప్రాంతంలో అధికారులు మార్కింగ్‌ నిర్వహించారు. ఈ ఫ్లైఓవర్‌ లోటస్‌ టెంపుల్‌ వద్ద ప్రారంభమై తులసీకాటేజ్‌ పురాతన బావి మీదుగా యాదరుషి కొలువైన మర్రిచెట్టు పక్క నుంచి ఆలయ మొదటి ఘాట్‌రోడ్‌ వరకు ఉంటుంది. యాదాద్రికొండ చుట్టూ నిర్మిస్తున్న ఆరులేన్ల రహదారి నిధుల్లోనే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు నిర్వహిస్తున్నారు. అయితే తులసీకాటేజ్‌లోని పురాతన బావి, యాదరుషి కొలువుదీరిన మర్రి చెట్టును ఆరులేన్ల రింగురోడ్డు రహదారిలో భాగం గా తొలంగించకుండా ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు వైటీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 445 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్‌ను మొదటి ఘాట్‌రోడ్‌కు అనుసంధానం చేయనున్నారు. 


క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చనలు

గుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం  క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి, అనుబంధ పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామిని కొలుస్తూ అర్చకబృందం వేదమంత్రపఠనాలతో పంచామృతాభిషేకం చేశారు. సింధూరం, వివిధ రకాల పూల మాలలతో అలంకరించారు. ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళాలతో అర్చించారు. ముందుగా ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపి బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచా రు. మండపంలో ఉత్సవమూర్తులను అభిషేకించి, హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవోత్సవాలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. 

Updated Date - 2021-06-23T07:02:05+05:30 IST