యాదాద్రి ఆలయానికి మార్చి 28న ఉద్ఘాటన!

ABN , First Publish Date - 2021-10-20T07:54:11+05:30 IST

యాదాద్రి లక్ష్మీ నృసింహుడి దివ్యక్షేత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న పునఃప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

యాదాద్రి ఆలయానికి మార్చి 28న ఉద్ఘాటన!

మహాకుంభ సంప్రోక్షణతో కొత్తగుడి ప్రారంభం

మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ

10 వేల మంది రుత్వికులతో మహా సుదర్శనయాగం: సీఎం కేసీఆర్‌

ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం

125 కిలోల పసిడి విరాళానికి కేసీఆర్‌ పిలుపు

కుటుంబం తరఫున కిలో 16 తులాలు ప్రకటన


యాదాద్రి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీ నృసింహుడి దివ్యక్షేత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న పునఃప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. యాదాద్రిలో మంగళవారం ఎనిమిది గంటలపాటు పర్యటించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కొండపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 21న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేస్తామని సీఎం ప్రకటించారు. అదేరోజు మహా సుదర్శన యాగం మొదలై, ఎనిమిది రోజులపాటు సాగుతుందని తెలిపారు. చివరిరోజు 28న మహాకుంభ సంప్రోక్షణతో ఆలయ ఉద్ఘాటన చేస్తామని చెప్పారు. మహా సుదర్శన యాగాన్ని కొండకింద 100 ఎకరాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.మహాకుంభ సంప్రోక్షణకు రావాలని దేశవ్యాప్తంగా వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నామన్నారు. సుదర్శన యాగంలో 1,008 కుండలాలతో ఆరు వేల మంది రుత్వికులు, నాలుగు వేల మంది సహాయకులు మొత్తం పదివేల మంది పాల్గొంటారని చెప్పారు. లక్షా 50 వేల లీటర్ల కల్తీ లేని నెయ్యితో పాటు పలు ద్రవ్యాలను ఉపయోగిస్తారని వివరించారు. సుదర్శన యాగాన్ని జీయర్‌స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పారు.


స్వామి వారి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడంలో పాలు పంచుకున్న వారితో చర్చించగా, 125 కిలోల బంగారం అవసరమవుతుందని లెక్క తేలిందని చెప్పారు. ఇందుకు దాదాపు రూ.65 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. నిధుల సేకరణకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3600 వార్డులు, 142 మునిసిపాలిటీలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీలుగా మారిన 4 వేల తండాల నుంచి రూ.11 చొప్పున ఇచ్చినా సంతోషమేనన్నారు. స్వర్ణ తాపడం చేసేందుకు అవసరమైన బంగారం కొనుగోలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ పర్యవేక్షణలో రిజర్వ్‌ బ్యాంక్‌ ద్వారా బంగారం కొనుగోలు చేస్తామని వెల్లడించారు.


తొలి విరాళం నాదే

తమ కుటుంబం నుంచే తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారాన్ని ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి(2 కిలోలు), నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి(2), కావేరి సీడ్స్‌ అధినేత భాస్కర్‌(1 కిలో), జీయర్‌ స్వామి(1),  దామోదర్‌రావు(1) చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. చాలామంది భక్తితత్పరులు బంగారం విరాళంగా ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన వెలువడగానే హెటెరో గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ పార్థసారథి రెడ్డి 5 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ప్రజలందరి తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారం ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, ఎ.కృష్ణారావు, కె.పి.వివేకానంద తలో కిలో విరాళం ప్రకటించారు. జనార్థన్‌రెడ్డి కాటేజీ నిర్మాణానికి మరో రెండు కోట్ల విరాళం ప్రకటించారు.


సమైక్య పాలనలో నిర్లక్ష్యం

యాదాద్రి చుట్టుపక్కన 15 కిలోమీటర్ల మేర ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. సమైక్య పాలనలో ఆధ్యాత్మికపరమైన విషయాల్లోనూ తెలంగాణ నిరాదరణకు గురైందన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు సైతం ఈ ప్రాంతంలో నిర్వహించలేదని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ భక్తులను ఆకట్టుకునేలా రూ.2 కోట్లతో విలాసవంతమైన ఒక్కో కాటేజ్‌ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే చాలామంది దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కోసం బస్సుల కొనుగోళ్లు త్వరలోనే చేపడతామని ప్రకటించారు. చినజీయర్‌ స్వామి ముచ్చింతలలో 1,000 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రస్తావించారు. అక్కడ 108 దేశాలకు చెందిన ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.


ప్రముఖులు విడిది చేసేందుకు 13 ఎకరాల్లో రూ.105 కోట్లతో ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు నిర్మించామని, త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. యాదాద్రిపై యాదర్షి పేరుతో మెడిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. 1000 ఎకరాల్లో చేపడుతున్న టెంపుల్‌ సిటీలో డోనర్‌ పాలసీ ద్వారా 250 కాటేజీలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో కాటేజీలో నాలుగు సూట్లు ఉంటాయని, రూ.50 లక్షలతో నిర్మించే వారికి కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. బస్వాపూర్‌ ప్రాజెక్టు సమీపంలో 450 ఎకరాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయిలో కన్వెన్షన్‌ సెంటర్లు, పార్కులు, నిర్మిస్తామని, పెళ్లిళ్లు కూడా చేసుకునేలా హాళ్లను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.  దళితబంధు పథకం నిర్విరామంగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. హుజూరాదాద్‌ ఎన్నికలు పూర్తవగానే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని తెలిపారు.


ఆహ్వాన పత్రిక స్వామి పాదాల చెంత

సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు యాదాద్రికి వచ్చారు. ఏరియల్‌వ్యూ ద్వారా అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ వీక్షించారు. మంత్రులతోపాటు కాన్వాయ్‌లో ఘాట్‌రోడ్డు ద్వారా నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. ఆలయ ఉద్ఘాటన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను తిలకించారు. ప్రధాన దేవాలయంలో బంగారువర్ణంతో శంకు, చక్రనామాలతో తయారు చేయించిన ఇండోర్‌ క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. ఆలస్యం చేయకుండా అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. రింగ్‌రోడ్డు నిర్మాణంలో షాపింగ్‌స్థలాలు కోల్పోయిన వారికి కళ్యాణ కట్ట సమీపంలో ప్రతీఒక్కరికి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. ఆలయ ఉద్యోగులందరికీ పీఆర్‌సీ వస్తుందా అని సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు.



Updated Date - 2021-10-20T07:54:11+05:30 IST