Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 03:35AM

యాదాద్రీశుడి సేవలు ఇక ప్రియం!

  • 20 శాతం పెరగనున్న ధరలు
  • డిసెంబరు తొలి వారం నుంచి అమల్లోకి!

యాదాద్రి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవా టిక్కెట్ల రుసుములు పెరగనున్నాయి. పెరుగుతున్న ధరలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆదాయం సరిపోవడం లేదు. దీంతో స్వామివారి ఖజానాకు లోటు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. డిసెంబరు మొదటి వారం నుంచి పెంచిన ధరలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నిత్య కైంకర్యాల టిక్కెట్ల రుసుములతో కూడిన నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపగా.. ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఒక్కో సేవా టిక్కెట్టు ధర సుమారు 20శాతానికి పైగా పెరగనున్నట్టు తెలిసింది. పెరిగిన పీఆర్‌సీతో ప్రతి నెలా దేవస్థానంపై సుమారు రూ.2 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. హుండీల ద్వారా వచ్చే కానుకలు, రోజువారీ ఆదాయం కరోనా ప్రభావంతో భారీగా తగ్గాయి. 2019-20లో స్వామివారి వార్షికాదాయం రూ.132 కోట్లుండగా, నిర్వహణ వ్యయం రూ.134కోట్లుగా ఉంది. 2020-21లో ఆదాయం రూ.74,94,94,933 సమకూరగా, నిర్వహణ వ్యయం రూ.78,92,80,541 అయినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ వ్యయం రూ.3,97,85,608 పెరిగింది. ఈనేపథ్యంలోనే సేవా టికెట్ల ధరలు పెంచనున్నారు. 


నివేదన ప్రసాదాల రుసుము సైతం

యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి నివేదించే అన్ని రకాల ప్రసాదాల భోగాల కైంకర్యాలను టిక్కెట్లు కొనుగోలు చేసి సమర్పించడం ఆనవాయితీ. ఆర్జిత సేవల రుసుములతో పాటు స్వామివారి నివేదన ప్రసాద రుసుము ధర కూడా పెరగనుంది. ప్రస్తుతం స్వామివారికి నివేదించే పులిహోర భోగం రూ.175, లడ్డూ భోగం రూ.475 వరకు ఉంది. కాగా, భక్తులు కొనుగోలు చేసే లడ్డూ, పులిహోర, ప్రసాదాల ధర మాత్రం పెరగదు. ఆర్జిత సేవలైన సువర్ణ పుష్పార్చన టికెట్‌ ధర రూ.516, నిత్య కల్యాణం రూ.1250, సుదర్శన హోమం రూ.1016, సత్యనారాయణస్వామి వ్రత పూజ రూ.500, అష్టోత్తరాలు రూ.100, అభిషేకం రూ.250(ఒక్కరికి)గా ఉన్నాయి. ఇవన్నీ సుమారు 20% పెరగనున్నాయి.


భక్తజన సంద్రం.. 

యాదాద్రి క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. కార్తీక మాసం.. వారాంతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ధర్మ దర్శనాలకు నాలుగు గంటలు.. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది.

Advertisement
Advertisement