వటపత్రశాయిగా యాదాద్రీశుడు

ABN , First Publish Date - 2022-01-18T06:03:34+05:30 IST

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి దివ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి.

వటపత్రశాయిగా యాదాద్రీశుడు
విమానగోపురం బంగారు తాపడానికి రూ.50లక్షల విరాళం డీడీని ఈవో గీతారెడ్డికి అందజేస్తున్న భక్తుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు

యాదాద్రి టౌన్‌, జనవరి 17 : యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి దివ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన సోమవారం బాలాలయ కల్యాణ మండపంలో స్వామి వారిని వటపత్రశాయిగా అలంకరించారు. స్వామిని అర్చక బృందం దివ్యమనోహరంగా తీర్చిదిద్ది అలంకారసేవను నిర్వహించారు. అలంకార సేవ విశిష్టతను ఆచార్యులు భక్తులకు వివరించారు. ఈ విశేష పూజా పర్వాలను ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరిగంటి మోహనాచార్యులు, అర్చక బృందం నిర్వహించగా ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

నేత్రపర్వంగా నమ్మాళ్వార్‌ పరమపదోత్సవ పర్వాలు

యాదాద్రీశుడి ఆలయ సన్నిధిలో సోమవారం రాత్రి పరమపదోత్సవ పర్వాలు నేత్రపర్వంగా సాగాయి. స్వామిని పరమపథనాథుడిగా(వైకుంఠనాధుడుగా) అలంకరించి సేవోత్సవాన్ని నిర్వహించారు. పరమ భక్తాగ్రేసుడు, ఆళ్వారాచార్యులు నమ్మాళ్వార్‌ పరమపదోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీమన్నారాయణుడి పాదాలను ఆశ్రయించి ఆవిర్భవించినందున నమ్మాళ్వార్‌ పరమపదోత్సవ వేడుకలను అర్చక బృందం, రుత్వికులు వేదమంత్ర పఠనాల నడుమ నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుడి సన్నిధిని చేరే ఘట్టాలు నేత్రపర్వంగా సాగాయి.

హరిహరులకు విశేష పూజలు

యాదాద్రిక్షేత్రంలో హరిహరులకు నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఆండాల్‌ అమ్మవారిని కొలుస్తూ తిరుప్పావై పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. బాలాలయంలోని కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి అర్చించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లో కొలువుదీరిన చరమూర్తులకు నిత్య పూజాకైంకర్యాలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.10,58,117 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు.

స్వర్ణ తాపడం కోసం రూ.50లక్షల విరాళం  

యాదాద్రి ప్రధానాలయ విమానగోపురం స్వర్ణతాపడం పనుల కోసం హైదరాబాద్‌, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌కు చెందిన దాత బండారి బ్రదర్స్‌ సంస్థ ప్రతినిధి బండారి శ్రీనివాస్‌ రూ.50లక్షల విరాళం డీడీని దేవస్థాన ఈవో గీతారెడ్డికి అందజేశారు. బాలాలయంలో కవచమూర్తులను కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆయన కల్యాణమండపంలో ఈవోకు విరాళాన్ని అందజేశారు.  



Updated Date - 2022-01-18T06:03:34+05:30 IST