యడ్డీ రాజీనామా

ABN , First Publish Date - 2021-07-27T06:52:10+05:30 IST

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. ముఖ్య

యడ్డీ రాజీనామా

  • ‘75 ఏళ్ల కట్టుబాటు’ను గౌరవిస్తున్నా
  • రాజీనామా కోసం ఎలాంటి ఒత్తిళ్లు లేవు
  • రాజకీయాల్లోనే ఉంటా.. రిటైర్‌ కాను
  • ఒకదాని తర్వాత ఒకటి.. ‘అగ్ని పరీక్ష’
  • సాధన భేటీలో సీఎం యడియూరప్ప 
  • చివరి క్షణంలో భావోద్వేగం.. కంటతడి
  • గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పణ
  • ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి జోషి, సదానంద గౌడ కూడా


బెంగళూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. ముఖ్య మంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. సరిగ్గా రెండేళ్ల కిందట సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అదే రోజు(జూలై 26)న బీజేపీ అధిష్ఠానం ఆదేశంతో పదవిని వదులు కున్నారు. రెండేళ్ల పాలనపై సోమవారం నిర్వహించిన ‘సాధన’ సమావేశంలో యడియూరప్ప భావోద్వే గానికి గురై కంటతడి పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో 20 నిమిషాలు ప్రసంగించిన చివరి సమావేశంలో ఐదారు నిమిషాల పాటు కంటితడి పెట్టారు.


75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులు ఇవ్వరాదన్న పార్టీ కట్టుబాటును తాను సంపూర్ణంగా గౌరవిస్తున్నానని, ఈ కారణంగానే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే సీఎం రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, రాష్ట్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తా నని చెప్పారు. తాను ఎలాంటి పదవినీ కోరుకోవడం లేదని, గవర్నర్‌ పదవిని అసలే కోరుకోవడం లేదన్నా రు.


రాష్ట్రంలో బలమైన లింగాయత్‌ వర్గానికి చెందిన యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడంపై మఠాధిపతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. యడియూరప్ప రాజీనామాకు ‘వయసు కట్టుబాటు’ మాత్రమే కారణం కాదని, పార్టీలో విభేదాలు, పాలనా వైఫల్యం కూడా కారణమని పరిశీలకులంటున్నారు. కర్ణాటక తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పోస్టు తమకే ఇవ్వాలని బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్‌, దళిత సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 



యడ్డి.. మోదీ బాధితుడు: కాంగ్రెస్‌ 

ప్రధాని మోదీ బాధితుల్లో యడ్డి ఒకరని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సుర్జేవాలా విమర్శిం చారు. ఢిల్లీలోని ఏకఛత్రాధిపతుల నిర్ణయం మేరకు యడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఫిరాయింపులు, అవినీతి నుంచి పుట్టిందని.. ఆ ప్రభుత్వమే చట్ట విరుద్ధమని దుయ్యబట్టారు.


Updated Date - 2021-07-27T06:52:10+05:30 IST