వైసీపీ నేతలు భయపడుతున్నారు: యనమల

ABN , First Publish Date - 2020-08-04T22:50:14+05:30 IST

తమ అధినేత చంద్రబాబు నాయుడి ఛాలెంజ్ ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదు? అని టీడీపీ నేత యనమల రామక‌ృష్ణుడు అన్నారు

వైసీపీ నేతలు భయపడుతున్నారు: యనమల

అమరావతి: తమ అధినేత చంద్రబాబు నాయుడి ఛాలెంజ్ ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు, జగన్ ఎందుకు ముందుకు రావడం లేదు? అని టీడీపీ నేత యనమల రామక‌ృష్ణుడు అన్నారు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్లు భయపడుతున్నారని అన్నారు. జగన్ అభివృద్ధి విధానాన్ని కాకుండా విధ్వంసక విధానాన్ని అమలు పరుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మొత్తం రాష్ట్ర సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతిని అభివృద్ధి  చేస్తాం అనే వైసీపీ వాదన అర్థం లేనిదన్నారు. రాజధాని అంశం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన అంశం కాదన్నారు. ఇది మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించిందని అన్నారు. మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే మొత్తం రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతోందన్నారు. జగన్ ఒక ఏడాది పాలనలో రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చాడని సీఎం జగన్ తీరును తూర్పారబట్టారు. దీనికి తోడు కరోనా మహమ్మారి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యిందన్నారు. గడచిన రోజుల కంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని యనమల పేర్కొన్నారు. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్న అంచనా అని అన్నారు. 


మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలుకు తీసుకొస్తానని చెబుతూ రాయలసీమ వాసులను జగన్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఒకసారి రాజధానిని మార్చిన తర్వాత అమరావతిని అభివృద్ది చేస్తానని చెబుతున్న జగన్ మాట ఏవిధంగా సాధ్యపడుతుంది? అని యనమల ప్రశ్నించారు. మునుపే అభివృద్ది చెందిన విశాఖను కూడా అభివృద్ది చేస్తామని చెబుతున్నారని, పెట్టుబడులు విశాఖ నుండి తరలిపోయిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మూడు ముక్కల రాజధాని విధానం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడమేనని వ్యాఖ్యానించారు. రాజధాని అంశం మొత్తం రాష్ట్రానికి సంబంధించినదని అన్నారు. జగన్ విధ్వంసక విధానం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యనమల పిలుపునిచ్చారు. తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దౌలతాబాడ్ నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి పెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొని చివరకు సామ్రాజ్యమే పతనమైపోయిందని చరిత్రను గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే రాష్ట్రానికి తుగ్లక్ సామ్రాజ్యానికి పట్టిన గతే పడుతుందని, రాష్ట్రం అంధకారమవుతుందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-08-04T22:50:14+05:30 IST