పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ : యరపతినేని

ABN , First Publish Date - 2020-12-04T06:08:56+05:30 IST

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వ్యవహారశైలి చూస్తుంటే పనితక్కువ, ఆర్భాటం ఎక్కువలాగా కనిపిస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఆరోపించారు.

పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ : యరపతినేని

పిడుగురాళ్ల, డిసెంబరు 3: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వ్యవహారశైలి చూస్తుంటే పనితక్కువ, ఆర్భాటం ఎక్కువలాగా కనిపిస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఆరోపించారు. పిడుగురాళ్ల బైపాస్‌ రోడ్డు నిర్మాణం టీడీపీ హయాంలో 90 శాతం పనులు, 40 ఎకరాల భూసేకరణ కూడా పూర్తిచేసి రైతుల ఖాతాల్లో రూ.30 కోట్లు కూడా జమ చేయటం జరిగిందన్నారు. రైల్వేట్రాక్‌పై బ్రిడ్జి అనుమతులు తెచ్చామన్నారు. కొండమోడు ప్రాంతంలో మూడెకరాలను సేకరించాల్సి ఉందన్నారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో బైపాస్‌ పనులు పూర్తి చేస్తామని  చెప్పి ఇప్పటి వరకు కనీసం రూ.100 పని కూడా చేయకపోవటమేమిటని ప్రశ్నించారు. పిడుగురాళ్ల పట్టణంలో రోడ్డు మరమ్మత్తులను కాంట్రాక్టర్‌ చేయడం లేదని చెప్పటం చూస్తే మీ అసమర్థతకు అద్దం పడుతుందన్నారు. బ్రాహ్మణపల్లి దగ్గర కాంగ్రెస్‌ హయాంలో బైపాస్‌రోడ్డు నిర్మాణంలో కొందరి భూములు కాపాడేందుకు వెయ్యి మందికి పైగా విద్యార్థులున్న హైస్కూల్‌ మనుగడే ప్రశ్నార్థకం చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రమాదాలు లేకుండా ఉండేందుకు హైస్కూల్‌ ముందుభాగంలో అండర్‌పాస్‌ను నిర్మించిందన్నారు. బైపాస్‌రోడ్డు నిర్మాణ బాధ్యత అప్పజెప్పిన రాంకీ సంస్థ వైసీపీకి చెందిన ఎంపీదే అయినా ఆయనకు చెప్పి పనులు చేయించుకోలేక రహదారులు దిగ్బంధనం చేస్తాం, టోల్‌గేట్లు మూసివేస్తామని చెప్పటం చూస్తే ఏమనాలో అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికైనా బైపాస్‌ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు.  టీడీపీ హయాంలోనే పిడుగురాళ్ల పట్టణానికి రూ.100 కోట్లతో మంచినీటి స్కీమ్‌ మంజూరు చేయించి టెండర్లు  పిలిచినా ఇంతవరకు ఆ పనులు ఎందుకు మొదలు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే ఆరునెలల్లో పిడుగురాళ్లకి నీళ్లిస్తామని చెప్పి ఇంత వరకు అందివ్వలేదన్నారు. ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో ఎక్కడా కూడా  అభివృద్ధి పనులు చేసిన పాపాన పోలేదని తెలిపారు. తుపానుతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారి కూడా గ్రామాలను సందర్శించలేదన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.50 వేలు అందించాలని, లేకుంటే పల్నాడు ముట్టడి కార్యక్రమం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందన్నారు. రబీ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులకు ప్రభుత్వమే ఉచితంగా అందించి ఆదుకోవాలని యరపతినేని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-12-04T06:08:56+05:30 IST