Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగి సాగెట్లా!

  • ప్రధాన పంటల సాగుకు దాటిన అదను
  • వరి విత్తనాల అమ్మకాలకు అధికారుల బ్రేక్‌!
  • ఇతర పంటల విత్తనాలకు రెక్కలు..
  • 1.21లక్షల ఎకరాల్లో యాసంగి సాగు
  • గతంలో 71వేల ఎకరాల్లో వరి సాగు

కష్టపడి పండిస్తే కళ్ల ముందే వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. కొనే వారు లేక కల్లాల్లో వడ్ల కుప్పలు అలాగే ఉంటున్నాయి. పంట అమ్ముడుపోక రైతుల చేతిలో చిల్లిగవ్వాలేదు. ఈ నేపథ్యంలో యాసంగిలో వరి వేయొద్దంటూ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. వడ్ల విత్తనాలు కూడా అందుబాటులో లేవు. వేరే పంటలు వేద్దామన్నా వాటి విత్తన రేట్లను అమాంతం పెంచేశారు. ఈ అయోమయ పరిస్థితుల్లో యాసంగి సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

పరిగి: వానకాలంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో నష్టాలను చవిచూసిన రైతులు యాసంగి సాగుపై ఆశలు పెట్టకున్నారు. ఏడాదిలో ఒక్క సీజన్‌ అనుకూలించినా కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ధీమా రైతుల్లో ఉంటుంది. ఈ సారి దీనికి భిన్నంగా పరిస్థితులున్నాయి. సంప్రదాయికంగా పండించే వరి వేయొద్దని, ఇతర మొట్ట పంటలు, కూరగాయలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. దీంతో యాసంగిలో వరిసాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆలోచనలో పడ్డారు. జిల్లాలో ఎక్కువ శాతం భూములు వరిసాగుకే అనుకూలం. మరో పంటను సాగుచేయని స్థితిలో జిల్లా రైతులున్నారు. వరికి అలవాటైందీ వరిసాగే! వానకాలం ధాన్యాన్ని కొనలేని పరిస్థితి సర్కారు ఉండడంతో ఏం సాగు చేయాలనే దానిపై రైతులు తర్జనభర్జన పడుతున్నారు. యాసంగి అదునూ దాటుతోంది. చెరువు కుంటలు, బోర్లలో పుష్కలంగా నీరుంది. ఈ కారణంగా వరి వేద్దామని రైతులు భావిస్తుండగా ప్రభుత్వ అంక్షలతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లాలో నీటి వనరుల్లో చెరువు కుంటలతో పాటు 65వేల బోర్లు ఉంటాయి. 20మండలాల్లో  యాసంగిలో 1.21లక్షల ఎకరాల్లో సాగుచేయాలని నిర్ణయించారు. ఈ విస్తీర్ణంలో 71వేల ఎకరాలు కేవలం వరి సాగు చేస్తారు. 41 వేల ఎకరాల్లో ఉద్యాన, 10వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తారు. సంప్రదాయ పంట వరి వద్దని సర్కారు చెబుతోంది. వేరు శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, శనగ, కంది, పెసర, మినుము వంటి మొట్ట పంటలతో పాటు కూరగాయలు సాగు చేయాలని ప్రభుత్వం గ్రామాల్లో అధికారులతో అవగాహన కల్పిస్తోంది.

వేధిస్తున్న విత్తన సమస్య

యాసంగిలో విత్తనాల కొరత సమస్యగా మారింది. వరి వద్దన్నా కొందరు రైతులు ధైర్యం చేసి వరికే సన్నద్ధమయ్యారు. మార్కెట్‌లో మాత్రం విత్తనాలు లభించే పరిస్థితి లేదు. వరి విత్తనాలు అమ్మవద్దని సర్కారు ఆదేశించడంతో ఫర్టిలైజర్‌ వ్యాపారులు వరి విత్తనాలు అమ్మడం లేదు. జాలు, నిమ్ము భూమి ప్రాంతాల్లో వరి తప్ప వేరే పంట వేసే అవకాశం లేదు. దీంతో రైతులు అయోమయంలో ఉన్నారు. యాసంగికి మెట్ట పంటల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు. వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న పంటల విత్తనాలు కూడా విత్తన వ్యాపారులు లేవంటున్నారు.

రెట్టింపువుతున్న ధరలు

విత్తనాలకు మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి వ్యాపారులు ధరలను రెట్టింపు చేస్తున్నారు. నాలుగు కిలోల పొద్దుతిరుగుడు విత్తనాలు గతంలో రూ.1000 ఉంటే, ఇప్పుడు రూ.1,600కు పెంచారు. అయినా అవసరానికి సరిపడా లేవు. గోధుమ, మొక్కజొన్న, జొన్న విత్తనాలనూ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. గోధుమలు 20కిలోలకు రూ.800 ఉండగా, రూ.వెయ్యికి పెంచారు. మొక్కజొన్నలు నాలుగు కిలోల బస్తా రూ.800 నుంచి రూ.1,200 ఉండగా.. ప్రస్తుతం రూ.1,500 పెంచారు. జొన్నలు 4కిలోల బస్తా రూ.400 ఉండగా రూ.600లకు అమ్ముతున్నారు.

వేరేచోట్ల నుంచైనా విత్తనాలు తెచ్చుకోవాలి: సాయిలు, రైతు, గోడుగోనిపల్లి, పరిగి

మా పొలంలో వరి తప్ప మరో పంట పండదు. ప్రభుత్వం వద్దన్నా వరే సాగుచేస్తా. మార్కెట్‌లో వరి విత్తనాలు లేవు. ఏం చేయాలో తోచడం లేదు. మా పొలంలో పొద్దుతిరుగుడు, పల్లి పండవు. వేరేచోట్ల నుంచైనా వరి విత్తనాలు తెచ్చుకోవాలి.

ఆరుతడి పంటలే రైతులకు మేలు: గోపాల్‌, జిల్లా వ్యవసాయ అధికారి

యాసంగిలో వరిసాగు వద్దు. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు పాటించాలి. ఈసారి బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. వరికి బదులు జొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయల పంటలు వేసుకోవాలి.  డిమాండ్‌ లేని వడ్లకన్నా ఇలాంటి పంటలు వేస్తే రైతులకే లాభం. డీలర్లు వరి విత్తనాలు అమ్మరు. ప్రత్యామ్నాయ పంటలపై గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం.

Advertisement
Advertisement