నవ్వే నా నగవు!

ABN , First Publish Date - 2021-06-07T05:30:00+05:30 IST

ఆ నవ్వే చాలు... సరాగాలు మీటినట్టు... పూబంతులు విరిసినట్టు... మధురంగా మాట కలుపుతుంది. నిండైన రూపం... నటనలో వైవిధ్యం... ‘వెనిలా’గా వెలిగి... ‘భైరవి’గా బరువైన పాత్రలో...

నవ్వే నా నగవు!

ఆ నవ్వే చాలు... సరాగాలు మీటినట్టు... పూబంతులు విరిసినట్టు... మధురంగా మాట కలుపుతుంది. నిండైన రూపం... నటనలో వైవిధ్యం... ‘వెనిలా’గా వెలిగి... ‘భైరవి’గా బరువైన పాత్రలో ఒదిగిన బుల్లితెర నటి యష్మీ గౌడ. కన్నడనాట పుట్టినా... నటిగా తెలుగింటికి దగ్గరైన యష్మీ ‘నవ్య’తో పంచుకున్న అనుభూతులివి.


కల కాదు... అంత కంటే ఎక్కువ... చిన్నప్పటి నుంచి నటిని కావాలనే బలమైన కాంక్ష నాలో! బెంగళూరు ‘దయానంద్‌సాగర్‌ ఇనిస్టిట్యూట్‌’లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. కాలేజీలో నేను లేని సాంస్కృతిక కార్యక్రమం ఉండేది కాదు. డ్రామాలు, చిన్న చిన్న స్కిట్స్‌, డ్యాన్స్‌లు, ర్యాంప్‌ వాక్‌లు... అన్నిట్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఒకసారి ఓ మోడలింగ్‌ షో కోసం కాలేజీలో ఆడిషన్స్‌ నిర్వహించారు. అందులో నన్ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి బయట ఏవైనా షోస్‌ జరిగితే ర్యాంప్‌వాక్‌ చేసేదాన్ని. అందాల పోటీలకు వెళ్లేదాన్ని. ‘మిస్‌ ఫొటోజెనిక్‌, మిస్‌ మైసూర్‌’ తదితర టైటిల్స్‌ చాలానే గెలిచాను. మోడలింగ్‌ ఎందుకంటే... చెప్పాను కదా... రంగుల ప్రపంచమంటే నాకు తగని మోజని! 


మొదటి ప్రయత్నంలోనే... 

స్నేహితులు, సాంస్కృతిక కదంబాలు... 2018లో ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన కాలేజీ లైఫ్‌ అయిపోయింది. చేతిలోకి సివిల్‌ ఇంజనీరింగ్‌ పట్టా వచ్చింది. అది పట్టుకుని ఉద్యోగాల వెంట పడదలుచుకోలేదు. మొదటి నుంచి నా ఆలోచనలు, అభిరుచులు వేరు కదా! ఇంతలో కన్నడ సీరియల్‌ కోసం ఎక్కడో ఆడిషన్స్‌ జరుగుతున్నాయని మా స్నేహితులొకరు చెప్పారు. ప్రయత్నించి చూద్దాం అని వెళ్లాను. నాపై నాకు ఎలాంటి అంచనాలూ లేవు. అక్కడ ఏవో సీన్లు చెప్పి నటించి చూపించమన్నారు. నాకు వచ్చినట్టు చేశాను. వాళ్లు ఓకే అన్నారు. తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇది కలా... నిజమా! తొలి అడుగులోనే విజయం వరిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఈ అవకాశంతో మోడలింగ్‌కు స్వస్తి చెప్పేశాను. 


అనుకోని పిలుపు... 

మూడేళ్ల కిందట కన్నడ సీరియల్‌తో మొదలైన నా ప్రయాణం ఆ తరువాత మరో మలుపు తిరిగింది. అందులో చేస్తుండగానే తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. నేనసలు ఊహించని పిలుపు అది. పెద్ద సంస్థ, ప్రాధాన్యమున్న పాత్ర. అలా ‘స్వాతిచినుకులు’ సీరియల్‌లో ‘వెనిలా’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. వందకు పైగా ఎపిసోడ్స్‌లో నటించాను. అదే సమయంలో ‘నాగభైరవి’ కోనం ‘జీ తెలుగు’ వారు అడిగారు. ఓకే అనడంతో గత ఏడాది ఆ సీరియల్‌ ప్రారంభమైంది. ఇటీవలే రెండు వందల ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయి. 


షూటింగ్‌... థ్రిల్లింగ్‌... 

‘నాగభైరవి’ నాకు మూడో సీరియల్‌. అన్నిటిలోకి నాకు బాగా పేరు తెచ్చిన సీరియల్‌. అందులో నాది ‘భైరవి’ పాత్ర. దేవుడంటే నమ్మకం లేని ఒక యువతి తను. అమెరికాలో పెరిగిన అమ్మాయి. కానీ ఆ తరువాత ఎదురైన కొన్ని పరిస్థితులు, ఘటనల వల్ల ఆమె దేవుడిని నమ్మడం మొదలుపెడుతుంది. రెగ్యులర్‌ ఫ్యామిలీ డ్రామాలకు భిన్నమైన ఫాంటసీ కథ ఇది. అందుకే ఒప్పుకున్నాను. వెనకాల నుంచి పాము రావడం, మన చుట్టూ తిరగడం.. షూటింగ్‌ చేసేటప్పుడు ఇవేవీ ఉండవు. మేము కూడా టీవీలో వచ్చినప్పుడే చూస్తాం. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్త అనుభవం. ఇంకో విశేషమేమంటే ఈ సీరియల్‌ ప్రోమోలో రమ్యకృష్ణ గారితో చేయడం. అయితే కరోనా జాగ్రత్తలు పాటించాల్సి రావడంతో ఆమెతో మాట్లాడే అవకాశం దొరకలేదు. నిజంగా ఆమె అద్భుతమైన నటి. 


అవమానించినా నిలబడ్డాను... 

ఇవాళ నన్ను తెలుగు ప్రేక్షకులు ఇంతగా అభిమానిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అభినయమా..? అందమా..? రెండింటిలో ఏమిటి మీ ప్రత్యేకత అంటే  రెండూ! అంతకు మించి నా నవ్వు! కాలేజీలో జరిగిన ఓ ఆడిషన్స్‌లో నా నవ్వు బాలేదని ఓ డైరెక్టర్‌ అన్నారు. అందరిలో అలా అనేసరికి నేను ఎంతో బాధపడ్డాను. అవమానంగా భావించాను. కానీ తరువాత దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. అందమైన నవ్వు కోసం యూట్యూబ్‌లో వీడియోలు చూశాను. నెట్టింట పరిశోధించి, సాధన చేశాను. ఇప్పుడు ‘మీ నవ్వు ఎంతో బాగుంద’ని అందరూ అంటుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పట్లో నేను కొత్తవారి ముందు మనస్ఫూర్తిగా నవ్వగలిగేదాన్ని కాదు. నేడు ఆ భయం, బెరుకు పోయాయి. అప్పటికీ... ఇప్పటికీ తేడా ఏంటంటే నాలో ఆత్మవిశ్వాసం. నిండైన ఆత్మవిశ్వాసంతో నవ్వే నవ్వు అందంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆ తరువాత నాకు నాలో నచ్చేవి కళ్లు, పొడవైన కురులు. 


తెలుగు అక్కడే నేర్చుకున్నా... 

నేను పుట్టింది పెరిగింది బెంగళూరులోనే. నాన్న రమేశ్‌కు సొంత ఫ్యాక్టరీ ఉంది. అమ్మ విజయలక్ష్మి గృహిణి. ఎవరికీ తెలుగు మూలాలు లేవు. ‘అయినా తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావేంట’ని చాలామంది అడుగుతుంటారు. వాస్తవంగా హైదరాబాద్‌ వచ్చేవరకు నాకు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. సీరియల్స్‌ చేస్తూ చేస్తూ వచ్చేసింది. ఒకరకంగా హైదరాబాద్‌ నా సొంత ఊరిలా మారిపోయింది. బెంగళూరు కంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నా. చార్మినార్‌లో షాపింగ్‌, హైదరాబాద్‌ బిర్యానీ చాలా ఇష్టం. దాదాపు ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేశాను.




పెయింటింగ్‌... డెకరేటింగ్‌...

ఇక కెరీర్‌ విషయానికొస్తే ఒక మలయాళ సినిమా ఒప్పుకున్నాను. కథ నచ్చి చేసిన కన్నడ షార్ట్‌ ఫిలిమ్‌ ఒకటి ప్రేక్షకుల ముందుకు రాలేదు. కరోనావల్ల ఈ ప్రాజెక్ట్‌లు ఆలస్యమవుతున్నాయి. లాక్‌డౌన్‌ను నా అభిరుచులతో ఆస్వాదిస్తున్నా. ఆహారమైనా, ప్రాంతమైనా, ఇంకొకటైనా... ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలనుకొంటాను. పెయింటింగ్స్‌ వేస్తాను. విభిన్న వంటలు వండుతాను. ఇంటీరియర్‌ స్టయిలింగ్‌ చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో ఇల్లంతా నా డెకరేషన్లతో నిండిపోతుంది.

- హనుమా


Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST