Abn logo
Sep 27 2021 @ 01:58AM

కంగారూల జైత్రయాత్రకు బ్రేక్‌

26 వరుస విజయాల తర్వాత ఓటమి

మూడో వన్డేలో టీమిండియా జయకేతనం


వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళ జట్టు వరుస విజయాలు. క్రికెట్‌ చరిత్రలోనే సుదీర్ఘ కాలం సాగిన జైత్రయాత్ర. 2017, అక్టోబరులో ఇంగ్లండ్‌ చేతిలో ఆసీస్‌ చివరిసారిగా ఓటమి చవిచూసింది. 


265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మహిళా క్రికెట్‌లోనే కొత్త చరిత్ర. 2019లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 248 పరుగుల ఛేదనే ఇంతకుముందు వరకు అత్యధికం.


మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలు ఆడిన రెండో ప్లేయర్‌గా జులన్‌ గోస్వామి. 192 మ్యాచ్‌లు ఆడిన జులన్‌.. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ చార్లెటి ఎడ్వర్డ్స్‌ (191)ను వెనక్కినెట్టింది. మొత్తంగా మిథాలీ 220 వన్డేలతో టాప్‌లో ఉంది. 


మెకాయ్‌: భారత మహిళలు స్ఫూర్తిదాయకమైన ఆటతో అదరగొట్టారు. కొన్నేళ్లుగా పరాజయం ఎరుగని ఆస్ట్రేలియాకు ఓటమి రుచిచూపారు. యాస్తిక భాటియా (64), షఫాలీ వర్మ (56) అర్ధ శతకాలతో రాణించడంతో.. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన మూడో, ఆఖరి వన్డేలో మిథాలీ సేన 2 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. కంగారూల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్‌ వేసింది. 2018, మార్చిలో వడోదరలో జరిగిన వన్డేలో భారత్‌పై విజయంతో మొదలైన ఆసీస్‌ జైత్రయాత్రను.. టీమిండియానే ముగించింది.


మూడు వన్డేల సిరీ్‌సలో భారత్‌ 1-2తో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 264/9 స్కోరు చేసింది. రెండో వన్డేలో నో బాల్‌తో ఒకరకంగా భారత్‌ ఓటమికి కారణమైందనే విమర్శలు ఎదుర్కొన్న పేసర్‌ జులన్‌ గోస్వామి (3/37) మెరిసింది. పూజా వస్త్రాకర్‌ (3/46) సత్తాచాటింది. ఛేదనలో బ్యాట ర్లు కుదురుకోవడంతో టీమిండియా 49.3 ఓవర్లలో 266/8 పరుగులు చేసి విజయాన్ని అందుకొంది. ఆసీస్‌ 34 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం విశేషం. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మహిళా క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి. అనబెల్‌ (3/30) మూడు వికెట్ల దక్కించుకొంది. జులన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది.


సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 264/9 (గార్డెనర్‌ 67, మూనీ 52, జులన్‌ 3/37, పూజ 3/46); భారత్‌ 49.3 ఓవర్లలో 266/8 (యాస్తిక 64, షఫాలీ 56; అనబెల్‌ 3/30)