యస్య జ్ఞానమయం తపః,

ABN , First Publish Date - 2020-12-22T07:57:01+05:30 IST

నేను అనే ప్రథమ తలంపు (అహం వృత్తి) పూర్తిగా నాశనమైన దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతోందో దానికి సంబంధించిన విచారణ.. అంటే ఆత్మ విచారణే గొప్పదైన, శ్రేష్ఠమైన తపస్సు. ఇదే భగవాన్‌ రమణ మహర్షి దివ్య వాక్కు...

యస్య జ్ఞానమయం తపః,

  • అహమపేతకం నిజవిభానకం
  • మహదిదం తపో రమణ వాగియం


నేను అనే ప్రథమ తలంపు (అహం వృత్తి) పూర్తిగా నాశనమైన దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతోందో దానికి సంబంధించిన విచారణ.. అంటే ఆత్మ విచారణే గొప్పదైన, శ్రేష్ఠమైన తపస్సు. ఇదే భగవాన్‌ రమణ మహర్షి దివ్య వాక్కు. మానవాళికి రమణులు అందించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం ‘ఉపదేశ సారం’లోని చివరి శ్లోకమిది. ఆత్మగా సంస్థితమై ఉండడమే ఆత్మ దర్శనమని.. అదే పరమాత్మ సాక్షాత్కారమని, శాశ్వతానందమని, అదే జీవిత పరమార్థమని తెలియజేసిన మహర్షి.. అట్టి స్థితిలో ఉండాలంటే ముందు తాను ఆత్మను అని తెలుసుకోవాలని, అహంకారాన్ని జీవభావాన్ని పోగొట్టుకోవాలని తెలియజేవారు. ఈ అహంకారం లేదా జీవభావాన్నే ‘అహం వృత్తి’ అంటారు.


అదే ప్రథమ తలపు అని.. అది ఉన్నంతకాలం అనేక తలంపులు, ‘ఇదం’ భావనలు వస్తూనే ఉంటాయని రమణులు చెప్పారు. ముందుగా ఆ తలంపులన్నింటినీ పోగొట్టుకోవాలని సూచించారు. ఇదం భావనలు పోగొట్టుకోవడానికి కర్మ, భక్తి, ప్రాణ వీక్షణాది సాధనల గురించి చెప్పారు. అవన్నీ పోయినా అహం వృత్తి పోదని.. అది ఉన్నంతవరకూ ఇదం భావనలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయని, కనుక అహం వృత్తిని పూర్తిగా నాశనం చేయాలని.. అదే మనో నాశమని చెప్పారు. మనోనాశనాన్ని సాధించాలంటే.. అసలు మనసంటే ఏమిటి? అని విచారణ కొనసాగించాలని, మనసంటే అహం వృత్తే గనుక దాని పుట్టుక స్థానాన్ని వెతికితే అది పడిపోతుందని చెప్పారు. అహం వృత్తి పడిపోయిన చోట నిజమైన ‘నేను’.. అంటే ఆత్మ స్వయంవ్యక్తమవుతుందని తెలియజేశారు. అదే ఆత్మ నిష్ఠ, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే బంధముక్తులకు అతీతమైన బ్రహ్మానందానుభూతి అని తెలియజేశారు. అయితే, ఒక సందేహం. వశిష్ఠ, విశ్వామిత్రాది మహారుషులు ఎంతో గొప్ప తపస్సులు చేసి దివ్యశక్తులు సాధించారని విన్నాం. మరి మనం అలా ఘోర తపస్సులు చేయక్కర్లేదా? రమణులు ముక్తిపొందడానికి, బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి విచారణ మార్గాన్ని అనుగ్రహించారేగానీ  తపస్సుల ప్రసక్తే లేదు.


ఎందుకు? అంటే.. ‘నేను’, ‘నేను’ అంటూ నిత్యం అహంగా చలామణి అవుతున్న అహంకారం లేక అహం వృత్తి లేక మనస్సు ఏ విచారణలో, ఏ జ్ఞానసాధనలో భస్మమైపోయి జీవునికి ముక్తిప్రదమైన స్వస్వరూపానుభవం సంపూర్ణంగా, శాశ్వతంగా కలుగుతుందో ఆ విచారణే మహత్తరమైన తపస్సు అని రమణులు స్పష్టం చేస్తున్నారు. ‘యస్య జ్ఞానమయం తపః’ అని ఉపనిషత్‌ వాక్యం. అట్టి జ్ఞాన తపస్సే రమణుల బోధన సారాంశం. తనను తాను తెలుసుకోవడానికి చేసే విచారణ కన్నా గొప్పదైన తపస్సు మరొకటి లేదని, అన్ని తపస్సుల కన్నా జ్ఞాన తపస్సు గొప్పదని రమణులు తెలియజేస్తున్నారు. ఇది రమణుల ఆంతర్యపులోతుల నుంచి కదిలిన వాక్కు. ఆత్మానుభవంలో నిరంతరం నిల్చిన రమణులు తెలిపిన గొప్ప సత్యమే ఈ ఉపనిషత్తుల సారమైన ‘ఉపదేశ సారం’. శాస్త్రాన్ని ఎవరైనా చెప్పవచ్చు. కానీ, ఆత్మానుభవాన్ని మాత్రం అందులో ఉన్నవారే చెప్పగలరు. కాబట్టి రమణుల మార్గంలో పయనించి బ్రహ్మసాక్షాత్కారం పొందేందుకు మనందరికీ ఆ మహర్షి ఆశీస్సులు లభించుగాక.

- దేవిశెట్టి చలపతిరావు, ఛ్చిట్ఛఃటటజీఛిజ్చిజ్చూఞ్చ్టజిజీట్చౌ.ఛిఝ

Updated Date - 2020-12-22T07:57:01+05:30 IST