Abn logo
Sep 25 2021 @ 04:31AM

డోంటాక్‌.. నాన్సెన్స్‌.. వాటీజ్‌ దిస్‌!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవీపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే మల్లాది

 సీఎం జగన్‌ను పొగడాలని హుకుం

పీఆర్సీ, సీపీఎ్‌సలపై గళం విప్పిన ఐవీ

ఉన్న ఐటీఐలను ఆదుకోవాలని హితవు

దీంతో రెచ్చిపోయిన విష్ణు వర్ధన్‌


విజయవాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘డోంటాక్‌! వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌. మేం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడకండి. ప్రభుత్వాన్ని పొగడండి. సీఎం జగన్‌పై విమర్శలు ఎందుకు?’’ ఇవీ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ)ని ఉద్దేశించి విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్థన్‌ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వం కొన్నేళ్లుగా నాన్చుతున్న సీపీఎస్‌, పీఆర్సీలను ఉద్దేశించి ఐవీ చేసిన వ్యాఖ్యలపై విష్ణు నోరు పారేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఉద్యోగుల సంఘం 12వ రాష్ట్ర మహాసభలను విజయవాడ ఎంబీవీకేలో ఈ నెల 22న నిర్వహించారు. దీనికి మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, ఐవీలను ఆహ్వానించారు. అయితే, మంత్రులు హాజరుకాలేదు.


తొలుత సభను ఉద్దేశించి లక్ష్మణరావు మాట్లాడిన తర్వాత ఐవీ మాట్లాడారు. ‘‘ప్రస్తుత పాలకలు ఉద్యోగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఐటీఐల్లో ఉన్న సగానికి పైగా ఉద్యోగులు కాంట్రాక్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా మారిపోయారు. ఐటీఐలకు ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న ఐటీఐలను చక్కదిద్దకుండా నియోజకవర్గానికొక ఐటీఐ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. విజయవాడలో ఐటీఐకి రూ.4 లక్షల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి ముందు రెండు, వెనుక రెండు సౌండ్‌ బాక్సులు పెట్టుకుని అందరికీ వినిపించేలా.. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు డీఏలను, పీఆర్సీని సకాలంలో చెల్లిస్తామని చెప్పారు. సీపీఎ్‌సను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా పట్టించుకోలేదు. 40, 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో మూడేళ్లయినా పీఆర్సీని బయట పెట్టకుండా ఉంచిన ప్రభుత్వాన్ని నేను చూడలేదు’’ అని విమర్శించారు.


రెచ్చిపోయిన మల్లాది!

అనంతరం మాట్లాడిన మల్లాది విష్ణు ఎమ్మెల్సీపై విరుచుకుపడ్డారు. సభావేదిక పైనే ఆయనకు వార్నింగ్‌ ఇచ్చారు. ‘‘పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి మైకులు, స్పీకర్‌ బాక్సులు పెట్టుకుని తిరిగిన విషయం ఈ సమావేశంలో అవసరమా? ఇది సందర్భమా? మమ్మల్ని పిలవకుండా మైకులు పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. మమ్మల్ని పిలిచినప్పుడు మైకు దొరికింది కదా అని ఎలాపడితే అలా మాట్లాడొద్దు. మీ అభిప్రాయాలు మేం ఉన్నప్పుడు చెప్పొద్దు. మీకు కావాల్సిన మీడియాను పిలుచుకుని మాట్లాడుకోండి. శాసించడమేంటి? మేం ఉన్నప్పుడు మాట్లాడకూడదని చెప్తున్నాం. ఇదేమైనా మీ సొంత పార్టీ వ్యవహారమా? డోంటాక్‌. ఎమ్మెల్సీ అని గౌరవమిస్తున్నా గుర్తు పెట్టుకోండి. మీ ఐదుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఏం సాధిస్తారు? ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాకు అనేక అంశాలపై సలహాలు ఇస్తుంటారు. వాటీజ్‌ దిస్‌ నాన్‌సెన్స్‌. మీ వల్ల ఏం జరుగుతుంది? ఒక్కరైనా సమస్యను తీర్చగలరా? మీలాంటి వాళ్లను కూర్చోబెట్టి మాట్లాడిస్తే జరిగే మంచి కూడా జరగదు. మంత్రులకు పనిలేదు, అత్తారింటికి దారేదీ? అని నాన్‌సెన్స్‌ మాటలు మాట్లాడుతున్నారు. ఐటీఐ ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. లేకపోతే మేం లేనప్పుడు గంటలపాటు ప్రభుత్వం గురించి మాట్లాడుకోండి.


ఇది ఐటీఐ ఉద్యోగుల సభ. వాటి గురించి కాకుండా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, పీఆర్సీల గురించి మాట్లాడే సభకాదు. మీ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఐదుగురు కలిసి ఒక గదిలో కూర్చుని మాట్లాడుకోండి. వాటీజ్‌ దిస్‌! జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత మీకుందా? నేను వందసార్లు మాట్లాడతా. నువ్వు ఉద్యోగస్తుడివి కాదయ్యా. ప్రభుత్వాన్ని పొగుడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. పెద్ద ప్రభుత్వాన్ని, పెద్ద నాయకుడిని విమర్శించడం గొప్ప అనుకుంటున్నారా?’’ అని మల్లాది ఆగ్రహం  వెళ్లగక్కారు.