ఎస్‌టీ అధ్యాపకుడి పై వైసీపీ ఎమ్మెల్యే వర్గీయులదాడి

ABN , First Publish Date - 2021-09-16T06:25:41+05:30 IST

అధ్యాపకుడిగా విద్యార్థులకు మంచిగా పాఠాలు చెప్పడంతోపాటు గ్రామప్రజల సమస్యలను లేవనెత్తడంలో కూడా మమేకం కావడంతో వైసీపీ నేతలు అతడిపై కక్షకట్టి హెచ్చరించడంతోపాటు చివరకు దాడి చేసిన సంఘటన ఇది.

ఎస్‌టీ అధ్యాపకుడి పై వైసీపీ ఎమ్మెల్యే వర్గీయులదాడి

  • ఎంపీ పరామర్శ... కక్షకట్టిన వైసీపీ నేతలు
  • పోలీసుల అదుపులో పలువురు నిందితులు

రాజమహేంద్రవరం, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి): అధ్యాపకుడిగా విద్యార్థులకు మంచిగా పాఠాలు చెప్పడంతోపాటు గ్రామప్రజల సమస్యలను లేవనెత్తడంలో కూడా మమేకం కావడంతో వైసీపీ నేతలు అతడిపై కక్షకట్టి హెచ్చరించడంతోపాటు చివరకు దాడి చేసిన సంఘటన ఇది. వైసీపీలో ఒక వర్గం దాడి చేయగా, మరొక వర్గం అతడ్ని పరామర్శించడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గణిత అధ్యాపకుడిగా పులుగు దీపక్‌ ఏడాదిన్నరకాలంగా పనిచేస్తున్నారు. ఆయన వచ్చిన పురుషోత్తపట్నం రైతుల సమస్యలను రైతులతో కలిసి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వంగలపూడి ఇసుక ర్యాంపులోని అక్రమాలను కూడా లేవనెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆయనను వేరే జిల్లాకు బదిలీ చేయించారు. అయినా ఆయన సెలవుపెట్టి ఇక్కడే ఉండడంతోపాటు ఇటీవల రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ను తీసుకుని వెళ్లి ఓ సహాయ కార్యక్రమం నిర్వహించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజావర్గం ఇటీవల ఈ అధ్యాపకుడిని పిలిచి హెచ్చరించినట్టు సమాచారం. అయినా తన వైఖరిని మార్చుకోకపోవడంతోపాటు వైసీపీనేతల వ్యవహారం గురించి మాట్లాడిన ఒక వీడియో వైరల్‌ అయింది. దీంతో మంగళవారం రాత్రి కారులో వస్తున్న దీపక్‌పై కొందరు దాడి చేశారు. ఆయన దిగకపోవడంతో కారును ధ్వంసం చేశారు. ఆయనకు స్వల్పంగా గాయాలైనట్టు తెలిసింది. ఆ సమయంలో స్థానిక ప్రజలు రావడంతో పోలీసులకు సమాచారం తెలిసి దీపక్‌ను కాపాడి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ దాడిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఐదారుగురు పాల్గొన్నట్టు చెబుతున్నారు. వీరిలో కొందరిని కోరుకొండ డీఎస్‌పీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇక్కడ వైసీపీలో విభేదాలు కూడా బయటపడడం గమనార్హం. రాజా వర్గీయుల దాడిలో గాయపడినట్టు చెబుతున్న దీపక్‌ను వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ బుధవారం సాయంత్రం పరామర్శించారు. దళితులపై దాడులు ఎవరు చేసినా సహించేది లేదని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ సీతానగరంలో మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల సమాచారాన్ని బయటకు తీస్తుండడంవల్లే దీపక్‌ మీద  ఈదాడి జరిగిందని ఆరోపించారు.

నిందితులపై అట్రాసిటీ కేసు: డీఎస్పీ సత్యనారాయణ 

సీతానగరం, సెప్టెంబరు 15: సీతానగరం జూనియర్‌ కళాశాల గణిత అధ్యాపకులు పులుగు దీపక్‌పై దాడి కేసులో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని కోరుకొండ నార్త్‌జోన్‌ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరుతో మాట్లాడుతూ అధ్యాపకుడు పులుగు దీపక్‌ కారులో వస్తుండగా సీతానగరం స్టేట్‌బ్యాంకు వద్ద కారుపై దాడి చేసి ఆయనను బయటకు లాగే ప్రయత్నం చేశారని, ఇంతలో అక్కడికి కానిస్టేబుల్‌ వెళ్లడంతో ఘర్షణను నిరోధించారని అన్నారు. ఈ సంఘటనలో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు నలుగురు పేర్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇంకా కొన్ని పేర్లు రావాల్సి ఉందన్నారు. 

సూత్రధారులతో సహా జైలుకు పంపిస్తాం: ఎంపీ భరత్‌

సీతానగరం, సెప్టెంబర్‌ 15: గణిత అధ్యాపకుడిపై దాడి సంఘటనలో సూత్రధారులను, పాత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కటకటాల వెనక్కు పంపుతామని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు. బుధవారం ఆయన సీతానగరంలో జూనియర్‌ కళాశాల గణిత అధ్యాపకులు పులుగు దీపక్‌ను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి దాడులు జరగడం దుర్మార్గమని, దురదృష్ణకరమని, ఇలాంటివి జరగకుండా తాను ముందుంటానని స్పష్టం చేశారు. ఒక మంచి వ్యక్తిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు భయాందోళన చెందకుండా ఉండేలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి, ఐజీల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. పురుషోత్తపట్నం బాధిత రైతులు రచ్చబండ కార్యక్రమంలో తనకు వినతిపత్రం ఇస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అధ్యాపకుడిపై దాడిని ఖండిస్తున్నాం: మాజీ ఎమ్మెల్యే వెంకటేష్‌

సీతానగరం, సెప్టెంబరు 15: సీతానగరంలో గణిత అధ్యాపకుడిపై జరిగిన దాడిన టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తెలిపారు. దాడికి గురైన పులుగు దేపక్‌ను బుధవారం ఆయన నివాసంవద్ద కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియా గురించి గతంలో ప్రశ్నించినందుకు దళితుడిపై శిరోముండనం చేశారని, ఇప్పుడు ఇసుక మాఫియానే అధ్యాపకుడిపై దాడిచేసిందని అన్నారు. ఇక్కడి అక్రమాలు సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నాడనే నెపంతో ఆయనపై దాడి జరిగిందన్నారు.

ఎంపీగారూ పార్టీలో చిచ్చుపెట్టొద్దు: వైసీపీ నాయకుల విజ్ఞప్తి

రాజానగరం, సెప్టెంబరు 15: ఎంపీ భరత్‌రామ్‌ వైసీపీలో గెలుపొంది పార్టీలో ఉంటూ, ఇతర పార్టీల వారికి అండగా నిలుస్తూ పార్టీలో చిచ్చుపెడుతున్నారని వైసీపీ మండల కన్వీనర్‌ దూలం పెద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ వైఖరిపై పలువురు నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో ఉంటూ జక్కంపూడి వ్యతిరేక వర్గీయులకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి పయనిస్తే బాగుంటుందని, లేకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్పంచ్‌ కుందేటి ప్రసాద్‌,వైసీపీ నాయకులు గంగి శెట్టి సోమేశ్వరరావు,మండారపు వీర్రాజు,వాసంశెట్టి పెద్ద, గొర్రెల శివ, కొల్లి వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-16T06:25:41+05:30 IST