ఎగసిన నిరసన

ABN , First Publish Date - 2021-10-21T06:57:20+05:30 IST

తెలుగుదేశం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం బంద్‌ పాటించారు.

ఎగసిన నిరసన
పిఠాపురంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను తాడుతో అడ్డుకుంటున్న పోలీసులు

 వైసీపీ దాడులపై జిల్లావ్యాప్తంగా రగిలిన టీడీపీ శ్రేణులు
  ఎక్కడికక్కడ భారీగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు
  జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌.. సీఎం దిష్టిబొమ్మల దహనం
 ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు.. నేతల ముందస్తు గృహనిర్బంధాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) తెలుగుదేశం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం బంద్‌ పాటించారు. ఎక్కడికక్కడ నిరసన, ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. ఉదయం ఆయా మండలాల్లో ఆర్టీసీ బస్టాండ్లకు వెళ్లి బంద్‌కు సహకరించాలని నేతలు కోరారు. అటు నేతల పిలుపుతో వాణిజ్య దుకాణాలు, బ్యాంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే టీడీపీ బంద్‌ ను ఎక్కడికక్కడ విఫలం చేసేందుకు బుధవారం ఉదయం నుంచే పోలీసులు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల ఇళ్లకు వెళ్లి బంద్‌లో పాల్గొనవద్దంటూ గృహనిర్బంధం చేశారు. అయినా ఎక్కడా నేతలు దీన్ని ఖాతరు చేయలేదు. సామర్లకోట రైల్వేస్టేషన్‌ సెంటర్లో మాజీ హోంమంత్రి రాజప్ప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్‌కు, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజప్పతోసహా మిగిలిన నేతలందరినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీ పీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబును ప్రతిపక్షనేత జగన్‌ అనరాని మాటలు అన్నారని, అయినా ఏనాడు తాము దాడులకు తెగబడలేదని గుర్తుచేశారు. తాము కూడా వైసీపీలా ఆలోచిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. డీజీపీ పోలీసు చట్టాలను వదిలి అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి బంద్‌ చేపట్టేందుకు సిద్ధమైన సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటిముందు నేతలతో సహా బుచ్చయ్యచౌదరి రోడ్డు పై బైఠాయించారు. దీంతో వీరందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జగ్గంపేటలో పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ స్థానిక స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. ప్రశాంత బంద్‌కు తాము పిలుపునిస్తే పోలీసులు అతి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారపార్టీ నేతలకు ఒక రూలు, ప్రతిపక్ష నేతలకు మరొక రూలా? అని మండిపడ్డారు. దీంతో నెహ్రూతో సహా మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనపర్తిలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయినా ఎదురించి బంద్‌ నిర్వహించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా క్యాడర్‌తో ఆందోళన చేపట్టారు. దీంతో వీరందరిని అరెస్టు చేసి రాయవరం స్టేషన్‌కు తరలించారు. కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ కేడర్‌ బంద్‌ పాటించారు. నగరంలో ర్యాలీ చేయడానికి బయలుదేరగా బయటకురాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే మోహరించిన వందలాది మంది పోలీసులు నేతలందరిని ఈడ్చిపాడేశారు. రెక్కలు విరిచి ఈడ్చు కెళ్లి బస్సుల్లో కుక్కారు. ఈ క్రమంలో అనేకమంది నేతల చొక్కాలు చిరిగిపోయాయి. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జగన్‌ రాజారెడ్డి రాజ్యాంగానికి డీజీపీ వత్తాసు పలుకుతున్నారు. మరోపక్క టీడీపీ బంద్‌కు జనసేన తరఫున పీఏసీ సభ్యులు పంతం నానాజీ మద్దతు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చి నేతలకు మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆధ్వర్యంలో వందలాది మందితో నిరసన ప్రదర్శన జరిగింది. పోలీసులు భారీగా మోహరిం చి వర్మతోసహా నేతలందరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వర్మతోపాటు మిగిలిన నేతలందరిని కింద పడేశారు. అరెస్టు చేసి కారు ఎక్కించారు. అయితే కారు ముందుకు వెళ్లకుండా పార్టీ కార్యకర్తలంతా అడ్డంగా పడుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోపక్క టీడీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించడానికి ఏర్పాట్లు చేశారు. ఇది కలకలం రేపింది. అంతకుముందు పార్టీ నేతలు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంలో పోలీసుల తీరుతో వాసుకు గాయాలయ్యాయి. తెలుగు యువత అధ్యక్షుడు సతీష్‌రాజు ఆధ్వర్యంలో రావులపాలెంలో జాతీయ రహదారిపై జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనం తరం హైవేపై బైఠాయించి నిరసన  వ్యక్తం చేయగా, వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరంలో జాతీయ రహదారిపై వైసీపీ దాడులకు వ్యతిరేకంగా టీడీపీ మానవహారం చేపట్టింది. దీంతో భారీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముమ్మిడివరం లో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో 216 జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు భారీగా నిలిచిపోయాయి. మరోపక్క ప్రత్తిపాడు నియోజకవర్గం అంతటా బంద్‌తో ప్రైవేటు విద్యాసంస్థలు, వాణిజ్య దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఉప్పలగుప్తంలో టీడీపీ బంద్‌కు మద్దతుగా ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు. ఉప్పలగుప్తం స్టేషన్‌ వద్ద నేతలు ఆందోళనలకు దిగారు. అంతకుముందు బంద్‌ చేపట్టకుండా మాజీ ఎమ్మెల్యే ఆనందరావుతోపాటు మరికొందరు నేతలను పోలీసులు నిర్బందించారు. మండపేటలో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. తునిలో పార్టీ ఇన్చార్జి కృష్ణుడు ఆధ్వర్య్లంలో ఆందోళనలు జరిగాయి. రామచంద్రపురంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీడీపీ శ్రేణులు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించాయి. కాగా కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమలో పలుచోట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ బంద్‌కు పోటీగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వీటికి పోలీసులు దగ్గరుండి మరీ భద్రత కల్పించి మద్దతుగా నిలవడం విశేషం.

Updated Date - 2021-10-21T06:57:20+05:30 IST