‘ఫ్యాన్స్‌’ గొడవ!

ABN , First Publish Date - 2020-11-26T05:58:30+05:30 IST

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల..

‘ఫ్యాన్స్‌’ గొడవ!
ఫ్లెక్సీనీ లాగుతున్న దాడి, ఘటనపై వాగ్వివాదం చేసుకుంటున్న దాడి, బద్రీనాద్‌

పశ్చిమ వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు

దాడి వర్సెస్‌ పీవీ సురేష్‌

‘జగనన్న తోడు’ ప్రారంభోత్సవంలో గలాటా

ఫ్లెక్సీ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రగడ 

నేతల అనుచరుల మధ్య తోపులాట 

పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం 


మల్కాపురం(విశాఖపట్నం): విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశం వేదిక వద్దే ఇరువర్గాలు తోపులాటలు దిగాయి. రెండు రోజుల కిందట 58వ వార్డు వైసీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి పీవీ సురేష్‌ పిలకవానిపాలెంలో బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో బుధవారం జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవ వద్ద వీరి విభేదాలు మరోసారి బయటపడ్డాయి.


మల్కాపురం మరిడిమాంబ కల్యాణ మండపంలో బుధవారం ఏడు వార్డులకు సంబంధించి ‘జగనన్న తోడు’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మళ్ల విజయప్రసాద్‌కు స్వాగతం పలుకుతూ కల్యాణ మండపం ప్రధాన ద్వారం వద్ద 60వ వార్డు వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి పీవీ సురేష్‌ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన దాడి సత్యనారాయణ దానిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. పీవీ సురేష్‌ అనుచరుడు సంతోష్‌ను పిలిచి ఫ్లెక్సీని తొలగించాలని కోరారు. అందుకు అతను అంగీకరించలేదు. ఫ్లెక్సీని తొలగించకుండా అడ్డుగా నిలుచున్నాడు. దీంతో దాడి సత్యనారాయణ...అతడిని లాగేసి ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దానిని కాలితో తంతూ పక్కవార్డు నుంచి ఇక్కడకు వచ్చి ఫ్లెక్సీ పెట్టడమేమిటని ఆగ్రహంతో ఊగిపోయారు.


ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి, తోపులాట జరిగింది. ఈ గొడవలో ఫ్లెక్సీ చిరిగిపోయింది. ఆ సమయంలో అక్కడే వున్న వైసీపీ నాయకుడు కలిదిండి బద్రీనాథ్‌ జోక్యం చేసుకుని, ఏడు వార్డులకు సంబంధించిన కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీని ఏర్పాటుచేశారని, ఇలా ప్రవర్తించడం సరికాదని సత్యనారాయణకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వినిపించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య మరోసారి తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.


ఇంతలో అక్కడకు చేరుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మళ్లకు జరిగిన విషయాన్ని వివరించేందుకు దాడి సత్యనారాయణ యత్నించగా, ‘నాకు అన్నీ తెలుసు. ఇష్టమైతే సమావేశానికి రండి, లేదంటే వెళ్లిపోండి...’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు ఎవరిదైతే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మల్కాపురం సీఐ దుర్గాప్రసాదన్‌ను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మళ్ల ఒక్కరే మాట్లాడి ముగించేశారు.

Updated Date - 2020-11-26T05:58:30+05:30 IST