మాతోనే ఆటలా

ABN , First Publish Date - 2020-05-23T07:57:38+05:30 IST

గ్రామ సచివాలయాలకు వేసిన వైసీపీ రంగులు మార్చాలన్న తమ ఆదేశాలను ఏ‘మార్చ’డంపై రాష్ట్ర హైకోర్టు ..

మాతోనే ఆటలా

అవి వైసీపీ పతాక ప్రతిబింబాలే.. 

పాడిపంటల పేరిట సమర్థనా!..

సదుద్దేశం లేనందునే కొత్త జీవో

కోర్టు తీర్పుతో ఆటలు వద్దు.. 

ఈనెల 28వ తేదీలోగా మార్చాల్సిందే..

లేదంటే... మా ముందుకు రావాలి!.. తేల్చిచెప్పిన హైకోర్టు

జీవో 623 రద్దు..

సీఎస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కేసు గ్రామసచివాలయ రంగులపై హైకోర్టు తీర్పు


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలకు  వేసిన వైసీపీ రంగులు మార్చాలన్న తమ ఆదేశాలను ఏ‘మార్చ’డంపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఆకుపచ్చ, నీలం, తెలుపును అలా ఉంచి... కొత్తగా ఎర్రమట్టి రంగు కలుపుతూ జారీ చేసిన జీవో నంబరు 623ను రద్దు చేసింది. ఈ రంగులు ముమ్మాటికీ వైసీపీ పతాకాన్ని ప్రతిబింబిస్తున్నాయని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల పతాకాన్ని పోలిన రంగులు వేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ వైసీపీ పతాకం రంగులకు మరో రంగు అదనంగా జోడిస్తూ.. నాలుగు రంగులు వేసేలా రాష్ట్రప్రభుత్వం జీవో 623 జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా అంగలకుదురుకు చెందిన సూర్యదేవర వెంకటరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే వాదోపవాదాలను ఆలకించిన ధర్మాసనం.. శుక్రవారం తీర్పు వెలువరించింది. 


అందులో సందేహమే లేదు..: ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వైసీపీ పతాక రంగులకు ప్రతిబింబంగా ఉన్నాయనడంలో సందేహం లేదని, అధికారులు తమ కౌంటర్‌ అఫిడవిట్‌లో ఆ రంగులకు పాడిపంటలకు సంబంధించినవంటూ తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారని ధర్మాసనం దుయ్యబట్టింది. ప్రభుత్వ భవనాలకు రంగులు ఖరారు చేసేందుకు ఏర్పాటైన కమిటీ సైతం ఎలాంటి కృషి చేసినట్లు లేదని పేర్కొంది. ఆ కమిటీ తగిన బాధ్యతతో వ్యవహరించలేదని, తమ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నట్లు లేదని తెలిపింది. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ దాటవేయడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టింది. ‘పాడిపంటలకు సంబంధించిన రంగులేస్తున్నామంటూ, ఆ వంకతో కోర్టు ఉత్తర్వులతో ఆడుకోరాదు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా వారికి సంబంధించిన పతాక రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పరిపాటిగా మారింది. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది’ అని స్పష్టం చేసింది.


ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దని తాము స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ, దానిపై సదుద్దేశం లేక మరోమారు ప్రభుత్వం తమ పార్టీ పతాక రంగులు వేయడానికి పూనుకుందని పేర్కొంది. ఆ రంగులు వైసీపీ పతాక రంగులను పోలి లేవంటూ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు కూడా తమనే సమర్థించిందని గుర్తు చేసింది. ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా తొలి మూడు రంగులకు ఎర్రమట్టి రంగు అదనంగా చేర్చి ప్రభు త్వం తన ఉద్దేశాన్ని పరోక్షంగా నెరవేర్చుకునేందుకు జీవో జారీచేసిందని వ్యాఖ్యానించింది. ఆ రంగుల్ని తొలగిస్తారో లేదో చెప్పాలని తగినంత గడువిచ్చినా ఎలాంటి సమాచారం లేకపోయిందని పేర్కొంది.  పిటిషనర్‌ తరఫున న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపించారు.


సీఎస్‌ కోర్టు ధిక్కరణ

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల పతాకాలను పోలిఉండే రంగులు వేయరాదని.. ప్రస్తుతం వేసి ఉన్న రంగులను తొలగించాలని గత మార్చిలో తాము జారీ చేసిన ఆదేశాలను సరిగ్గా అమలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు... పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌లపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. వారి వైఖరి ఏమాత్రం సరి కాదని పేర్కొంది. రంగుల తొలగింపుకు సంబంధించి గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఈ నెల 28వ తేదీలోగా అమలు చేయాలని, లేనిపక్షంలో ఆ ముగ్గురూ నేరుగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నిర్దేశించింది. అయితే... కోర్టు ఉత్తర్వుల అమలుపై వారికి తగిన స్వేచ్ఛ ఉందని పేర్కొంది. సీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై కోర్టు ధిక్కరణ కింద కేసు తయారు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.10 వేలు పొందేందుకు అర్హులని పేర్కొంది.

Updated Date - 2020-05-23T07:57:38+05:30 IST