కార్ల స్టాండుపై.. కార్పొరేటర్‌ కన్ను!

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

: వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌ కన్ను ఎన్‌టీఆర్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న టాక్సీ స్టాండ్‌పై పడింది. ఆ స్టాండ్‌ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి కష్టాన్ని పిండుకొనేందుకు తాజాగా వ్యూచరచన చేశాడు.

కార్ల స్టాండుపై.. కార్పొరేటర్‌ కన్ను!
ఆందోళనకు దిగిన కార్‌ స్టాండ్‌ డ్రైవర్లు

 నెలకు ఒక్కో కారుకు రూ.వెయ్యి చెల్లించాలి

లేదంటే కారు స్టాండు స్వాధీన చేసుకుంటాని బెదిరింపు 

కారు డ్రైవర్ల ఆందోళన

ఎమ్మెల్యే ముస్తఫా, పోలీసు అధికారులకు ఫిర్యాదు


గుంటూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌ కన్ను ఎన్‌టీఆర్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న టాక్సీ స్టాండ్‌పై పడింది. ఆ స్టాండ్‌ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి కష్టాన్ని పిండుకొనేందుకు తాజాగా వ్యూచరచన చేశాడు. నెలకు మొత్తంగా రూ.50 వేలు వసూలు చేసి తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు. లేకుంటే పోటీగా అదే స్థలంలో తన అనుచరులతో కొత్త టాక్సీ స్టాండ్‌ పెడతానని బెదిరిస్తూ వస్తున్నాడు. శుక్రవారం 10 కార్లు తీసుకొచ్చి అక్కడ దింపేశాడు. దీంతో దశాబ్ధాల తరబడి అక్కడ ఉపాధి పొందుతున్న వారు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులు, ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫాకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోటీగా ట్యాక్సీ స్టాండ్‌ పెట్టడంతో వారంతా నిశ్చేష్ఠులయ్యారు. 

ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ట్యాక్సీ స్టాండ్‌లో మొత్తం 55 మంది కార్మికులున్నారు. వీరు గత మూడు, నాలుగు దశాబ్ధాల నుంచి బస్టాండ్‌ నుంచి వచ్చే వారిని ఎక్కించుకొని గమ్యస్థానాలకు దింపుతూ ఉపాధి పొందుతున్నారు. ఇటీవలకాలంలో ఆటోల సంఖ్య పెరిగిపోవడంతో వీరికి రోజంతా కష్టపడినా నామమాత్రంగానే సంపాదన ఉంటోంది.  ఇదిలావుంటే వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌ కన్ను ఈ స్టాండ్‌పై పడింది. ఒక్కో కారుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేసి తనకు నెలకు రూ.50 వేలు ఇవ్వాలని షరతు పెట్టాడు. గత మూడు రోజుల నుంచి ఈ వివాదం నలుగుతోంది. తమకే బాడుగలు లేవని,  రూ.వెయ్యి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని కార్మికులు ససేమిరా అన్నారు. దాంతో ఆ చోటా నాయకుడు పోటీగా 10 మంది అనుచరులతో పాత కార్లు తీసుకొచ్చి పోటీగా స్టాండ్‌ పెట్టాడు. దీనిపై డ్రైవర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీసు అధికారులు, ఎమ్మెల్యే ముస్తఫాకి శుక్రవారం ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో రాత్రి వారంతా ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసు  అధికారులకు, నగరపాలక సంస్థ మేయర్‌కు, వైసీపీ నాయకులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు.

Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST