ప్రలోభాల వల.. ఉపసంహరణకు ధర

ABN , First Publish Date - 2021-03-03T06:54:54+05:30 IST

జన బలంతో గెలవలేమని స్పష్టమైపోయింది. దీంతో అధికారపక్షం ప్రలోభాల బాట పడుతోంది.

ప్రలోభాల వల.. ఉపసంహరణకు ధర

మచిలీపట్నంలో రూ.10 లక్షలకు పైమాటే

విజయవాడలో రూ.20 లక్షలు

టీడీపీ అభ్యర్థులతో వైసీపీ బేరాలు

బలమైన ప్రత్యర్థి ఉన్నచోట ఎంతకైనా రెడీ

జనంలోకి వెళ్లి గెలవలేమనే భయంతోనే!

తొలి రోజు 221 నామినేషన్ల ఉపసంహరణ

నూజివీడు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఉపసంహరణ

ఉయ్యూరు 15వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే బాట


జన బలంతో గెలవలేమని స్పష్టమైపోయింది. దీంతో అధికారపక్షం ప్రలోభాల బాట పడుతోంది. స్థానాన్ని బట్టి.. ప్రత్యర్థి బలాన్ని బట్టి రేటును నిర్ణయిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఉపసంహరణ ఘట్టానికి మంగళవారం తెరలేచింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈలోగా బలమైన ప్రత్యర్థులను ప్రలోభ పెట్టి ఎన్నికల బరి నుంచి తప్పించాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ నాయకులు చకచకా పావులు కదుపుతున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే భారీ మొత్తాలను ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : రాజధాని తరలింపు.. అలవికాని రీతిలో పెరగనున్న ఆస్థిపన్ను.. అభివృద్ధిని గాలికొదిలి సంక్షేమ జపం.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు.. పెట్రో ధరల మంట ఇవన్నీ అధికార వైసీపీపై సామాన్య జనంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ నేపథ్యంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధనబలం, కండబలంతో గెలిచిన వైసీపీ అదే సూత్రాన్ని మున్సిపల్‌ ఎన్నికలకూ వర్తింప చేయాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. స్థానిక అభ్యర్థుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ మున్సిపోల్స్‌లో పార్టీలు నేరుగా పోటీపడతాయి. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే పార్టీ పరువుపోతుందని అధికారపక్షం భావిస్తోంది. ఫలితంగా ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రలోభాలకు తెరదీశారు. నేరుగా అభ్యర్థులతో బేరాలు మొదలుపెట్టారు. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే భారీ మొత్తాలను ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఫలితంగా నూజివీడు మున్సిపాలిటీలో 30వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉయ్యూరు నగర పంచాయతీలో 15వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే పరిస్థితి. తిరువూరు, మచిలీపట్నంల్లోనూ ప్రలోభాలపర్వం జోరుగా నడుస్తోంది. 


రూ.20 లక్షల వరకు బేరాలు..

మచిలీపట్నంలో ఓ డివిజన్‌ నుంచి పోటీ  చేస్తున్న టీడీపీ అభ్యర్థికి మంత్రి సన్నిహితుడి నుంచి ఫోన్‌ వచ్చింది. నామినేషన్‌ ఉపసంహరించుకుంటే రూ.10 లక్షలు ఇస్తామని, దాంతోపాటు కార్పొరేషన్‌లో పనులు కూడా అప్పజెపుతామన్నది దాని సారాంశం. తమ మాట వింటే సరి. లేకుంటే బాధపడాల్సి వస్తుందని సుతిమెత్తగా హెచ్చరిక కూడా చేశారు. విజయవాడ డివిజన్‌లో ఓ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థికి నామినేషన్‌ ఉపసంహరించుకుంటే రూ.20లక్షలు ఇస్తామని అధికారపక్షం నాయకులు ఆఫర్‌ చేశారు. తొలుత అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నం  చేస్తున్న వైసీపీ నాయకులు ఆ ప్రయత్నం ఫలించకపోతే బెదిరింపులకు సైతం వెనకాడటం లేదు. కార్పొరేటర్‌గానో.. కౌన్సిలర్‌గానో గెలిచినా ఆ సంతోషం లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. కొందరు కులసంఘాల నాయకులను రంగంలోకి దింపి వారితోనూ ఆయా కులాల అభ్యర్థులకు ఫోన్లు చేయిస్తున్నారు. 

Updated Date - 2021-03-03T06:54:54+05:30 IST